కంది శంకరయ్య గారు. తెలుగు సాహిత్యంపైనా, పద్యరచన, సమస్యా పూరణాలపైనా ఆసక్తి ఉన్నవారందరికి అత్యంత ఇష్టులు. చాలామంది ఆయనను గురుతుల్యులుగా భావించి శంకరయ్యగారి శిష్యులమని చెప్పుకుంటారు. శంకరయ్యగారు మాత్రం వారిని తన మిత్రులని చెపుతారు. ఇంతమంది మిత్రులను సంపాదించి పెట్టిన శంకరాభరణం బ్లాగులో సమస్యా పూరణలతో పాటు ఛందో వ్యాకరణ పాఠాలు, చమత్కార పద్యాలు, పద్యరచన తదితర అంశాల ఆధారంగా ఆరేళ్లుగా క్రమం తప్పకుండా విజయవంతంగా బ్లాగింగ్ చేస్తున్న ఆయనకు మొదట్లో కంప్యూటర్ వాడకమే సరిగా రాదు. ఆంధ్రజ్యోతిలో వలభోజు జ్యోతి గారి వ్యాసం ఆధారంగా బ్లాగింగ్ మొదలెట్టిన ఆయన ఈ రోజు ప్రముఖ బ్లాగరుగా ఎదిగారు. దేశ విదేశాలలో అంతర్జాలంలో పరిచయం అయ్యారు. దీనికి కారణం పద్యంపై, సమస్యా పూరణంపై ఆయనకున్న ఆసక్తి మాత్రమే. తెలుగు భాషకు, సంప్రదాయ తెలుగు కవిత్వానికి, పద్య కవిత్వానికి సేవచేస్తున్న శంకరయ్య గారు ఆ దిశగా మరింత కృషి చేస్తారని ఆశిద్దాం. ఆయన ఎపుడూ తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకునే మనిషి కాదు. కవిసమ్మేళనాలలో పాల్గొనలేదు. సాహిత్యసమావేశాలలో వేదిక లెక్కలేదు. శంకరాభరణం బ్లాగును, అందులోని సాహిత్య వ్యాసంగాన్ని దేశవిదేశాల్లోని సాహితీప్రియులు అభినందిస్తున్నా తన గురించి కాని, తన బ్లాగు గురించి కనీసం ఆయన స్వస్థలం వరంగల్ సాహితీవేత్త లెవరికీ తెలియదు. తన గురించి ప్రచారానికి అంతగా ఇష్టపడని ఆయన పత్రికలవారడిగినా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడలేదని తెలిసింది. పల్లెప్రపంచం కు కూడా చాలాసార్లు పట్టుబట్టిన తరువాత మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. పరిమిత అంశాలపై శంకరయ్య మాష్టారితో 'పల్లెప్రపంచం' జరిపిన ఇంటర్వ్యూ ఇది.
ప్ర - మీ పేరు?
జ - కంది శంకరయ్య
ప్ర - మీ పుట్టిన తేది? వయస్సు?
జ. 17 - 7 - 1950, 65 సం||
ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
జ - మా నాన్న వీరస్వామి. అమ్మ కీ.శే. మల్లమ్మ. మొత్తం పన్నెండు మంది సంతానం. అయిదుగురం అన్నదమ్ములం, ఏడుగురు అక్కాచెల్లెళ్ళు. నాన్న కొద్దిగా చదువుకున్నాడు. ప్రైవేటుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. మమ్మల్ని పోషించడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.
ప్ర - మీ జన్మస్థలం?
జ - వరంగల్.
ప్ర - ప్రస్తుత నివాసం?
జ - హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమం.
ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ - హెచ్.ఎస్.సి. తర్వాత తెలుగులో డి.ఓ.యల్., ఆ తర్వాత బి.ఓ.యల్. చదివి పండిట్ ట్రెయినింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రైవేటుగా ఎం.ఏ (తెలుగు) పాసయ్యాను. ఎం.ఫిల్. అసంపూర్ణం.
ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ - నా వివాహం 1973లో జరిగింది. భార్య పేరు శాంతి. ఎక్కువగా చదువుకోలేదు. ఇద్దరు పిల్లలు. కుమారుడు క్రాంతి కుమార్ (నేనేదో వామపక్ష భావాలు కలిగి ఈ పేరు పెట్టలేదు. వాడు జనవరి 14 సంక్రాంతినాడు పుట్టినందువల్ల ఆ పేరు పెట్టాను) యం.సి.ఏ. చదివాడు. సాఫ్టువేర్ ఉద్యోగాల ప్రయత్నాలు ఫలించలేదు. వరంగల్ లోనే ఒక ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. కోడలు కల్పన. వారికొక కుమారుడు. నా కుమార్తె స్వాతి. తను కూడా యం.సి.ఏ. చేసింది. అల్లుడు క్రాంతికుమార్ సాఫ్టువేర్ ఉద్యోగి. వాళ్ళకొక కుమారుడు, కుమార్తె. సైనిక్‌పురిలో ఉంటారు.
ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ - 1972 నుండి 1980 వరకు వరంగల్ లోని డట్టన్స్ హైస్కూల్ లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసాను. 1980 నుండి 2008 వరంగల్‌లోనే ప్రభుత్వ సహాయక మహబూబియా పంజెతన్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రేడ్-1 తెలుగు పండితుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాను.
ప్ర - మీ బ్లాగు పేరు?
జ - ‘శంకరాభరణం’
ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ - నా బ్లాగు లక్ష్యంపై నాకు నిర్ణీత అభిప్రాయం ఏదీ లేదు. నేనేదో తెలుగు భాషకు, సంప్రదాయ తెలుగు కవిత్వానికి, పద్య కవిత్వానికి సేవచేస్తున్నానంటారు మిత్రులు.
ప్ర - మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ - రిటైరైన తర్వాత కాలక్షేపానికి ఇంటర్ నెట్ లో తెలుగు బ్లాగులు చూస్తూ ఉండే వాడిని. అప్పటికి నా కంతగా కంప్యూటర్ను ఉపయోగించడం తెలియదు. ఒక ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘మీరూ బ్లాగుడుకాయలే’ అని జ్యోతి వలబోజు గారి వ్యాసం చదివాను. అందులో బ్లాగు ఎలా ప్రారంభించాలో వివరంగా ఇచ్చారు. వెంటనే ‘Kandi Shankaraiah Blog' అని మొదలు పెట్టి తెనాలి రామకృష్ణుని ‘నరసింహ కృష్ణరాయని...’ పద్యాన్ని పోస్ట్ చేశాను. ఆ తరువాత ఏం చేయాలో, ఎలా వ్రాయాలో తెలియక మళ్ళీ సంవత్సరం దాకా దాని జోలికి వెళ్ళలేదు. ఈలోగా ఆంధ్రామృతం, రౌడీరాజ్యం, ఊకదంపుడు, తురుపుముక్క, డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగుల్లో అప్పుడప్పుడు ఇచ్చిన సమస్యలను పూరిస్తూ ఉండేవాణ్ణి. రోజూ కొత్త సమస్యలెమైనా ఇచ్చారా అని వారి బ్లాగులు చూస్తూ ఉండే వాణ్ణి. వాళ్ళు తరచుగా ఇచ్చేవాళ్ళు కాదు. నిరుత్సాహపడేవాణ్ణి. నాలాగే సమస్యలకోసం ఎదురుచూసే వాళ్ళు ఉంటారు కదా.. నేనే నా బ్లాగులో ప్రతిరోజూ క్రమం తప్పకుండా సమస్యలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టాను. నా పేరు కలిసి వచ్చేలా బ్లాగుకు ‘శంకరాభరణం’ అని పేరు మార్చాను. నిజానికి ఆ పేరు సంగీతానికో, భక్తికో సంబంధించిన బ్లాగుకు పెట్టవలసింది. నా బ్లాగులో విషయాలకు, ఆ పేరుకు తాదాత్మ్యత లేదు. సమస్యా పూరణలతో పాటు ఛందో వ్యాకరణ పాఠాలు, చమత్కార పద్యాలు, పద్యరచన తదితర అంశాలను నిర్వహిస్తున్నాను. బ్లాగు రూపకల్పనలో జ్యోతి వలబోజు గారు ఎంతో సహకరించారు.
ప్ర - మీ బ్లాగు అనుభవాలు?
జ - ఈ బ్లాగు నా కెందరో మిత్రులను (వాళ్ళేమో శిష్యులం అంటారు) సంపాదించి పెట్టింది. దాదాపు ఆరేళ్ళుగా క్రమం తప్పకుండా రోజూ పోస్ట్ ఉండే బ్లాగుగా తెలుగు బ్లాగు ప్రపంచంలో నాకొక గుర్తింపు తీసుకువచ్చింది.
ప్ర - బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?
జ - ఏమీ లేవు. కాకుంటే కొన్ని అజ్ఞాత వ్యాఖ్యలు నన్నూ , మిత్రులనూ బాధ పెట్టాయి. దాంతో అజ్ఞాత వ్యాఖ్యలకు బ్లాగులో అవకాశం లేకుండా చేశాను.
ప్ర - సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?
జ - చెప్పుకో తగ్గ అనుభవాలు ఏమీ లేవు.
ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలిచ్చే స్థాయి నాకు లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నా.
ప్ర - మీ బ్లాగులో మీ పోస్టులలో మీకు నచ్చినవి?
జ - దాదాపుగా అన్నీ...
ప్ర - ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ - ఆంధ్రామృతం, డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులు, మధురకవనం, బ్లాగుగురువు ఇతర సాహిత్య సంబంధమైన బ్లాగులు.
ప్ర - బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జ - ఏమీ లేవు.
ప్ర - తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?
జ - ప్రస్తుతానికి మన్నించండి.
ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ - చాలా ఉన్నాయి. గుండు మధుసూదన్ గారు తమ
ఇంటర్వ్యూలో తెలిపిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
ప్ర - మీ హాబీస్ ?
జ - పుస్తక పఠనం, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడడం.
ప్ర - మీ అభిమాన రచయిత ?
జ - జేమ్స్ హాడ్లీ ఛేజ్.
ప్ర - మీకు నచ్చే రచనలు?
జ - ప్రత్యేకంగా ఇవి అని ఏవీ లేవు. అన్నీ..
ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ - శాకాహారం, సీతాఫలాలు.
ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ - చెప్పలేను.
ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ - చెప్పలేను.
ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జ - చెప్పలేను
ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జ - చెప్పలేను
ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ - ఎవరూ లేరు.
ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ - ఉపాధ్యాయ వృత్తి.
ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ - మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలు చూస్తాను.
ప్ర - నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలిచ్చేంత గొప్పవాణ్ణి కాదు. మన్నించండి.
ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ - నా కున్న గుణం అదే. అది సహజంగానే వచ్చింది.
ప్ర - మీ లక్ష్యం ఏమిటి?
జ - ఏమీ లేదు.
ప్ర - మీ అభిమాన నాయకుడు?
జ - ఎవరూ లేరు.
ప్ర - మీకు నచ్చిన సినిమా ?
జ - పాత బ్లాక్ అండ్ వైట్ తెలుగు, హిందీ సినిమాలన్నీ.
ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ - ఎన్టీఆర్, ఏఎన్నార్, సియెస్సార్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం, రాజేంద్రప్రసాద్.
ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ - చెప్పలేను.
ప్ర - మతం పై మీ అభిప్రాయం?
జ - చెప్పలేను.
ప్ర - సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?
జ - చెప్పలేను.
ప్ర - తెలుగు భాషపై మీకు ప్రత్యేక ప్రేమ ఏర్పడడానికి కారణం?
జ - హైస్కూల్లో మాగురువు గారు చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల బోధన వల్ల, చిన్నప్పటినుండి మా అక్కయ్య అలవాటు చేసిన పుస్తకం పఠనం వల్ల.
ప్ర - తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జ - నేనేమీ చేయడం లేదు.. చేస్తున్నా నంటారు మిత్రులు.. నిజమే కామోసు అనుకుంటాను.
ప్ర - ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?
జ - రాజకీయాలపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు.
ప్ర - తెలుగు సాహిత్యంపై మీకు పట్టు ఉండడానికి కారణం?
జ - పుస్తక పఠనం, నేను చదివిన కోర్సు.
ప్ర - మీరు చెప్పదలచుకున్న ఇతర అంశాలు?
జ - ప్రస్తుతానికి ఏమీ లేవు.. ధన్యవాదాలు.
- పల్లా కొండల రావు.
-------------------------------------------------------------------------
మీకు నచ్చిన బ్లాగరును ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, మీకు నచ్చిన ఇంటర్వ్యూని అందరితో పంచుకోవాలనుకున్నా వివరాలకు ఇక్కడ నొక్కండి. ప్రజలో ఇంటర్వ్యూ పోష్టుల వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
--------------------------------------------------------------------------