చర్చాంశం - తెలుగు వ్యాకరణం
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.
-------------------------------------
అందరికీ నమస్కారం !
తెలుగు భాషపై చర్చద్వారా భాషాభివృద్ధికి దోహదం చేస్తున్న బ్లాగుమిత్రులకు పేరు పేరునా నమస్కారం. పల్లెప్రపంచం విజన్ లో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం అనేది కూడా ఒక అంశం. దానిలో భాగమే ఇక్కడ తెలుగు భాషపై ప్రశ్నలు తప్ప ఏ ఒక్కరినీ నిందించే ఉద్దేశం లేదు. ఎక్కడైనా అలవాటుగా పొరపాటు పదాలు నానుండి గానీ చర్చలలో పాల్గొంటున్నవారు గానీ చేస్తే ముందు ఆ చేసినవారు తమ పొరపాటుని సరిచేసుకోవాలి. ఆ పొరపాటువల్ల బాధపడినవారు వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా చర్చవల్ల అందులోని అంశం వల్ల నిజంగా భాషాభివృద్ధికి దోహదముందంటే ఓపికగా చర్చలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగులో అక్షరాలకు సంబంధించిన చర్చకూ, పాఠ్య పుస్తకాలలో గందరగోళ పదాలకు సంబంధించిన వాటిపై శ్రీకాంత్ చారి గారి బ్లాగు గుండెఘొష లో, మిత్రులు గుండు మధుసూదన్ గారి కామెంట్లు బాగున్నాయి. అవి అందరికీ చేరితే ఇంకా ప్రయోజనం ఉంటుందని మధు గారి అనుమతితో ఇక్కడ పోస్టుగా ఉంచుతున్నాను. అదే విధంగా తెలుగు భాషలో క్ష అనేది అక్షరమే అంటూ ఆయన ఇచ్చిన వివరణనూ క్రింద ఇస్తున్నాను. నేనింత వరకు తెలుగుకు 56 అక్షరాలే అని అనుకుంటుంటాను. క్ష సమ్యుక్తాక్షరమనీ తెలుసు. ఆ తెలిసింది మా తెలుగు మాష్టారైన వజ్రాల పరబ్రహ్మం గారు చెప్పినదే.తెలుగు వర్ణమాలపై నేను వ్రాసిన పోస్టుకోసం ఇక్కడ నొక్కండి. క్ష గురించి నిజంగా అది ప్రత్యేకత కలిగి ఉన్నందున తెలుగు వర్ణమాలలో చేర్చాలనేదే నా డిమాండ్ కూడా. ఆ అభిప్రాయాన్ని ఎక్కడో కామెంట్ కూడా పెట్టినట్లు గుర్తు. ఈ మూడు విషయాలపై గుండు మధు సూదన్ గారి అభిప్రాయాలను యథాతధంగా ఇక్కడ ఉంచుతున్నాను. అక్షరాలు మరియు గాంధిక పదాల గందరగోళం తగ్గడానికి ఇంకా మెరుగైన అభిప్రయాలకు ఆహ్వానం పలుకుతున్నాను. మిత్రులు మధుసూదన్ గారికి నా తరపున పల్లెప్రపంచం తరపున ధన్యవాదములు.
- పల్లా కొండల రావు.
శ్రీకాంత్ చారి గారి బ్లాగులో గుండు మధుసూదన్ గారి కామెంట్లు:
1) అక్షరాలపై :
"మిత్రులు శ్రీకాంత్ చారిగారికి నమస్కారాలు!
పైన జరిగిన చర్చ అంతా చదివాను. చివరన ఇచ్చిన మీ అభిప్రాయాలు "వ్యావహారిక భాష"కు వర్తిస్తాయి గానీ "గ్రాంథిక భాష"కు వర్తించవు. వ్యాకరణ బద్ధమైన శబ్దస్వరూపాన్ని మన ఇష్టానుసారం మార్చడం వ్యావహారికంలో కుదిరినా, గ్రాంథికంలో కుదురనిపని. అలా చేస్తే శబ్ద సౌష్ఠవం మారి అర్థానికి విఘాతం ఏర్పడుతుంది. కాలానుగుణంగా మార్పురావాల్సిందేననే వాదం వ్యాకరణానికి కట్టుబడి వుండేంతవరకే నిలుస్తుంది. వ్యాకరణానికి కట్టుబడనట్లయితే అది వ్యావహారికానికి తప్ప గ్రాంథికానికి పనికిరాదు. అంతేకాక, పదాలకు నిర్దిష్ట, నిర్దుష్ట స్వరూపాలు ఉండడంవల్లనే నిఘంటువులో పదాలకు అర్థాలు తెలుసుకోవడం సులభతరమవుతోంది. ఇది ఏ భాషకైనా వర్తిస్తుంది. ఉదాహరణకి...colour, color అనే పదాలలో మొదటిదానికి ఉన్న సమగ్రత రెండవదానికి లేదు. అలాగే ఉచ్చారణకు దగ్గరగా ఉన్నదని దానిని kalar అనిగానీ, kolor అనిగానీ రాస్తానంటే కుదురని పనికదా! కాబట్టి మీరనే మార్పు వ్యావహారికం వరకే అంగీకరించి, గ్రాంథికానికి వ్యాకరణబద్ధతకు వ్యాఘాతం కలుగనంతవరకే మార్పును అంగీకరిస్తే సరిపోతుంది. భాషలో చాలా మార్పులొచ్చాయని మీరు వాదించినా...అది వ్యావహారికం వరకే గానీ, ఆదినుంచీ ఇప్పటివరకూ ఉన్న గ్రాంథిక భాషకు ఏ మార్పూ రాలేదు. భాషాప్రయోగ విషయంలో సాధురూపాలు తెలియనివారు ప్రయోగించినంతమాత్రాన భాషలో మార్పువచ్చినట్లుకాదు. అసాధురూపాలు కావ్యానికి పనికిరావు. వ్యవహారానికి పనికివస్తాయి. భాష మన సంస్కృతికి నిలువుటద్దం వంటిది. అది నిర్దుష్టంగా వుండాలే తప్ప, దుష్టంగా వుండకూడదు.
మరో విషయం...తెలుగుభాషను అభివృద్ధిచెందించడం అంటే మీ ఉద్దేశం గ్రాంథిక తెలుగునా, వ్యావహారిక తెలుగునా? గ్రాంథికతెలుగు మనం వృద్ధిపొందించడానికి ముందే వృద్ధిపొంది ఒక నిర్దిష్ట, నిర్దుష్ట రూపాన్ని సంతరించుకొను వున్నది. దాన్ని మనం వృద్ధిపొందించనవసరంలేదు. అయితే భాషను వృద్ధిపొందించాలనుకుంటే వ్యావహారిక పదకోశాలను తయారుచేసుకోవాలి. గ్రాంథిక పదకోశాలను తయారుచేసుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అవి ఇప్పటికే తయారుచేయబడి మనకు ఉపయోగంలో వున్నాయి. మనం చేసే భాషా వృద్ధి మన ప్రయోగానికి తగిన భాషలేనప్పుడే కావాల్సివస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న భాష పత్రికాభాష, పుస్తకభాషలకు మార్పుచేయాల్సినంత అవసరాన్ని కలిగిస్తున్నదా, లేదా? అన్నది మనం ఆలోచించాలి. అయితే ఎన్ని మార్పులు చేసినా పదం యొక్క అసలు స్వరూపం కూడా తెలిసివుండాలి...తెలియబడాలి. కాబట్టి విద్యార్థులు చిన్నతనంలోనే అక్షరమాలలోని అన్ని అక్షరాలనూ నేర్చుకోవాల్సిన అవసరం వుంది. వాళ్లల్లో కొందరు పద్యకవులు కావచ్చు, భాషావేత్తలు కావచ్చు, గ్రాంథికభాషావాదులు కావచ్చు. భాషపై సమగ్ర పరిశోధనచేసే అవసరం రావాల్సినవారుకావచ్చు. మొదలే మనం వాళ్ళకు నేర్పాల్సిన భాషాక్షరాలను నేర్పకపోతే...ఇవన్నీ వారు పొందలేరు. కాబట్టి అక్షరమాలలోని 57 అక్షరాల్నీ వాళ్ళు నేర్చితీరాల్సిందే. చిన్నతనంలో నేర్చితేనే పెద్దయింతర్వాత దానిపై వాళ్ళు సరైన అవగాహన ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన అభిప్రాయాల్ని చిన్నవారైన పసిబాలకులపై రుద్ది వాళ్ళు సరైన అక్షరమాలను నేర్చుకొనేవీలును దూరం చేయరాదనేది నా అభిప్రాయం.
భాషలో ఏ మార్పయినా వచ్చిందంటే అది వ్యావహారికభాషలోనేగానీ, గ్రాంథికంలో మాత్రం రాలేదు. వచ్చినా అతిస్వల్పం మాత్రమే. అవికూడా "పొంటె"లాంటి వ్యావహారికాలే తప్ప గ్రాంథికాలుకావు. వ్యాకరణబద్ధమైన భాషకు మార్పురాదు, రాబోదు. వ్యావహారికం నిత్యం మారుతూనేవుంటుంది. దానికోసం మనలాంటివాళ్ళు వాదించాల్సిన అవసరంలేదు. ఇప్పుడున్న సారస్వతంలో దేన్ని ఆదరించేవాళ్ళు దాన్ని ఆదరిస్తారు. కాబట్టి గ్రాంథిక సంబంధమైన పదప్రయోగాల్లో మార్పు తేవాలనుకోవడం పనికిరానిపని. వ్యావహారికం నదీప్రవాహంలాంటిది. కొత్తపదాలు వస్తుంటాయి...పాతపదాలు పోతుంటాయి. గ్రాంథికం అలాకాదు. కాబట్టి విద్యార్థులు అన్ని అక్షరాలూ నేర్చుకొనితీరాలి. కాదు కొన్ని అక్షరాలు నేర్చుకుంటే చాలు అనడం భాషకు విఘాతాన్ని కలిగించడమే. మన తాతలు, తండ్రులు నేర్చుకున్నారు. మనమూ నేర్చుకున్నాం. మరి..మన పిల్లలు నేర్చుకోవద్దా? మనం భాషా శాసకులం కాముకదా! ఏ మార్పయినా వ్యావహారికానికే పరిమితం...గ్రాంథికానికి మార్పు అంటదు. మన పిల్లలూ మనలాగే వ్యావహారికంతోపాటు గ్రాంథికాన్నికూడా నేర్చుకునే అవకాశాన్ని మనం కలిగించాలి. మన సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీనాధునిక కావ్యప్రపంచాన్ని వారికి అందుబాటులోకి తేవాలి. ఇది నా అభిప్రాయంకాదు. పిల్లల అభివృద్ధిని కోరుకొనే ప్రతివ్యక్తీ ఏర్పరచుకొనే అభిప్రాయం. చిన్నప్పుడు అర్థంకాని పద్యాల్ని వల్లెవేసిన మనం ఇప్పుడు ఆ పద్యాల్ని గుర్తుకు తెచ్చుకుని అందులోని సారాన్ని మన నిత్యజీవితంలో వాడుకొనడంలేదా? అలాగే మన పిల్లలుకూడానూ! ఇందులో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. ఎవరినీ కించపరచాల్సిన అవసరంలేదు. మార్పు రావాల్సింది ఎందులోనో స్పష్టంగా తెలిస్తే చాలు!
2) గ్రాంధిక గందరగోళ పదాలను సరళం చేయడంపై:
మిత్రులు శ్రీకాంత్ చారిగారికి, మీ ఆశయం నాకర్థమయింది. అయితే మీరన్నట్లు శిష్టవ్యావహారికంలోనే మనం ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాం. విజ్ఞాన శాస్త్రాలకూ, సాంకేతికశాస్త్రాలకూ సరిపోయే పారిభాషికపదాల అవసరం ఈ కాలంలో చాలా వుంది. దానికి సంస్కృతభాషే ఆధారం. మీరు పైన చెప్పినట్లు రశ్మ్యుద్గారత, పౌనఃపున్యం వంటి పదాలు...కఠినమైనవైనా...ఎంతో గొప్పదైన, చాలా పదాలతో వివరింపదగిన అర్థాన్ని ఇముడ్చుకున్న ప్రభావవంతమైన సమాసాలు! ఎంతో గొప్పభావాన్ని నింపుకొన్న ఇలాంటి సమాసాల రూపకల్పన చేసిన మన పూర్వులు అభినందనీయులు. ఇలాంటి పదాలకు మనం పారిభాషికపదకోశాలను తయారుచేసుకోవాలే తప్ప, సరళంగా వుండాలనడం సబబుకాదు. ఇలాంటి పారిభాషిక పదాలను సిద్ధపరచడానికి అనువైనట్లుండడం సంస్కృతభాష గొప్పతనం. దానిని సర్వదా మనం ఆహ్వానించాలి. పుస్తకములందు విద్యార్థులకై ప్రారంభమునుండి సరళ గ్రాంథికమునుఁ బరిచయము చేయుట వలన నిటువంటి కఠినమగు పారిభాషికపదములనుఁ జూచి భయపడవలసిన బాధ తప్పఁగలదుకదా!(ఇదే సరళగ్రాంథికం!) తెలుగు వర్ణమాలనుండి కొన్ని వర్ణాలను తొలగించాలనడం తగదు. ఒక్క అక్షరమును కూడా తొలగించవద్దు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రయోజనముంటుంది. ఈ విషయం తెలియని తెలుగు పాఠ్యపుస్తక రచయితలు ప్రాథమిక తరగతుల పుస్తకాలలో కొన్ని అక్షరాల్ని తొలగించడం దురదృష్టకరం. ఇక ముందైనా మన భాషలోని అన్ని అక్షరాల్ని విద్యార్థులకు నేర్పేలా ప్రణాళికలుండాలని ఆశిద్దాం.
పల్లెప్రపంచంలో పోస్టుకు అనుమతి కోరుతూ మరియు తెలుగు వర్ణమాలలో 57 అక్షరాల గురించి నేను వ్రాసిన మెయిల్ కు ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరం:
మిత్రులు పల్లా కొండల రావు గారికి నమస్కారములు!
గుండెఘోషలో నేను ప్రచురించిన వ్యాఖ్యకు స్పందించి, దానిని పల్లెప్రపంచం బ్లాగులో ప్రచురించుటకై అనుమతికోరడం సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇందుకు నేను సంతోషంగా అనుమతిస్తున్నాను. వీలుంటే మీకోరిక మేరకు మరింత సమాచారంతో అనతికాలంలోనే ఒక ఆర్టికల్ రాయగలను.
మీ సందేహం...అక్షరమాలలో 57 అక్షరాలుండడంలో వివరాలు:
అచ్చులు:(16)
అఆఇఈఉఊఋౠ
ఌౡఎఏఐఒఓఔ
ఉభయాక్షరాలు:(03)
అం అఁ అః
హల్లులు: (38)
కఖగఘఙ
చౘఛజౙఝఞ
టఠడఢణ
తథదధన
పఫబభమ
యరలవ
శషసహ
ళక్షఱ
మొత్తం: 16+03+38=57
క్షకారం...దీన్ని సంయుక్తాక్షరం కాబట్టి ఇందులో క+ష అనే రెండు హల్లులున్నాయనీ, అందుకే ’క్ష’ ప్రత్యేకాక్షరం కాదనీ అంటున్నారు. కాని...దేవనాగరి (సంస్కృతం) లిపి లో...దీనికి ప్రత్యేకాక్షరం ఉన్నది...అది: क+ष=क्ष ప్రత్యేకాక్షరంగా ఎలా అవుతున్నదో అలాగే తెలుగులో ’క్ష’ కూడా ప్రత్యేకాక్షరమే. ఇతరాక్షరంతో...ర+ష=ర్ష ను చూస్తే రకారం క్రింద గుర్తుకూ, క్షకారం క్రిందగుర్తుకూ తేడాలు లేవా? క్ష ప్రత్యేకాక్షరం కాకుంటే రకారం క్రింద ఉన్నట్టే కకారం క్రిందకూడా అదేగుర్తు ఒత్తుగా ఉండాలి. కాని అలా లేదుగదా. కాబట్టే మన పూర్వులు దీన్నిప్రత్యేకాక్షరంగా నేర్పించారు. ఇప్పటి ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులేమో అది సంయుక్తాక్షరమని భావించి దాన్ని తొలగించారు. నాకు తెలిసినది ఇది. దీనిని అనుసరించడం అనుసరించకపోవడం బోధకుల/పాఠకుల ఇష్టం.
====================================================