కమ్యూనిజం రావాలంటే కమ్యూనిస్టు పార్టీ రద్దు కావాలి !
భూమి మీద స్వర్గం లాంటి మరొక ప్రపంచం సాధించుకోవడమే కమ్యూనిజం అనీ క్లుప్తంగా అనుకున్నాం కదా !? అలాంటి మరో ప్రపంచం రావడం అసాధ్యమా !? అందుకే స్వర్గం - నరకం ఉన్నాయా !?
-------- ఇది ఒక రకం ఆలోచన.
స్వర్గం నరకం రెండూ భూమి మీదనే ఉన్నాయి . దోపిడీ రహిత సమాజం స్వర్గం అనీ , దోపిడీ ఉన్న సమాజం నరకం అనీ , నరకంగా ఉండే అంశాలను పోరాడి తొలగించుకోవాలనీ , మనిషి సృష్టించిన ఈ దోపిడీని దానికి గురయ్యే మనుషులే అనివార్యంగా రూపుమాపుతారనీ అది సాధ్యమేననీ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం పరిశీలిస్తే మరో ప్రపంచం సాధన అసాధ్యమైనది కాదనీ అది మానవ సమూహం అనివార్యంగా సాధించుకోవలసిన ఒక బృహత్తర కార్యమనీ అవగతమవుతుంది.
-------- ఇది మరో రకం ఆలోచన.
మానవుడే మహనీయుడు . శక్తిపరుడు - యుక్తిపరుడు మానవుడే . ఎప్పటికప్పుడు మానవుడు తన అవసరాలను తీర్చుకునేందుకు , జీవనవిధానాన్ని మెరుగుపరచుకునేందుకు శ్రమ + ఆలోచన అనే ఆయుధాలతో కృషి చేస్తుంటాడు. వ్యక్తిగత విశ్వాసాలు , నమ్మకాలతో పని లేకుండా ప్రపంచ వ్యాపితంగా మనుషులెవరైనా కార్యాచరణలో చేసేది ఇదే .
శ్రమ + ఆలోచన అనే ఆయుధాలను ఎలా ఉపయోగిస్తాడు ? అనేది ఆలోచిస్తే దొరికే సమాధానం - " మనుషులు కలసికట్టుగా ప్రకృతి పై ఆధారపడుతూ ప్రకృతి శక్తులను ఉపయోగించుకుంటూ సామూహిక జీవనాన్ని కొనసాగిస్తారు. ఇందుకోసం కట్టుబాట్లతో మానవసమాజం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కట్టుబాట్లు ఎలా ఉండాలి ? ఎలా ఉన్నాయి ? ఏ కట్టుబాటు ఎందుకు ఏర్పడింది ? ఎల్లప్పుడు ఒకే విధమైన కట్టుబాట్లతో మానవ జీవితం కొనసాగుతుందా !? ఏవి అవసరమైన కట్టుబాట్లు ? ఏవి అవసరం లేని కట్టుబాట్లు ? కట్టుబాట్లకు కట్టుబడాల్సిన అవసరం మనిషికి ఉందా ?
లేదంటే - ఎందుకు ? ఎలా ?
ఉందంటే - ఎందుకు ? ఎలా ?
వీటిని అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా ఏర్పాటు చేసుకునే వీలుందా ? ఉంటే అది ఎలా ఉంటుంది ? ఇవి తెలుసుకునేందుకు అలాంటి ఒక ఉన్నత సమాజం సృష్టించుకునేందుకు ఏర్పడినదే కమ్యూనిస్టు ప్రణాళిక. దీని ప్రకారం ఆయా దేశాల స్థానిక పరిస్తితులకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడతాయి. కమ్యూనిస్టు పార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భం లో అనివార్యంగా ఒక వర్గానికి ( దోపిడీ చేసే ) వ్యతిరేకంగా పని చేస్తుంది. వర్గదోపిడీ రద్దయి ఒకానొక చైతన్యస్థితికి మానవ సమాజం చేరుకున్నాక కమ్యూనిస్టు పార్టీ కూడా ... అంటే మానవసమాజ మనుగడకు అవసరం లేని పార్టీలు అన్నీ రద్ధవుతాయి. అప్పుడే కమ్యూనిస్టు సమాజం ఏర్పడుతుంది.
ప్రజా చైతన్యం అత్యంత ఉన్నత స్థాయిలో ఉండే ఆ సమాజం లో మానవులు సమూహంగా , ఐకమత్యంగా , ఒకే కుటుంబం - ఒకే ప్రపంచం గా తమ అవసరాల కోసం , ఎప్పటికపుడు మెరుగైన పరిస్తితుల కోసం ప్రకృతితో పోరాటం కొనసాగిస్తూ వుంటారు. ఇలాంటి ఒక అత్యున్నత మానవ జీవన విధానాన్ని ఇప్పటి పరిస్తితులలో ఆషామాషీగా ఊహించడం అంత తేలిక కూడా కాదు.
కానీ ఈ ప్రకృతిని , మానవ జీవన పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటే అటువంటి ఉన్నత సమాజం అసాధ్యం కాదనీ పైగా అది అనివార్యం అనీ అవగతమవుతుంది.
ఈ క్రమం లో మనకు చాలా అనుమానాలు , ప్రశ్నలు రావడం అత్యంత సహజం. సమాజం లో మార్పు కమ్యూనిస్టులే తీసుకు రావాలా ? దానంతట అది రాదా ? ఇపుడున్న పార్టీలు చాలవా ? వర్గపోరాటం పేరుతో మనం మనుషులని చీల్చాలా ? మంచి వ్యక్తులు మంచి ఆలోచనలతో - మంచి బోధనలతో సమాజాన్నీ మార్చలేరా ? మార్క్సిజం విఫలమయింది కదా ? ఈ బూజు పట్టిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఇంకా వేలాడడమ ఏమిటి ? ఇలాంటి అనేక ప్రశ్నలతో పాటు కమ్యూనిస్టులపై ద్వేషంతో విషం కక్కే విపరీత విమర్శలు కూడా ఉంటాయి.
కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్నతమైనది కాబట్టి అసలు దానిని విమర్శించకూడదనుకోవడం చాలా తప్పు. మార్క్సిజమే పరిపూర్ణమైన సిద్ధాంతం అని మొండిగా వాదించడం కూడా మార్కిజానికి ద్రోహం చేసే అంశమే అని నా అభిప్రాయం.
మార్క్సిజాన్ని విమర్శించాలంటే ముందు మార్క్సిజం గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఇదిగో ఇందులో ఈ లోపాలు ఉన్నాయి? కనుకు ఇది ఈ విధంగా తప్పు . ఈ విధంగా దీనివల్ల ప్రమాదం ఉంది.ఈ కారణాల చేత ఇది ఆచరణకు సాధ్యం కాదు. దీనిలో ఈ లోపాలున్నాయి? వాటికి ఇదిగో ఈ ప్రత్యామ్నాయాలు ఉన్నయి? అని చెప్పగలిగితే అది సరైన విమర్శ అవుతుంది. ఇవన్నీ సరిగా చేయాలంటే ముందు మార్క్సిజం గురించి అధ్యయనం చేయాలి .
మార్క్సిజం గురించి అధ్యయనం చేయకుండా దానిని పైపైన చర్చిండం కానీ , విమర్శించడం కానీ చేయడం వల్ల ఫలితం సరిగా ఉండదు.
అందుకే మనం మార్క్సిజం గురించిన ప్రాధమిక " అధ్యయనం " ను ఒక్కో అంశాలవారీగా కొనసాగిద్దాం. చర్చిద్దాము.
దీని తరువాత పోస్టు : అందరూ సమానం ఎప్పటికీ అసాధ్యం