అహంకారం ఓ మానసిక అవలక్షణం !
ఆత్మన్యూనతలోనుండి వచ్చే అహంకారం , ఆధిపత్యం లోనుండి - ఆభిజాత్యం లోనుండి వచ్చే అహంకారము రెండూ ప్రమాదమే !
ఈ రెండింటినీ సమైఖ్యం గా ఎదుర్కోవాల్సిందే !
ఎదుర్కోకుండా వదిలేయడమంత మంచిది కాదు.
అప్పుడప్పుడు ...................
మనకు కులపరమైన అహంకార భావం ,ఆత్మన్యూనతా భావం, కులపరమైన పిచ్చవాదన చేసే అలవాటు కనిపిస్తోంది.
నేనమైనా అపార్ధం చేసుకున్నానేమో తెలియదు. కానీ పదే పదే ఇదేరకం పిచ్చవాదన చూస్తే జాలిపడుతూ వదిలేయడం తప్ప ఏం చేస్తాం ?
అంతకు మించి సున్నితమైన ఇలాంటి విషయాలలో చేయగలిగేదేమీ లేదు.
అహంకారంతో తలకెక్కే పైత్యమెంత ప్రమాదమో, ఆత్మ న్యూనతతో తలకెక్కే పైత్యమూ అంతే ప్రమాదకరం.
మెజారిటీ అయినా , మైనారిటీ అయినా ఉన్మాదం ఉన్మాదమే. ఉన్మాదాన్ని తుంచివేయాల్సిందే.
శాస్త్రీయంగా చెప్పాలంటే ఇదొక మానసిక ధోరణి. తప్పనిసరిగా సరిచేసుకోవలసిన జాడ్యం. బిహెవియర్ థెరఫీతో సరిచేసుకోవలసిన అంశమిది.
కేవలం ఆ వ్యక్తులను తప్పు పట్టాల్సిన పనిలేదు. సామాజిక అసమానతలకు ప్రతిస్పందనలో తేడాగా స్పందించే పరాయీకరణ ఇది. సమాజంలో ఇది ఓ ధోరణిలా ఉంటుంది.
ఇదే రకం వ్యక్తులు కలసికట్టుగా ఉండేందుకు, సమైఖ్యత చాటేందుకు సిద్ధంగా ఉంటారు.ఈ రకమైన వాదన లేదా చేష్టలతో సాధించేదేమీ ఉండదు. చరిత్రలో సాధించినదీ లేదు.
వీళ్లు తమ పైత్యపు వాదన నెగ్గించుకోవడానికి ఉన్మాదులుగా వాదిస్తారు. ఎదుటివారికి లేని తప్పులన్నీ అంటగడతారు. వీళ్ల కులపైత్యానికి తమకు నచ్చనివారిపై ఎంతకైనా దిగజారి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. వాళ్ల వాదన వినడం తప్ప ఏమి వాదించినా బుస్సున లేస్తారు. ఎగిరెగిరి పడతారు. అందులో ఓపికగా అర్ధం చేసుకుందామన్నా అణువంత కూడా హేతుబద్ధత కనపడదు.
కానీ ఆ వ్యక్తులు మారకుంటే అదొక జబ్బుగా మారి వాళ్లను నష్టపరుస్తుంది. జనానికి దూరం చేస్తుంది. సమాజంలో అనవసర ఘర్షణలకు దారి తీస్తుంటుంది. సున్నితమైన ఈ సమస్యకు ఒక్కోసారి అమాయకులు బలవుతుంటారు.
వ్యక్తిగత విశ్లేషణ దీనికి ఉపయోగపడుతుంది. అయితే ముందు మనమేమైనా తప్పుగా వాదిస్తున్నామా? తప్పుడు ధోరణితో ఉన్నామా? అనే కనీసపు సంశయాన్ని మనసులోనైనా రానివ్వగలిగే విచక్షణ - సంస్కారముండాలిక్కడ.
అది లేకుంటే ఇపుడు నేను చెప్పేదీ వెటకారం గానూ, కారం గానూ ఉంటుంది. కానీ, చెప్పక తప్పని విషయమిది. ఊరకే వదిలేసే అంశమూ కాదిది. తప్పనిసరిగా ఇటువంటి ఉన్మాదం పై భావజాల పోరాటం చేయకుంటే మరింత ముదురుతుందీ ధోరణి.
- Palla Kondala Rao,
14-08-2012.