తెలంగాణాలో ఏం జరుగుతోంది? రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే ఆసక్తికరమైన చర్చ. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అక్షింతలు వేసినా, ఉద్యోగుల కోర్కెల విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసినా తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు తప్ప, సమ్మె విషయంలో, కార్మికుల కోరికల విషయంలో ఏమాత్రం వెనుకకు తగ్గకూడదనే కేసీఆర్ నిర్ణయించుకున్నారని అవగతమౌతుంది. దీనినాయన రాజకీయక్రీడగా మాత్రమే భావిస్తున్నారు. అవసరమైతే సుప్రీం కోర్టు మెట్లెక్కాలనే తలంపుతోనే ఉన్నారన్నది స్పష్టమవుతున్నది. సమ్మెను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు, కె.సి.ఆర్ ని అప్రదిష్టపాలు చేసేందుకు చూస్తుండడం సహజమే. శాంతిభద్రతల వైఫల్యం పేరుతొ కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న ఆశలు పెట్టుకున్నవారు కూడా కనపడుతున్నారు. అధికారపార్టీలోనూ ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతున్నవారున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని ప్రతిపక్షాలు అంచనా కడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? మొండితనమా? సాహసమా? కేసీఆర్ వ్యూహం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ సమాజం నాడి తెలిసినవాడిగా కె.సి.ఆర్ సమర్ధతపై ఎవరికీ అనుమానాలుండాల్సిన పని లేదు. తెలంగాణ ఉద్యమంలోనూ, ఆనక ప్రభుత్వం ఏర్పాటులోనూ, రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడంలోనూ, ముందస్తు ఎన్నికలకు పోయి అందరి అంచనాలనూ తలదన్నే ఘనవిజయం సాధించడంలోనూ, గెలిచాక ప్రతిపక్షాలను బలహీనపరచడంలోనూ ఆయన విజయం సాధించారు. తప్పా? ఒప్పా? అనేది పక్కనబెడితే ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళుతున్నారు. కె.సి.ఆర్ స్టైలే అంత. బారాబర్ బరితెగింపే ఆయన వైఖరి. అవసరమైన చోట ఊగిసలాటలుండవు. తెలంగాణ ఏర్పడ్డాక కుండ బద్దలు కొట్టినట్లు ఇకపై తమది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పగలిగినా, ఓట్లకోసమే తాము పథకాలు పెడతామని ఎన్నికల సమయంలోనూ ప్రకటించి ప్రజల మెప్పు పొందడమూ ఆయనకే చెల్లింది. నాన్చుడు కంటే తేల్చుడుకే ప్రజల మద్దతుంటుందన్నది కె.సి.ఆర్ నమ్మకం. అదే ఆయన విజయానికి ప్రధాన కారణం. లోక్సభ ఎన్నికలలో బి.జె.పీ గెలుపుకు కారణం తెలంగాణలో ఆ పార్టీకి బలం పెరగడం కాదని, కాంగ్రెసుతో పాటు, తమవారి తెరవెనుక అండ కారణమని కె.సి.ఆర్ భావిస్తున్నారు. కుమారుడు కె.టీ.ఆర్ భవిష్యత్తుకు అడ్డుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయంలో కూడా ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ముందడుగు వేయడానికి ఒక అడుగు వెనుకకు వేశారు. పదేండ్లు తానె ముఖ్యమంత్రినని ప్రకటించారు. రాజేందర్ వదిలిన మాటల ఈటెలను అదుపు చేయగలిగారు. రాజేందర్ ని కొనసాగించడంతోపాటు హరీష్ రావుకూ మంత్రి పదవినిచ్చారు . పార్టీలో అంతర్గత సమస్యను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తద్వారా ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసునని నిరూపించారు. ఇంతలోనే ఆర్టీసీ సమ్మె వఛ్చి పడింది. ఆర్టీసీ అనంతరం పలు ఉద్యోగ సంఘాలూ సమ్మెబాట పడతాయని పసిగట్టిన కేసీఆర్ ఆర్టీసీ విషయంలో మొండిగానూ మిగతా ఉద్యోగులకు తాయిలాలు ఇచ్ఛేలా ప్రకటనలు చేస్తున్నారు. మందిని ఏకాంగానీయకుండా, ప్రతిపక్షాలకు అండ పెరగకుండా చూస్తున్నారు. ఇందులో భాగమే ఉద్యోగుల పీ.ఆర్.సి ప్రకటన, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల ప్రకటనలు వంటివని భావిస్తున్నారు.
ప్రజలలో ఉద్యోగుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్నది కె.సి.ఆర్ అంచనాగా కనిపిస్తున్నది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎం.ఆర్.ఓ విజయారెడ్డి హత్య సంఘటనలో రెవెన్యు ఉద్యోగులు ప్రయత్నించిన నిరసన కార్యక్రమం ఆదిలోనే ప్రజలలో అపహాస్యం పాలైంది. రెవెన్యు అవినీతి పై ప్రజల ఈసడింపు, అసహ్య ధోరణి ఏ స్థాయిలో ఉన్నది అవగతం కావడానికి విజయారెడ్డి హత్యానంతరం వినపడిన కామెంట్లే సాక్ష్యం. ఎం.ఆర్.ఓ హత్యపై ప్రజలలో సానుభూతి కనపడక పోగా రెవెన్యు ఉద్యోగులు కె.టి.ఆర్ ని కలసి తమకు రక్షణ కలిపించాలని వేడుకోవడం గమనార్హం. ఇప్పటికే రెవెన్యు లో అవినీతి పెరిగిందని, పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో ఆయన ముందుకే వెళ్తారనిపిస్తున్నది. అన్ని శాఖలలో అవినీతి ఉన్నా ప్రజలకు ప్రత్యక్ష నరకం నిత్యం కనపడేది రెవెన్యూశాఖలోనే. దీనినే ఆధారం చేసుకుని కె.సి.ఆర్ రాజకీయ అస్త్రంగా ప్రయోగించబోతున్నారు. ఈ శాఖలో పెద్ద ఎత్తున మార్పులు తెఛ్చి ప్రజల మన్ననలు పొందాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజలలో, తెలంగాణ సమాజంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది ఆయన ఎత్తుగడ. రెవెన్యూ సంస్కరణలు చేసి కె.సి.ఆర్ విజయం సాధించగలిగితే, తెలంగాణా ప్రజల మన్ననలు పొందగలిగితే నిజంగా టీఆరెస్ కు వచ్ఛే ఎన్నికలలోనూ తిరుగుండదు. తేనెతుట్టె లాంటి ఈ విషయంలో కె.సి.ఆర్ రిస్క్ తీసుకుంటారా? విజయం సాధిస్తారా? అన్నది కీలక అంశం.
ప్రతిపక్షాలకు కె.సి.ఆర్ ఏ మాత్రం విలువనీయడం లేదు. ప్రజలలో వారికి బలం లేదన్నది ఆయనకు తెలుసు. విపక్షంలో ప్రజాబలం ఉన్నవారిని తనవైపుకు తిప్పుకోవడం ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపరచడమూ తెలుసు. ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సందర్భంలో ఉప ఎన్నిక జరిగిన హుజూర్నగర్ లో కాంగ్రెస్ సత్తా ఏమిటో తేలిపోయింది. కుమారుడు కె.టి.ఆర్ స్థానాన్ని బలపరచడానికీ, పార్టీలో వ్యతిరేకులను హెచ్చరించడానికి ఇది పావులా ఉపయోగపడుతుంది. ఆర్టీసీ సమ్మెకు ప్రజామద్దతు లేదని ఉపఎన్నిక గెలుపు సందర్భంగా ప్రెస్మీట్ లో కె.సి.ఆర్ స్వరంలో వినిపించింది. అది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే ప్రతిపక్షాలను ప్రజలు నమ్మకముగా గానీ , కె.సి.ఆర్ కు కనీస ప్రత్యామ్నాయంగా కూడా భావించడం లేదు. తమకు తాము తెలంగాణాలో ప్రత్యామ్నాయం గా ప్రచారం చేసుకుంటున్న భా.జ.పా కు హుజూర్ నగర్ లో కనీసం డిపాజిట్ దక్కలేదు. కేంద్రం జోక్యం చేసుకుని ఎదో చేస్తుందన్న ఆశావాదులకు కూడా తెలంగాణాలో భా.జ.పా కు అంత సీన్ లేదని అర్ధమయ్యేలా విషయం తేలిపోయింది. తాము కాకుంటే కె.సి.ఆర్ ఉండాలని కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకూడదని భా.జ.పాకు తెలుసు. కనుక అమిత్ షా బృందం తెలంగాణలో ఆచి తూచి వ్యహరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని అదే సందర్భంలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకూడదని భా.జ.పా చూస్తోంది. దీనిని తెలంగాణలో తనకు అనుకూలంగా కె.సి.ఆర్ వినియోగించుకుంటారన్నది నిస్సందేహం. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వంటి ఒకరిద్దరికి తప్ప కె.సి.ఆర్ తో పోరాడే శక్తి లేదు. హైకమాండ్ కు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే దమ్ము లేదు. కాబట్టి 'కాంగ్రెస్ లో అంతే ....' అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తుండడం సహజం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప ప్రస్తుత నాయకుల కార్యక్రమాలతోనో, నమ్మకంతోనో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఇక కమ్యూనిస్టుల సంగతి, సత్తా ఏంటో హుజూర్నగర్ ఉప ఎన్నికలో వారి వైఖరి తేల్చింది. కనీసం ఉభయ కమ్యూనిస్టులు ఒకేమాట మీద ఉంటారా? అన్నది భేతాళప్రశ్న. ఒక సమయంలో తెలంగాణా సమాజంలో కె.సి.ఆర్ కు ప్రత్యామ్నాయంగా ప్రొఫెసర్ కోదండరాం పేరు వినిపించినా ఆయన అసమర్థుడని తేలిపోయింది. కాంగ్రెస్ గూటిలో ఓ ముక్కగా మాత్రమే ఆయన తన స్థానాన్ని తానే కుదించుకోవడం కేవలం సానుభూతిని ప్రకటించడానికి మాత్రమే పనికివస్తుంది. తెలుగుదేశం ను ఏ రాముడో దిగి వచ్చి కాపాడాల్సిందే. ముఖ్యమంత్రిని డైరెక్టుగా ఢీ కొట్టే శక్తి తె.రా.సాలో యు.టి బ్యాచ్ కు ప్రస్తుతానికి లేకపోయినా కె.సి.ఆర్ ని కేవలం ఈ అంశం మాత్రమే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనిని ఎదుర్కోవాలంటే ప్రజలలో తన స్థానం మరింత బలంగా పాతుకుపోవడమే మార్గం. ఏ మాత్రం మెతకగా ఉన్నా మున్ముందు మరిన్ని సమస్యలను పేస్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కనుక ఆయన ప్రజలలో బలం పెంచుకోవడానికి రెవెన్యు సంస్కరణల అంశాన్ని ఆయుధంగా వాడబోతున్నారన్నది అంచనాగా ఉన్నది. ఎపుడు? ఎలా? ఆ అంశం లో ఎంతమేరకు సక్సెస్ అవుతారు? అన్నది వేచి చూడాల్సిన అంశం. అంతవరకూ కేసీఆర్ మొండిగానూ, సాహసోపేతంగానూ వ్యవహరించాల్సిరావడం ఆయనకు అనివార్యం.
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు లేకుంటే నియంతృత్వానికి , మొండి చర్యలకు ఎల్లపుడు విజయం ఉండదు. ఇందిరాగాంధీ, ఎన్ టి ఆర్ లాంటి విపరీత ప్రజాబలం ఉన్న శక్తులని స్వయంగా వారినే ఓడించిన ఘనత మన ప్రజాస్వామ్యానికున్నది. ఆ విషయం కె.సి.ఆర్ కు తెలియదనుకోలేము. ఓటమి దశలోనూ మొండిగా ఉండడానికి కె.సి.ఆర్ ఎన్ టి ఆర్ లాంటి వాడు కాదు. నెగ్గడానికి ఎక్కడ తగ్గాలో, ఎవరిని మెప్పించాలో, ఎవరిని తొక్కాలో తెలిసిన నేత. ప్రస్తుతానికి ప్రతిపక్షం పాత్ర హైకోర్టు మాత్రమే పోషిస్తున్న స్థితి ఉన్నప్పటికీ ఎల్లకాలం ప్రతిపక్షం లేకుండా, ఆయన అంచనాపడుతున్నట్టుగా ప్రతిపక్ష నేతలు ఎల్ల కాలమూ సన్నాసులుగా, దద్దమ్మలుగా , చేతగాని వారీగా ఉండడమూ సాధ్యం కాదు. తానూ సమర్దుడిగా ఎదగడం, ప్రజల మద్దతు పొందడమే ఏకైక మార్గం. ఆ అవకాశాశం ప్రతిపక్షాలకూ ఉన్నది. రానున్న కాలంలో ప్రజల మద్దతు పొందగలిగేది కె.సి.ఆరా? ప్రతిపక్షాలా ? అన్నది తేల్చాల్సింది కూడా కె.సి.ఆరే ననడం అతిశయోక్తి కాదేమో.
- పల్లా కొండల రావు.