అందరూ "సమానం" ఎప్పటికీ అసాధ్యం !
ఫిబ్రవరి 12 న ఈ బ్లాగులో వ్రాసిన "కమ్యూనిజం రావాలంటే కమ్యూనిస్టు పార్టీ రద్దు కావాలి!" అనే పోస్టుకు సంబంధించి రాధాకృష్ణ గారి కామెంట్ కు సమాధానంగా ఈ పోస్టు వ్రాస్తున్నాను. రాధాకృష్ణ గారి కామెంట్ ను ఈ పోస్టు క్రింద ఉంచడం జరిగింది. గమనించగలరు.
ఏ సమాజం లో నైనా మనుషులంతా సమానం అయిపోరు.
మనుషులంతా సమాన హక్కులు కలిగి ఉండడానికి - మనుషులంతా సమానమై పోవడానికీ తేడాను గమనించక పోవడం వల్ల వచ్చే అపోహ మాత్రమే ఇది.
ఎంత సాధాన చేసినా అందరూ ఘంటసాల మాస్టారిలా పాడగలరా ? అంతా సచిన్ టెండూల్కర్ లా ఆడలేక పోవచ్చు. పౌరాణిక పాత్రలను ఎన్.టీ.ఆర్ లా పోషించలేక పోవచ్చు. అలా పోషించగల సత్తా - టాలెంట్ అందరికీ ఏ సమాజం లో ఒకేలా ఉండడం లేదా ఈ టాలెంట్ అనేది రూపు మాసి పోవడం అనేది అసాధ్యం.
సంపదను సృష్టించడంలో , సంపదను అనుభవించడంలో, సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో అసమానతలు లేని సమానత్వమే హక్కులుగా సాధించగలం గానీ , సహజాతంగా (పుట్టుకతో వచ్చే ) వచ్చే లేదా సాధనతో వచ్చే గొప్పదనాలను అందరూ సమాన హక్కులుగా పొందడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం. ప్రకృతి నియమాలకు విరుద్ధమైనది కమ్యూనిస్టులు కోరుకోవడం లేదు. పోరాడినా ఫలితం ఉండదు. అది వ్యక్తి స్వేచ్చను పూర్తిగా హరిచివేస్తుంది కూడా .
ఘంటసాల వంటి అద్భుత గాయకుడు జోలె పట్టి అడుక్కుని నిలదొక్కుకునే పరిస్తితి ఉండకూడదు. ఎందరు ఘంటసాలలు తొక్కివేయబడ్డారో కదా! అదే సందర్భంలో టాలెంట్ అనేది సరుకుగా మారి కోట్లు కూడబెట్టుకునే సాధనం కాకూడదు. సమాజానికి ఉపయోగపడే ప్రతీ టాలెంట్ గౌరవం పొందాలి. క్రికెట్ మాత్రమే క్రీడ మిగతావి కాదు అన్నట్లు ఉండకూడదు.
ఒక వికలాంగుడు మిగతావారితో కలసి పరుగెత్తలేక పోవచ్చు కానీ అతడు అందరితో కలసి ఆత్మీయంగా బ్రతికే ఏర్పాటు సమాన హక్కుగా కలిగి ఉండాలి. పిల్లలు -పనిచేయని స్థితికి చేరుకున్న వృద్ధులు ఏమాత్రం అభద్రతా భావం లేకుండా బ్రతికే అవకాశం హక్కుగా ఉండాలి. కేవలం సంపాదించగలిగే వాడే భద్రత కలిగిన, విలువ కలిగిన వాడిగా ఉండకూడదు.
ఇలా ప్రతి మనిషీ బ్రతికేందుకు సమాన హక్కులు కలిగి ఉండడం వేరు. ఎవరి టాలెంట్ వాళ్లు కలిగి ఉండడం వేరు. ప్రతీ సమాజం లో టాలెంట్ ఉన్న వాళ్ళు - టాలెంట్ లేని వాళ్ళ కంటే గుర్తింపు పొందడం గొప్పవారిగా ఉండడం అనేది ఒకరు తీసేస్తే పోయేది కాదు. కాకూడదు కూడా ! కేవలం డబ్బుకు మాత్రమే నేడు టాలెంట్ దాసోహం అనాల్సి రావడం టాలెంట్ ను అవమానించడమే !
కమ్యూనిస్టులలో కూడా ఆ విధంగా కార్యకర్తలు - నాయకులు అనే తేడా తప్పనిసరిగా ఉంటుంది. ఉండడం అత్యంత సహజ విషయం. మిగతా పార్టీల మాదిరిగా వారసత్వ పోరు . ముఖ్యమంత్రి పీఠాలు - ప్రధానమంత్రి పీఠాలు మా తాత ముత్తాతలు లేదా మా నాయనది, మా మామది అన్నట్లు కమ్యూనిస్టులు ఉన్నారా? ఆలోచించగలరు.
గుప్పిట బిగించి చూపితే ఎవరికి చికాకు పడాల్సిన అంశం ఏమీ లేదు అందులో. మనం శక్తివంతులం అనీ ఒక విశ్వాసంతో , చైతన్య భావనతో కమ్యూనిస్టులు ఒక సింబల్ గా వాడితే అది మాత్రమే కొందరికి ఎందుకు ఎబ్బెట్టుగా ఉండాలో వారే చెప్పాలి. దానివల్ల సమాజానికి గానీ , అలా ఇబ్బంది పడే వారికి గానీ ఇదిగో ఇందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందీ అని శాస్త్రీయంగా నిరూపించగలిగితే ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేసి మరో పద్ధతిని ఎంచుకుంటారు.
ఆర్.ఎస్.ఎస్ వారు నిక్కరు వేసుకుంటే ఒ.కె . ముస్లిం మహిళలు బుర్ఖా వేసుకుంటే ఒ.కె. సిక్కులు తలపాగా - గడ్డం ఒకె. కాషాయ వస్త్రాలు వేసుకుని దొంగ వేషాలు వేసినా ఒ.కే , ఆఖరుకు బట్టలు లేకుండా దిగంబరంగా ఉండి స్వాములమని చెపితే వారికి అమాయకత్వం తో వెర్రిగా దండాలు పెట్టినా ఒ.కే కానీ కమ్యూనిస్టులు పిడికిలి బిగించినా , ఎర్రచొక్కాలు వేస్తే మాత్రమే వేరే రకంగా చూడడడమెందుకో చూసేవాళ్ళే చెప్పాలి .
కమ్యూనిస్టులు ఖచ్చితంగా వేరే రకమే కానీ ఆ చూపులోనె రెండురకాలు . ఒకటి ప్రేమతో ఆప్యాయంగా....మరొకటి ద్వెషంతో అసహ్యంగా ... ఇది ఇవాల కొత్తేమీ కాదు. కానీ దీని వల్ల నష్టమేమిటో చెపితే మాత్రమే దానిని ఆలోచించవచ్చు.
ఎవరి చొక్కాలు వారు వేస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టు నాయకులు ఎర్రచొక్కా వేసుకోవడానికి ఏ మాత్రం సంశయించరు. అలా సంశయించిన వాడు కమ్యూనిస్టు కార్యకర్తగానే పనికిరాడు. నాయకుడు ఎలా అవుతాడు?ఎర్రచొక్కా వేసిన ప్రతీవాడూ కమ్యూనిస్టు కాడు - ఖద్దరు టోపీ పెట్టుకున్న ప్రతీ వాడు గాంధేయవాది కాడు. ఒక ఆశయాన్ని ముందుకు తీసుకు పోయేదానిలో ఇలాంటి రంధ్రాన్వేషణల వల్ల ఉపయోగం ఉండదని నా అభిప్రాయం.
ప్రస్తుత సమాజం లో కమ్యూనిస్టు కార్యకర్తలను , కమ్యూనిస్టు అభిమానులను చూసేదానిలో ఒకేరకం గా మరియూ వీరిరువురినీ ప్రస్తుత ప్రపంచానికీ అతీతులుగా చూడడం కూడా సరైనది కాదు. కమ్యూనిస్టులు కాని వారు లక్షలకోట్ల కుంభకోణాలు చేసినా ఫరవాలేదు. కమ్యూనిస్టు అభిమానులు అసలేమీ సంపాదించడానికి కుదరడనం కూడా సరైనదికాదు. ఆ సంపాదన సక్రమమా ? అక్రమమా ? అనేది మాత్రమే పాయింట్ .
కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం వాళ్ల ఆస్తులకు సంబంచించి ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ఉంటుంది. మిగతా ఏ ఇతర పార్టీలకన్నా ఈ విషయం లో , లేదా అవినీతి విషయం లో కమ్యూనిస్టులకూ , ఇతరులకూ పోలికే లేదు . ఎవరైనా నిజంగా ఈ విషయం లో నిజాలు తెలుసుకోదలచుకుంటే ఒక సర్వే నిర్వహించుకుంటే మంచిది. పైపైనా గుర్రాన్ని - గాడిదను ఒకే గాటనకడతాననడం సరికాదు.
విగ్రహాల విషయం లో కమ్యూనిస్టులు సరిగానే ఉంటున్నారు. వై.ఎస్ విగ్రహాల మాదిరిగానో , మరో మాది్రిగానో సుందరయ్య విగ్రగాలు పెడుతున్నారా ? కమ్యూనిస్టులు చనిపోతే దహనసంస్కారాలు వారిపద్ధతిలో వారు చేస్తారు. సమాధులు ఇతరత్రా విషయం లో సమాజ చైతన్యాన్ని బట్టే ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయి. వెంటనే మార్పు రాకపోతే ప్రజల జీవన విధానంకు ఏమీ ఆటంకమో ? అనర్ధమో జరుగదు. వస్తే తప్పేమీ లేదు.
ప్రజల మేలు కోరే ఏ సిద్ధాంతమైనా ఒకటే అనేది కరెక్టు కాదని మనవి. గత చరిత్రను - భవిష్యత్ అంచనాను శాస్త్రీయ పునాదులమీద మానవ జీవితానికి అసలు రాజ్యమే అవసరం లేదనీ అది రద్దు కావాలని చెప్పే మార్క్సిజం కూ , ఒక రాజ్యం పోయి మారాజ్యం వస్తే బాగు చేస్తాము అని చెప్పేదానికీ స్పష్టమైన తేడా ఉంది.
మీరన్న దానిలొ : "ఇలా ప్రజల బాబోగులు చూడటానికి ఎంతమాత్రం ఉపయోగించక స్వార్ధ ప్రయోజనాలకే వాడుకోవటంవల్లనే వాటిలోని "మంచి అనే పదార్ధం" ప్రజలకి కనపడటం లేదు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే కేవలం అధికారం సంపాయించటానికే ఏ ఇజాన్ని అయినా వాడుకొంటున్నారు " --- ఇందులో ఎంతమాత్రం అనేదానికి తగినంత అని మార్చితే ఆ వాక్యం తో నేనూ ఏకీభవిస్తున్నాను.
రాధాకృష్ణ గారి కామెంట్ యధాతధంగా :
RADHAKRISHNA SAID...
ఇకపోతే, పాతకాలంలో రాజ్యాంగం క్రింద ఉన్న మతాలలో లాగానే కమ్మ్యునిజంలో కొన్ని విధి విధానాలు ఏర్పడిపోయినాయి. ఉదాహరణకి...,ఎర్ర రంగు వెయ్యటం, ఎర్ర చొక్కాలు వెయ్యటం[పెద్ద నాయకులు మాత్రం వైట్ అండ్ వైట్ వేస్తారనుకోండి], గుప్పిడి బిగించి [అఖర్లేనప్పుడు కూడా] చూపించటం, వ్యక్తి పూజలకి దూరం అంటూనే పటాలని పెట్టి దండలు వెయ్యటం, "ప్రముఖులు"[.....? అందరూ సమానమేకదా!!!] పోయినప్పుడు వారిని ఒకే రకమైన పద్ధతిలో సాగనంపటం....పోయిన వ్యక్తి భావాలకన్నా అతని శరిరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం..వారికి సమాధులు కట్టి వాటిమీద విప్లవ చిహ్నాలని పెట్టడం............ఇవన్నీ మత ధొరణులనే చూపిస్తున్నాయేగానీ ...."పేద ప్రజల కోసం పని చేసే ఎటువంటి సెంటిమంటులు కానరావు". ఇక మన దేశానికొస్తే, ఇక్కడి కమ్మునిస్టులు నెలవారీ జీతాలు తీసుకొనే వ్యక్తుల పట్ల చూపించే శ్రద్ధ ఇసుమంతైనా ఏరొజుకారోజు బ్రతికేవారి మీద చూపించటం లేదు. వారిని కేవలం మిగిలిన పార్టీలవారు వాడుకొన్నాట్లే తమ అవసరాల కార్యకర్తలుగా మాత్రమే వాడుకొని వదిలి వేస్తున్నారు. నాకు తెలిసినంతవరకూ విజయవాడలో....ఒక స్కూలు మాస్తారు కొడుకు, ఒక కిళ్ళి షాపు యజమాని, ఏ ఉద్యోగం సద్యోగం లేని ఒకాయన ఇలా ఉన్న కమ్మునిస్టు నాయకులు ఇప్పుడు కోట్లకి అధిపతులయినారు. ఇలా ప్రజల బాబోగులు చూడటానికి ఎంతమాత్రం ఉపయోగించక స్వార్ధ ప్రయోజనాలకే వాడుకోవటంవల్లనే వాటిలోని "మంచి అనే పదార్ధం" ప్రజలకి కనపడటం లేదు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే కేవలం అధికారం సంపాయించటానికే ఏ ఇజాన్ని అయినా వాడుకొంటున్నారు. చివరలో, ప్రజల మంచి కోసం మనం కేవలం కమ్మ్యునిజమే చూడఖర్లేదు......అన్ని పార్టీల మానిఫాస్టులలోను పేద ప్రజల అబ్యున్నతే మాధ్యేయం అని ఉంటుంది. ప్రపంచం లోని అన్ని మతాలలోనూ "సాటి వారిని ప్రేమతో దయతో చూడండి, వారికి కష్టం వస్తే ఆదుకోండని" ఉన్నదే కానీ.....మీరు తప్ప మిగిలిన వారిని అంతమొందించడని ఎక్కడా లేదు. తేడా ఎక్కడంటే వాటిని అమలు పరచటంలో....ఏదైతే "అభ్యుదయ భావాలు" అని అంటున్నారో వాటిని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలందరి కోసం వాడినట్లైతే ఏ ఇజం, ఏ మతం ఉన్నప్పటికీ ప్రజలకి అనుసరణనీయమే..... అలా కాకుండా బలవత్ప్రచారాలకి పాల్పడి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు చేస్తూ ఉన్నట్లైతే అటువంటి స్వేచ్చలేని, బలవంతపు, హింసతో కూడిన ఎటువంటి ఇజాన్నీ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరు.
దీని తరువాత పోస్టు లింక్ : http://www.janavijayam.com/2012/03/blog-post_8445.html