ధూమపానం-అనర్థాలు
మనిషి సంతోషంగా ఉండాలంటే ముందుగా కావల్సింది మంచి ఆరోగ్యం. అందుకే 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని అంటారు. అయితే కొంతమంది విధివశాత్తు ఆ భాగ్యానికి నోచుకోలేక పోతుంటే, మరి కొంతమంది దానిని చేజేతులారా దూరం చేసికొంటున్నారు. ఈ రెండవ కోవకి చెందిన వారిగా ధూమపానప్రియుల్ని పేర్కొనవచ్చు.
పొగాకు పొగను ఏ రూపంలో పీల్చినప్పటికీ (ఉదా: చుట్ట, బీడీ, సిగరెట్టు వగైరా) అది ధూమపానమే అవుతుంది. పొగతాగడం ఆరోగ్యానికి మంచిది కాదని మనలో చాలామందికి తెలుసు. అయినప్పటికీ నేటి సమాజంలో పొగత్రాగేవారి సంఖ్య కొనసాగుతూనే ఉంది. నేడు పేదలు- సంపన్నులు, యువకులు- వృద్ధులు అనే తారతమ్యం లేకుండా చాలామందిలో ఈ ధూమపానం అలవాటు ఏదో ఒకరూపంలో కన్పిస్తూనే ఉంటుంది. అయితే ధనికులకంటే బీదవారు, అభివృద్ధిచెందిన దేశాల ప్రజలకంటే అభివృద్ధిచెందుతున్న దేశాల ప్రజలు ధూమపానం ఎక్కువగా చేస్తున్నట్లు వివిధ సర్వేలను బట్టి తెలుస్తోంది. పొగపీల్చడంవల్ల రక్తపోటు, కేన్సర్, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నా, ఎవ్వరూ ఖాతరు చేయడంలేదు. అలాగే "పొగతాగడం ఆరోగ్యానికి హానికరం" అని సిగరెట్ పెట్టెల మీద ముద్రించే ప్రభుత్వంవారి చట్టపరమైన హెచ్చరికలను సైతం పెడచెవిని పెడుతున్నారు ధూమపానప్రియులు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 మిలియన్లు మంది ధూమపానంవల్ల మరణిస్తున్నారని, తక్షణ చర్యలు గనుక తీసుకోకపోతే 2030 నాటికి ఈ సంఖ్య ఏడాదికి 8 మినియన్లుకు, ఈ శతాబ్దాంతానికి 1 బిలియన్కు చేరుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. వీరిలో 80 శాతంమంది స్వల్ప మరియు మధ్యతరగతి ఆదాయంగల ప్రజలేనని తేలింది. భారతదేశం విషయానికొస్తే, పొగాకు వినియోగం వల్ల ఏటా 1 మిలియన్ మంది దాకా మృత్యువాత పడుతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మనదేశంలో 30-69 సంవత్సరాల మధ్యనున్న వారికి సంభవించే మరణాలకు ప్రధాన కారణం ధూమపానమేనని చెబుతున్నారు. అలాగే 35-69 సంవత్సరాల మధ్యనున్న స్త్రీలలో, ప్రతి ఇరవై మందిలో ఒక్కరు (అనగా 90,000) మందిదాకా ఈ ధూమపానం వల్ల చనిపోతున్నట్లు వెల్లడైంది. అంతేగాక రాబోయే 3 దశాబ్దాలలో, ధూమపానం వల్ల భారతదేశంలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.
ధూమపానాన్ని గురించి ప్రపంచమంతటా శాస్త్రజ్ఞులు నిశిత పరిశోధనలు గావించి, కొన్ని నగ్నసత్యాలు కనుగొన్నారు. పొగతాగడం వల్ల బ్రోంకైటీస్, ఆస్తమా, రక్తపోటు, గుండెనొప్పి, ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు కేన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని నిర్దారించారు. గుండెనొప్పి వల్ల సంభవించే మరణాలు 80 శాతం అయితే, వాటిల్లో 45 శాతం కేవలం ధూమపానంవల్లే నని 'హార్టకేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది.
పొగాకు పొగలో దాదాపు 4 వేల రకాల రసాయనక విషపదార్ధాలున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా! అయితే వాటిల్లో గల నికోటిన్, కార్భన్మోనాక్సైడ్, నైట్రోజన్ఆక్సైడ్, తార్ మొదలైనవి బాగా హాని కలిగించేవిగా ప్రచారమైనాయి. పొగాకులోని 'నికోటిన్' అనే రసాయనిక పదార్ధంవల్ల శరీరంలో 'అడ్రినలీన్' హార్మోను అధికంగా స్రవించి రక్తపోటు పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి చర్యలు సంభవించి, తద్వారా గుండెకు పని భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే 'కార్భన్ మోనాక్సైడ్' ఎర్ర రక్తకణాల్లోని 'హిమోగ్లోబిన్' తో కలియటం వల్ల రక్తకణాల్లో శక్తి నిరోధితమై శరీరభాగాలకు, హృదయకండరాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కాలేదు. ఇంకా ఈ పదార్ధాల వల్ల రక్తంలో 'కొలెస్టరాల్' శాతం పెరుగుతుంది. ఈ విధంగా నికోటిన్, కార్భన్ మోనాక్సైడ్ లు రెండూకూడ అధికంగా గుండెజబ్బుల్ని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఇక 'తారు'విషయానికొస్తే, దానిలో కేన్సర్ వ్యాధిని జనింపజేసే పదార్ధాలు 'కార్సినోజన్లు' ఉన్నాయని తేలింది. అందుకే అమెరికాలోనూ, చాలా పశ్చిమదేశాల్లోనూ ఈ పదార్ధాలపై కొన్ని శాసనపరమైన ఆంక్షల్ని విధించారు. ఆయా దేశాల్లో సిగరెట్ల ఉత్పత్తిదారులు ప్రతి సిగరెట్టులో ఏ మేరకు తారు, నికోటిన్, కార్భన్ మోనాక్సైడ్ లు ఉన్నాయో తెలుపుతూ విధిగా సిగరెట్టు పెట్టెలపై ముద్రించవలసి ఉంటుంది.
మనదేశంలో కేన్సర్ వ్యాధికి గురవుతున్న వారిలో 40 శాతం మంది ధూమపాన ప్రియులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్ రోగులైతే దాదాపు 65 శాతం మంది ధూమపానం వల్లే దానికి గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదేవిధంగా అడ్డచుట్టకీ, కేన్సర్కీ అవినాభావ సంబంధం ఉందని చెబుతున్నారు. మనరాష్ట్రంలో ఈ అడ్డచుట్ట అలవాటు ముఖ్యంగా ఉత్తరకోస్తా గిరిజనులలో అధికంగా ఉంది. మామూలు ధూమపానం కంటే ఈ అడ్డచుట్ట రెట్టింపు ప్రమాదకరం అనికూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నేడు ఎక్కడపడితే అక్కడ ధూమపానప్రియులు పీల్చివదిలే విషపూరిత పొగాకు పొగవల్ల, పొగతాగనివారికి కూడా అనేక అనర్ధాలు సంభవిస్తున్నాయి. పొగతాగేవారి పక్కన పొగతాగని వారుంటే మామూలు ధూమపానంవల్ల వచ్చే వ్యాధులన్నీ వీరికి కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు. ఇలా ఒకరు పీల్చివదిలే పొగ (Passive Smoking), ఇతరుల ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుందనీ, తద్వారా వారికి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయనీ వాషింగ్టన్ లోని 'ప్రపంచ రక్షక సంస్థ'(W.W.I) పేర్కొంది. ఇళ్లల్లో పొగతాగే పురుషుల వల్ల వారి స్త్రీలకు, పిల్లలకు కూడ ఊపిరితిత్తుల వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయని టోకియోలోని కేన్సర్ పరిశోధనాసంస్థ తెలిపింది. ధూమపానం అలవాటు లేనివారు కూడా కేవలం వాతావరణంలోని పొగాకు పొగని పీల్చడం వల్ల ఏటా 35 వేలమంది గుండెజబ్బులతో మరణిస్తున్నారని కనుగొనబడింది.
ఒకవిధంగా మద్యపానం, మాదకద్రవ్యాల కంటే ఈ ధూమపానం ఎక్కువ హానికరం అని చెప్పాలి. ఎందుకంటే వాటిని సేవించడం వల్ల కేవలం వ్యక్తిగత ఆరోగ్యాలే దెబ్బతింటాయి. కాని ధూమపానం అలా కాదు. ఇతరుల ఆరోగ్యాలకు కూడా చెరుపు కలిగిస్తుంది. బహిరంగ ప్రదేశాలలో కొనసాగే ధూమపానం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అంతేగాక ధూమపానం చేసేవారి ఆరోగ్యాలతో పాటు తోటివారి ఆరోగ్యాలకు కూడా హాని కలుగుతోంది. నేటి సమాజంలో చదవుసంధ్యలు ఉండి అన్నీ తెలిసినవారు సైతం కొంతమంది కించిత్తయినా ఆలోచన లేకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా పొగ పీలుస్తుంటారు. ఇది ఎంతైనా గర్హనీయం.
విచ్చలవిడిగా కొనసాగుతున్న ఈ విపత్కర 'ధూమం' బారినుంచి కనీసం పొగతాగని ప్రజల ఆరోగ్యాలకైనా రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి తన 39వ ప్రపంచ ఆరోగ్యసమావేశంలో సభ్యదేశాల్ని కోరింది. అదే విధంగా పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ-వాటి వినియోగాన్ని నిరోధించేందుకు 2005లో 168 దేశాల సంతకాలతో ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందానికి మనదేశం కూడా అంగీకరించింది.
అందులో భాగంగానే ధూమపానాన్ని దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో నిషేధిస్తూ 2-10-2008 నుండి ఓ చట్టం అమల్లోకి తేబడింది. బహిరంగ ప్రదేశాలు అనగా హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమాహాళ్ళు, ప్రభుత్వ రవాణా సర్వీసులు (బస్సులు, రైళ్ళు, విమానాలు), విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ మరియు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు వగైరాలుగా చట్టంలో నిర్వచించబడ్డాయి. అంతేగాక పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ప్రకటనలు చేయటం, పిల్లలకు సిగరెట్లు విక్రయించడం వంటి వాటిని కూడా చట్టం నిషేధిస్తోంది. ఎవరైనా శాసనాన్ని ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినట్లైతే, వారికి రెండు వందల రూపాయలు జరిమానా విధించేటట్లు చట్టంలో పొందుపరిచారు.
అయితే ఈ చట్టం ముఖ్యంగా మనరాష్ట్రంలో కనీసంగానైనా అమలవుతున్న దాఖలాలు లేవు. చట్ట నిబంధనలు కాగితాలకే పరిమితం కావడంతో, ప్రజల్లో అవగాహన కొరవడి, ఆశించిన ఫలితాలు లభించడం లేదు. అందువల్ల ప్రభుత్వం ఈ శాసనపరమైన ఆంక్షల్ని కట్టుదిట్టంగా అమలు చేసి, కనీసం పొగతాగనివారి ఆరోగ్యాలకైనా రక్షణ కల్పించాలి. 'ధూమపానం ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పు' అని వివిధ అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి గనుక, ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధించే చర్యలు చేపట్టాలి. ధూమపానానికి సంబంధించిన అన్నిరకాల ప్రకటనలు ఆపుచేయాలి. ముఖ్యంగా చలన చిత్రాలు, టీవీ సీరియళ్ళలలో ధూమపానానికి సంబంధించిన దృశ్యాల్ని పూర్తిగా నిషేధించాలి. ఇటీవల సుప్రీంకోర్టు, సిగరెట్ పెట్టెలమీద ముద్రించాల్సిన హెచ్చరికల పరిమాణం ఎలా ఉండాలనే దానిపై తీర్పునిస్తూ: "ధూమపానంవల్ల ఏటా 10 లక్షల మంది గొంతు కేన్సర్తోనూ, ఊపిరితిత్తుల కేన్సర్తోనూ మరణిస్తున్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 85 లక్షలకి చేరుతుందని అంచనా. ఇది ఉపేక్షించదగిన విషయం కాదు..." అంటూ హెచ్చరించింది.
ధూమపాన నిషేధంలో చండీఘర్ ను మనం ఆదర్శంగా తీసికోవాలి. హేమంత్ గోస్వామి అనే సాంఘిక కార్యకర్త కృషి ఫలితంగా మనదేశంలో, చండీఘర్ తొలి ధూమపాన రహిత పట్టణంగా 2007లో మారింది. అలాగే అస్సాం, పంజాబ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు కూడ పొగాకు ఉత్పత్తులపై నిషేధాలు విధిస్తూ బిల్లులు ప్రవేశపెట్టాయి. వీటిని ఆదర్శంగా తీసికొని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
దేశ ప్రగతి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నది నగ్నసత్యం. అయితే ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందనేది కూడా అంతే సత్యం. పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ధూమపానం మూలంగా ప్రజలకు సంభవించే వ్యాధులకై వెచ్చించే నిధులే అధికంగా ఉంటున్నాయి. అందువల్ల ప్రభుత్వం ధూమపానాన్ని పూర్తిగా నిషేధించడం ఎంతైనా ఆవశ్యకం. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సాంఘిక సేవాసంస్థలు కూడ ధూమపాన నిర్మూలనకు పాటుపడాలి. ధూమపానం వల్ల తమ ఆరోగ్యాలు పక్కవారి ఆరోగ్యాలు పాడవటమేగాక, ధూమపానం చేసేవారికి ఆర్థికపరఖర్చులు కూడా పెరుగుతాయనేది నిర్వివాదాంశం. "ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్" అన్నారు. అంచేత ఈ ధూమపానం అలవాటుని దూరం చేసికొని, ఆరోగ్య లక్ష్యసాధనకై ధూమపానప్రియులు కూడ కృషి చేస్తారని ఆశిద్దాం.
- పి.వి.ప్రసాద్, విజయవాడ, 9440176824 ( Note : Republished )