గుండు మధుసూదన్.....
తెలుగు బ్లాగర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా వాదిగా , తెలుగు పద్య ప్రేమికునిగా ఆయన అందరికీ పరిచయమే... సహజంగానే తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో సమైక్యవాదులకు కొందరికి ఆయన వ్యతిరేకిగా కనిపిస్తారు. చాలామంది చీత్కారాలకు, అవహేళనలకు సమాధానం చెపుతూనే  రెండు లక్ష్యాలతో బ్లాగు ప్రపంచంలో ఆయన వాణిని వినిపిస్తున్నారు. వాటిని ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఒకటి “తెలుఁగు పద్యంబు నిత్యమై తేజరిల్లు” తెలుగు పద్యానికి ప్రాచుర్యం కలిగించడం., రెండు బంగారు తెలంగాణ సాధనలో తానూ పాత్రధారి కావడం. 

తెలుగు భాష గురించి, పద్యం గురించి ఎంత ఓపికగా సమాధానాలు చెపుతారో తెలంగాణా వ్యతిరేకులపైనా, నిర్హేతుక విమర్శలపైనా అంత ఘాటుగా స్పందిస్తారు. నా అభిమాన నటుడు ఎన్.టి.ఆర్ - అభిమాన నేత కె.సీ.ఆర్ అని ధైర్యంగా చెప్పగలరు. వివిధ అంశాలపై 'పల్లెప్రపంచం' అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు. ఇంటర్వ్యూ వివరాలు క్రింద ఉన్నాయి.

(బంగారు తెలంగాణా సాధనలో పాత్రధారి గుండు మధుసూధన్ గారు)

ప్ర -  మీ పేరు?
జ -  గుండు మధుసూదన్

ప్ర - మీ వయస్సు?
జ - 56సం.లు.

ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
జ - మా ఇంటిపేరు "గుండు"వారు. మా తాతగారు గుండు పెద్ద వీరయ్యగారు. మా నాయనమ్మ గుండు లచ్చమ్మగారు. మా పూర్వికులది అయ్యనప్రోలు (నేటి అయిలోని>అయినవోలు) గ్రామం. బతుకుదెరువుకై మా తాతగారు వరంగల్లులోని గిర్మాజిపేటకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

మా తండ్రిగారు గుండు రామస్వామిగారు. శ్రీలక్ష్మీనారసింహస్వామి భక్తులు. ఆజంజాహీ బట్టలమిల్లులో కొంతకాలం పనిచేసి, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మానివేసి, ఇంటివద్దనే ప్రైవేటు పాఠశాలను ప్రారంభించి, ఐదవతరగతి వరకు పిల్లలకు విద్యబోధిస్తూ జీవనం సాగించారు. ఆయన చదివింది నైజాం కాలంలో రెండవతరగతే అయినా, పోతన భాగవతం ఆమూలాగ్రం పఠించారు. ఎప్పుడూ అందులోని వివిధ ఘట్టాలలోని పద్యాలను రాగయుక్తంగా పఠిస్తూ ఉండేవారు. ఇంతేగాక యక్షగానాలూ, రంగస్థల నాటకాలలోని ఘట్టాలను, పద్యాలను పఠిస్తుండేవారు. వారి సాహిత్యాభినివేశమే నాకూ పట్టుబడింది. ఛందస్సు తెలియకపోయినా చదివేది ఏ పద్యమో ఇట్టే తెలిపేవారు. పద్యరచన చేయడం వారికి పట్టుబడలేదు. నాకు పట్టుబడింది. అది నా భాగ్యంగా భావిస్తాను. మా తండ్రిగారు జీవించియుంటే నా పద్యాలను పఠించి పొంగిపోయేవారేమో? వారు నా పద్యరచన చూడకుండానే స్వర్గస్థులుకావడం నా దురదృష్టం.

మా తల్లిగారు గుండు మల్లికాంబగారు. సామాన్య గృహిణి. నాకన్న ముందు ఏడుగురు సోదరులు పుట్టి చనిపోయారు. ఎనిమిదవ సంతానంగా నేను జన్మించాను. నేనూ వాళ్ళలాగే దక్కకుండాపోతానేమోననే భయంతో నాకు నాలుగేళ్ళ వయస్సు వచ్చేంతవరకూ మా తల్లిగారు ఇల్లిల్లూ తిరిగి నాకు అవసరమయ్యే వస్తువులూ ఆహారం, బట్టలు, బొమ్మలు మొదలైనవి బిచ్చమెత్తి తెచ్చి నాకిచ్చారు.   కనీసం బిచ్చగానివలెనైనా నా కొడుకు బతకాలనే తపనతో అలా చేసివుంటారు. అందుకే నాకు "భిక్షపతి" అనే పేరు పెట్టి నన్ను అల్లారుముద్దుగా పెంచిపెద్దచేశారు. మా తండ్రిగారు నాకు పెట్టిన పేరు "మధుసూదన్". ఆయన విష్ణుభక్తులుకాబట్టే నాకా పేరు పెట్టివుంటారు. మా తల్లిదండ్రులు నాపై చూపిన వాత్సల్యం అమూల్యమైనది. వారు  నాకెప్పుడు గుర్తుకు వచ్చినా నా కళ్ళు చెమరుస్తాయి...హృదయం ద్రవిస్తుంది.

ప్ర - మీ జన్మస్థలం?
జ - గిర్మాజీపేట, వరంగల్ జిల్లా

ప్ర - ప్రస్తుత నివాసం?
జ - రంగశాయిపేట, వరంగల్

ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ -  1-3 అమ్మబడి (ప్రైవేటు పాఠశాల), ఇంటికి దగ్గరలో(గిర్మాజీపేట)వరంగల్
    -  4-7 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, చార్‍బౌళి, వరంగల్
    -  8-10 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిర్మాజీపేట, వరంగల్‍లో
    -  ఇంటర్ మీడియట్…ప్రైవేటుగా…ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్
    -  బి.కాం (వాణిజ్య శాస్త్రం మరియు తెలుగు సాహిత్యం) అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. హైదరాబాద్
    -  ఎం.ఏ.(తెలుగు) ఎస్.డీ.ఎల్.సీ.ఈ., కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
    -  తెలుగు పండిత శిక్షణ…ప్రభుత్వ విద్యా కళాశాల, హనుమకొండ, వరంగల్

ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ - మా తల్లిదండ్రులకు జీవితం చివరి దశకు చేరిన సమయంలో నేను జన్మించడం వల్లా, వారికి చేదోడు వాదోడుగా నేనొక్కడినే ఉండలేను కాబట్టి నాకు పదిహేడేళ్ళ వయస్సులోనే (పదవ తరగతి ముగియగానే) మా మేనమామ కుమార్తె "సరోజన"తో వివాహం జరిపించారు. నాకు ఇరవై ఒక్క ఏండ్ల వయస్సు వచ్చేసరికే మాకు ఇద్దరు కుమార్తెలు...(ప్రశాంతకుమారి, ప్రవీణకుమారి) జన్మించారు. పదేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఒక కుమారుడు (ప్రణీత్ కుమార్) జన్మించాడు.

ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ - నాకు పెళ్ళి చేయగానే ఆర్థిక ఇబ్బందులవల్ల మా తండ్రిగారు నా చదువుకు ఫుల్‍స్టాప్ పెట్టి, నన్ను ఒక షాపులో గుమాస్తాగా అరవై రూపాయల జీతానికి కుదిర్చారు. ఆ సమయంలో నేను పనిచేస్తూనే రాత్రుల్లో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు (సంస్కృతాంధ్రగ్రంథాలు) చదువుతూ నా సాహిత్యజ్ఞానాన్ని వృద్ధిపరచుకున్నాను. ఆ తర్వాత ఒక సీ.ఏ. దగ్గర గుమాస్తాగా పనిలో చేరాను. ఆకాలంలో ప్రైవేటుగా ఇంటర్, అలాగే ఓపెన్ యూనివర్సిటీలో బి.కాం. (తెలుగు సాహిత్యంతో) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివి ఉత్తీర్ణుడనయ్యాను. నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మా తండ్రిగారు మరణించారు. కొన్ని నెలలలోనే ఒక ప్రైవేటు ఆంగ్లమాధ్యమ పాఠశాలవారు నన్ను తెలుగు పండితునిగా తెలుగు బోధించడానికి ఆహ్వానించారు. డిగ్రీ పూర్తికాకున్నా నాకున్న పరిజ్ఞానంతో నేను చేసిన బోధన వారిని సంతృప్తులను గావించింది కాబోలు నాకు తెలుగు పండితునిగా ఉద్యోగం ఇచ్చారు. అక్కడే నాలుగేళ్ళు పనిచేశాను. డిగ్రీ పూర్తయ్యే సమయంలో మా తల్లిగారు పరమపదించడంతో పరీక్షలుకూడా రాయలేకపోయాను. డిగ్రీకి ఫుల్‍స్టాప్ పడింది. మూడేళ్ళ తర్వాత నా సహోపాధ్యాయుడూ, బాల్య స్నేహితుడూ ఐన శ్రీ రామా ప్రభాకర్‍‍రావు ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తిచేసి, పండిత శిక్షణ కూడా పొందడంవల్ల ఉత్తరోత్తరా మెరుగైన పాఠశాలల్లో పనిచేయడానికి అవకాశాలు లభించాయి. కొద్దికాలంలోనే తెలుగు పండితునిగా ప్రభుత్వ ఉద్యోగంలో మొదటి ర్యాంక్ పొంది, పట్టణ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా నియమింపబడ్డాను. ఈ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం ప్రస్తుతం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు సాగింది.

ప్ర - మీ బ్లాగుల పేరు?
జ - 1. మధుర కవనం (తెలుగు పద్య సాహిత్యం) - http://madhurakavanam.blogspot.com/




ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ -  మధుర కవనం….. తెలుగు పద్య సాహిత్య పిపాసువులకు పద్య రచనలను పరిచయం చేయడం, వారి అమూల్య సూచనలను స్వీకరించడం.
     నా తెలంగాణ కోటి రత్నాల వీణ… తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను తెలంగాణులకు తెలియజేసి, ఉద్యమాన్ని సరైన రీతిలో కొనసాగేటట్లు చేయడం, బంగారు తెలంగాణ సాధనలో ఏర్పడే ఒడిదుడుకులను అధిగమించడానికి అహర్నిశలూ శ్రమించి, తెలంగాణులకు తగు సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయడం…ఇంకా అభివృద్ధిపథంలో తెలంగాణను పయనింపజేయడంకోసం అన్ని విధాలా సాయపడడం…

ప్ర -  మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ - మా వరంగల్‍లోని సాహితీ మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు శంకరాభరణం అనే పద్యసాహిత్య బ్లాగును నడుపుతుంటే…నాకు కూడా పద్య సాహిత్యాభిమానులకై ’మధుర కవనం’నూ, తెలంగాణులను మేలుకొల్పడానికై ’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’నూ నడపాలనే ఆలోచన కలిగింది.

ప్ర -  మీ బ్లాగు అనుభవాలు?
జ - ప్రారంభంలో “మధుర కవనం”కు వీక్షకులే లేరు. శ్రీ కంది శంకరయ్యగారు మాత్రమే వీక్షిస్తూ ప్రోత్సహించేవారు. వారి సలహా మేరకే నేను బ్లాగు అగ్రిగేటర్‍లకు నా బ్లాగుల వివరాలు పంపి, తెలుగు బ్లాగుల్లో ’మధుర కవనం’కు వీక్షకులను రప్పించగలిగాను. అయినా…పద్య సాహిత్యానికి తగినంత ప్రోత్సాహం, చూడాలనే తపన ఇంకా రాలేదు గనుకనే ఎక్కువ మంది వీక్షకుల్ని ఆకర్షించలేకపోతున్నది. వీక్షకులు పరిమితంగానే ఉన్నప్పటికీ…వారే నాకు ’పదివేల సైన్యం’.

’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’కు ఎంతోమంది వీక్షకులు వచ్చారు. ఆంధ్రానుండీ…తెలంగాణనుండీ…వీక్షకులు అనేకులు తయారయ్యారు. ఇప్పటికీ నేను ఏ పోస్టు పెట్టినా…కొన్ని సెకనులలోనే … అనేక మంది వీక్షకులు పఠిస్తున్నారు.

’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’లో ఆంధ్రా వారి నుండి ఎన్నో హేళనలనూ, చీవాట్లనూ, అవమానాలనూ, తిట్లనూ, అసత్యారోపణలనూ ఎదుర్కొనాల్సివచ్చింది.

’మధుర కవనం’లో సాహిత్యాభిమానుల ఆదరాభిమానాలనూ, అభినందనలనూ పొందగలిగాను.

ప్ర -  బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?
జ - ఆంద్రా ప్రజలు (అలాగే కొందరు బ్లాగర్లు) నా బ్లాగులోని పోస్టులను సహేతుకంగా విమర్శించేవారు కొందరూ, నిర్హేతుకంగా విమర్శించేవారు చాలా మందీ…అనేక వ్యాఖ్యలు రాశారు. వీటిని నాకు ఎలా ఎదుర్కోవాలో తోచేది కాదు. తెలంగాణకు జరిగిన అన్యాయం…పాలకులు చేస్తున్న అక్రమం… వాళ్ళకు కనిపించేది కాదు. కేవలం ’తెలంగాణులు విడిపోవలనుకుంటున్నారు’ ఆంధ్రప్రదేశ్‍ను రెండు ముక్కలు చేయాలనుకుంటున్నారు…అన్నదే వారి కోపం…అంతేగానీ…తెలంగాణులు అరవై ఏండ్లుగా అనుభవించిన బానిసత్వం, అసమానత్వం, అన్యాయం వాళ్ళ కళ్ళకు కనిపించలేదు. విమర్శించడమే…వెక్కిరించడమే…అవమానించడమే వారి లక్ష్యం. అందుకే అన్ని రకాలుగా నా బ్లాగులోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిరాతలు రాసేవారు. అందుకే నేను బాగా ఆలోచించి…వారి వ్యాఖ్యలు నా ఆమోదం పొందిన తర్వాతనే ప్రచురించబడేట్టుగా అమర్చాను. ఇప్పటికీ…పిచ్చి రాతలు రాసేవారు రాస్తూనే ఉన్నారు. అవి స్పామ్‍లోకి పోతూనే ఉన్నాయి. ప్రచురణ యోగ్యమైనవి ప్రచురించబడుతూనే ఉన్నవి.

ప్ర - సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?
జ -  నేను సీనియర్ బ్లాగర్‍ని అనుకోవడంలేదు. నాకింకా చాలా అనుభవం రావాల్సి ఉంది. ’మధుర కవనం’బ్లాగులో కంటే…’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’బ్లాగులో చాలా అనుభవం వచ్చింది. ఆంధ్రావాళ్ళ పిచ్చి వ్యాఖ్యలకు నా తెలంగాణ ఎదుర్కొన్న అన్యాయాలే ఉదాహరణలుగా ప్రతిసమాధానం ఇచ్చేట్టు చేశాయి. యథార్థ సంఘటనలే వాళ్ళను ఎదుర్కొనేలా చేశాయి. ఎవరైతే తెలంగాణాను, తెలంగాణులను దూషిస్తున్నారో వాళ్ళకు చెంపపెట్టు పెట్టి సరైన సమాధానం దొరికేలా చేసింది…మాకు జరిగిన అవమానాలే…అసమానతలే…దోపిడులే…ద్రోహాలే…వాటి చరిత్రలే … జరిగినవీ…జరుగుతున్నవీనూ. ఇవన్నీ నాకు కలిగిన అనుభవాలు! ఇవి నాకు సీనియర్ బ్లాగర్‍ అనే పేరు తెచ్చేవి కానేకావు. నేను బ్లాగర్‍నని అనుకోలేదు…తెలంగాణ రాష్ట్ర సాధనా హోమంలో నేనొక సమిధగానైనా ఉపయోగపడాలన్నదే నా తపన. సీనియర్ బ్లాగర్‍ననిపించుకోవడం నా ఊహకు అందనిది.

ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలు ఇచ్చేటంత గొప్పవాడిని నేను కాను. ఏదో నా వరకు నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. అంతే...

ప్ర - మీ బ్లాగులో మీ పోస్టులలో మీకు నచ్చినవి?
జ - అన్నీ నచ్చిన పోస్టులే. ఐతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏర్పడిన రాజకీయ పరిణామాలలో ప్రతిరోజూ…పద్యాలనూ…గేయాలనూ…వివిధ నడకలలో రాయడం జరిగింది. వాటి రచనా శైలి ఇప్పటికీ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను ఆ వేగంతో కూడిన సమయంలో ఇంత అందంగా రాయగలిగానా? అని. ఇవి నాకు బాగా నచ్చిన పోస్టులు.

ప్ర -  ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ - తెలుగు వారికై, వారి జ్ఞానాభివృద్ధికై నిరంతరం తోడ్పడే బ్లాగులు నాకు బాగా నచ్చాయి. ఈమాట, ఆంధ్రామృతం, శంకరాభరణం, కథామంజరి , అంతర్యామి, వలబోజు జ్యోతిగారిబ్లాగు, మందాకిని మొదలైన సాహితీ బ్లాగులూ….కట్టా-మీఠా, అక్షరసత్యాలు, నా తెలంగాణ, మిషన్ తెలంగాణ, గుండెఘోష, పోరు తెలంగాణ, అమృతమథనం, ఉదయరాగం, ఏది సత్యం?, కోటి రత్నాల వీణ, తొవ్వ, ధర్మమేవ జయతే, జై గొట్టిముక్కల వారి బ్లాగు మొదలైన తెలంగాణ బ్లాగులు నాకు బాగా నచ్చాయి.

ప్ర - బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జ -  పైన వివరించాను

ప్ర -  తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?
జ - ఎక్కువ సమాచారాన్నిచ్చి, ప్రభావవంతంగా వీక్షకుల మెదళ్ళలోకి చొచ్చుకుపోగలిగేలా బ్లాగును తీర్చి దిద్దితే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందీ మీ బ్లాగు.

ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ - వీక్షకులకు, పాఠకులకు విజ్ఞానంతో పాటు వినోదాన్నీ, కర్తవ్యప్రబోధాన్నీ అందించేవిగా ఉండడమే బ్లాగుల వల్ల కలిగే ఉపయోగాలు.

ప్ర - మీ హాబీస్  ?
జ - సాంప్రదాయిక పద్య రచన, చిత్రలేఖనం, ఘంటసాలగారి భక్తిగీతాలు మొ. వినడం, పద్యాలు నా బాణీలో రాగయుక్తంగా పఠించడం, ప్రాచీన పద్య సాహిత్య పఠనం మొదలైనవి.

ప్ర - మీ అభిమాన రచయిత  ?
జ - వచన రచయితల్లో ప్రత్యేక రచయితలెవరూ లేకున్నా యద్ధనపూడి, మాదిరెడ్డి, ఇల్లిందల గారల నవలలు ప్రభావితంచేశాయి.. డిటెక్టివ్ నవలా రచయితలు కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, గిరిజశ్రీ భగవాన్ గారల రచనలు నాలో చురుకుదనాన్ని నింపాయి. ముఖ్యంగా యండమూరివారి నవలలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయనవచ్చు.

ఏది ఏమైనా వచన రచనలను ప్రక్కన బెడితే...నన్ను పూర్తిగా ప్రభావితం చేసిన కవులలో ముఖ్యుడు బమ్మెర పోతన. ఆ తర్వాత ప్రాచీన సాహిత్య కవుల ప్రభావం నాపై ఎక్కువ ప్రభావం చూపింది. శతక పద్యాలు చిన్ననాడే అర్థం తెలియకుండానే కంఠస్థం చేసినా...పెద్దవాడినైన తర్వాత వాటి ప్రభావం నా నిజజీవితంపై పడింది. నా వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యదోహదకారులయ్యాయి ఆ శతకాలు!

ప్ర - మీకు నచ్చే రచనలు?
జ - ప్రాచీన కావ్యాల్లో పోతన భాగవతం, పాల్కురికి సోమన్న కావ్యాలు, మనుచరిత్ర, ఆముక్తమాల్యద, వసుచరిత్ర, పారిజాతాపహరణం, శ్రీనాథుని కావ్యాలు, మొల్ల రామాయణం, విజయవిలాసం, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం మొదలైనవి నాకు నచ్చినవి.

ఆధునిక కావ్యాల్లో వానమామలై వరదాచార్య, జగన్నాథాచార్య సోదరకవుల కావ్యాలు, వద్దిరాజు సోదరకవుల పద్య రచనలు, దాశరథి కృష్ణమాచార్యులవారి పద్య రచనలు, పల్లా రామకోటార్యగారి వెంగళప్ప శతకం (వినగదప్ప వెఱ్ఱి వెంగళప్ప...మకుటం గలది), సిద్ధప్ప వరకవి పద్య రచనలు, ఠంయ్యాల లక్ష్మీనరసింహాచార్యుల పద్య కావ్యాలు, చిలుకమఱ్ఱి రామానుజాచార్యులవారి పద్య కావ్యాలు మొదలైనవి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రచనలు.

ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ - సాత్త్వికాహారమంటేనే నాకు ఇష్టం. దోసకాయముక్కలు, మునగకాడలు, టమాటాలు మొదలైనవి వేసి చేసిన పప్పుచారుతో భోజనమంటే నాకెంతో ఇష్టం. అలాగే పాలకూర పప్పంటే చాలా ఇష్టం.

ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ - చాలా కష్టమైన ప్రశ్ననే అడిగారు. దీనికి చాలా రకాలుగా (డబ్బుఅనీ, పలుకుబడి అనీ, స్నేహం అనీ సుఖంగా బతకడం అనీ) సమాధానాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. "లోకో భిన్నరుచి" అన్నట్లుగా ఒక్కొక్కరూ ఒక్కొక్కరకంగా సమాధానం చెబుతారు. అయితే సమంజసమైన సమాధానం ఏమంటే "మంచివ్యక్తి"గా మిగిలిపోవడం. మంచితనం పదిమందిలో (మనం మరణించినా) చిరస్థాయిగా జీవించేటట్లు చేస్తుంది. ఎదుటివాని విషయంలో చెడ్డవానిగా ముద్రింపబడడం కంటే మరణించడం మేలు. సచ్ఛీలం (మంచి నడవడి) కోల్పోవడంవల్ల మన విలువ పడిపోతుంది. దీనికి శాంతగుణం తోడుపడుతుంది. తొందరపాటు లేకుండా బాగా ఆలోచించి ఎదుటివారి మనస్సుకు కష్టంకలగకుండా ప్రవర్తిస్తే వారి మనస్సులో మనం గొప్పవారిగా, మంచివారిగా ముద్రింపబడతాం. అందరిలోనూ మంచివానిగా పేరుతెచ్చుకోవడం కంటే గొప్ప ధనం ఏముంటుంది? ఈ పేరు ధనమిచ్చి కొనుక్కోలేం కదా! అందుకని జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది "మంచితనం" అని నా భావన.

ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ - నాకు ప్రభుత్వ ఉద్యోగం రాదు అనుకుంటున్న సమయంలో ఫస్టుర్యాంకుతో తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలలో నియమింపబడటం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. అలాగే బి.కాం.(తెలుగుతో) విద్యార్హత గల నన్ను డబుల్ ఎమ్మేలు చేసిన మహామహులు అభ్యర్థులుగా ఉన్న ఇంటర్వ్యూలో నెగ్గలేవంటూ నిరుత్సాహపరిచిన శ్రీ భద్రయ్యసార్ గారి మాటల్ని వమ్ము చేస్తూ వరంగల్ పబ్లిక్ స్కూల్‍లో ఇంటర్వ్యూలో ప్రథమునిగా నెగ్గి, తెలుగు పండితునిగా నియమింపబడడం నాకు జీవితంలో మరువరాని విషయం!

ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జ- నాకు ఇతరులలోని సౌమ్యత, నిజాయితీ, నిబద్ధత, కార్యసాధకత, స్నేహశీలత మొదలైన గుణాలు బాగా నచ్చుతాయి.
ఇతరులలోని అసత్యవాదిత్వం, అన్యాయం, దౌష్ట్యం, చాడీకోరుతనం, స్వార్థం మొదలైన దుర్గుణాలు  నచ్చవు.

ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జ- నేను సరైనది అనుకున్నదాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సాధించాలనే గుణం నాకు నచ్చుతుంది. మొహమాటానికి పోయి ఇతరులకు సాయంచేయడంద్వారా చిక్కులు తెచ్చుకోవడం నాకు ఎంత వదిలించుకోవాలన్నా వదిలించుకోలేని గుణం.
( బమ్మెర పోతన ఇమేజ్ ఆలోచనాతరంగాలు బ్లాగు సౌజన్యంతో )
ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ- మా తండ్రిగారు మరియు బమ్మెర పోతన ఇద్దరే!

ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ- తెలుగు భాషా బోధక వృత్తి నాకు బాగా నచ్చిన వృత్తి. ఎందుకంటే, భాషా బోధనలో లభించినంత తృప్తి ఇంకే వృత్తిలోనూ లభించదని నా నమ్మకం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయునికే...ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయునికే సాధ్యమౌతుంది. వారే విద్యార్థుల హృదయ ఫలకాలపై స్థిరంగా నిలిచిపోతారు. నేనింతవరకూ తెలుగు పండితునిగా బోధించిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కడ ఎదురుపడినా "నమస్కారమండీ గురువుగారూ" అంటూ రెండుచేతులూ జోడించి నమస్కరించడం నాకు ఎంతో ఔన్నత్యాన్ని కలిగించింది.

ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ- నాకు డిప్రెషన్ కలిగించిన అంశాన్ని గురించి అలాగే ఆలోచిస్తూంటే మరింత అసహనం పెరుగుతుంది. కాబట్టి ఆ అంశాన్ని వెంటనే మరిచిపోవడానికి నాకిష్టమైన ఇతర విషయాలపై మనస్సును మళ్ళించడానికి ప్రయత్నిస్తాను. తద్వారా డిప్రెషన్ కలిగించిన అంశం యొక్క తీవ్రత తగ్గుతుంది. క్రమంగా కాలమే ఆ తీవ్రతను తగ్గిస్తుంది. మామూలు జీవనంలో పడేలా చేస్తుంది. నెమ్మదిగా ఆ అసహనంనుండి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి డిప్రెషన్ కలిగినప్పుడు తీవ్రంగా స్పందించకుండా ఇతర ఇష్టమైన అంశాలపైకి మనస్సును మళ్ళించగలిగితే నెమ్మదిగా దానినుండి ఉపశమనం కలుగుతుందని నేను అనుభవపూర్వకంగా గ్రహించాను.

ప్ర -  నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ- యువతకు సలహాలిచ్చేటంత గొప్పవాణ్ణి నేను కాను. కాకపోతే అనుభవజ్ఞులైన తల్లిదండ్రులు, పెద్దలు చెప్పిన విషయాలను పెడచెవిని బెట్టకుండా, అనుసరిస్తే...జీవితంలో దుఃఖించాల్సిన అవసరం రాదు. ఎవరైతే ఎవరినీ లెక్కచేయకుండా గర్వంతో విర్రవీగుతూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో వారు భవిష్యత్తులో అనేక బాధలు పడాల్సివస్తుంది. "పెద్దలాడు మాట చద్దిమూట" గదా! గర్వాన్నీ, స్వార్థాన్నీ (కొంతవరకుంటే చాలు) పూర్తిగా తగ్గించుకుంటే, ’యువత’కు సమాజంలో గౌరవనీయమైన స్థానం దక్కుతుంది.

ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ- ఇతరులు ఎలా మాట్లాడితే మన మనస్సుకు కష్టం కలుగుతుందో, అలా మనం మాట్లాడకుండడం వల్ల అందరూ మనను ఇష్టపడతారు...అభిమానిస్తారు...స్నేహంచేస్తారు. ఎవరైనా మనకు శత్రువులుగా మారాలన్నా, స్నేహితులుగా మారాలన్నా మన నాలుక మన స్వాధీనంలో ఉండాలి. నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరూ నొచ్చుకోరు.

ప్ర- మీరు తెలంగాణా వాదిగా ఉండే సందర్భంలో ఆంధ్రా ప్రాంతంపై కొంచెం శృతిమించిన ఆరోపణలు చేస్తున్నట్లనిపించిన సందర్భాలున్నాయా?
జ -  నేను ఎప్పుడూ శ్రుతిమించిన ఆరోపణలు చేయలేదు. ఆంధ్రావాళ్ళు మా సోదరులు. మా కోపం కేవలం మాకు అన్యాయం చేసిన పాలకులపైనే…దోపిడీదారులపైనే…దుర్మార్గవర్తనులపైనే….!!! ఆంధ్ర ప్రజలపై మాకు సోదరభావం మాత్రమే ఉన్నది. శత్రుభావన లేదు. నా పోరాటం అంతా తెలంగాణకు జరిగిన అన్యాయం, అవినీతి, దోపిడీ, దౌర్జన్యం, అసమానత్వం, అవమానం పైనే!! పాలకులుగానీ…దోపిడీదార్లుగానీ తెలంగాణకు ద్రోహం తలపెట్టినప్పుడు వాటిని ప్రజలకు తెలుపడానికి నా బ్లాగు అందరికన్నా ముందుంది. అన్యాయాలాను తెలంగాణులు అవలీలగా ఎదుర్కొనేలా చేసింది…చేస్తున్నది.!

ప్ర - తెలుగు సాహిత్యంపై మీకు పట్టు ఉండడానికి కారణం?
జ - మా నాన్న(కీ.శే.శ్రీ గుండు రామస్వామి) గారి ప్రోత్సాహంతో చిన్నప్పటినుంచీ కథలన్నా, పద్యాలన్నా ఇష్టం ఏర్పడింది. రెండవ తరగతినుండే…చందమామ, బాలమిత్ర, చంద్రభాను పిల్లల మాసపత్రికల్ని నా చేత చదివించారు మా నాన్నగారు. అలాగే ప్రతి తరగతికి ఒక శతకంచొప్పున ఐదవతరగతి వరకు ఐదు శతకాలు కంఠస్థం చేయించారు. అలాగే, మా బాబాయి (కీ.శే.శ్రీ చేరాల లక్ష్మణార్య) గారు నాలుగవ తరగతిలో “ఆర్య సమాజం” వరంగల్లులో వేదమంత్రాధ్యయనం చేయించడంతో పాటు, ఆరవ తరగతినుండి  విశ్వహిందూ పరిషత్ వారి సంస్కృత పాఠాలు తెప్పించి నాచేత చదివించారు. అలాగే మా నాన్నగారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు పోతన భాగవతంలోని గజేంద్రమోక్షణం, వామనావతార ఘట్టం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాదచరిత్ర లను నేర్పించారు. ఈ విధంగా నేను నా తోటి విద్యార్థులలో మేటిని కాగలిగాను. సాహిత్యం పట్ల అనురాగం ఏర్పడింది. పద్యరచన పట్ల మక్కువ కలిగింది. రచనాశక్తి ఉదయించింది. ఆనాటికి ఏమాత్రమూ ఛందఃపరిజ్ఞానం లేకున్నా, పఠనానుభవంతోనే పదవతరగతిలో కొన్ని పద్యాలు రాసి మా తెలుగు పండితులు కీ.శే.శ్రీ గోపాలకృష్ణయ్యగారి మెప్పును పొందగలిగాను!

ఇంతేగాకుండా…
హనుమకొండలో మిత్రమండలి సమావేశాలూ, శ్రీలేఖసాహితి సమావేశాలూ, ఆంధ్ర పద్య కవితా సదస్సు(వరంగల్ జిల్లా శాఖ) సమావేశాలూ, పుస్తకావిష్కణలూ, అవధానాలూ, పృచ్ఛకునిగా పాల్గొనడాలూ, సభలూ…ఇవన్నీ నాలోని సాహిత్యాన్ని మెరుగుపరిచాయి. శ్రీ కాళోజీ నారాయణరావుగారి ఇంట్లో, వారి అన్నగారు శ్రీ కాళోజీ రామేశ్వరరావుగారూ, శ్రీ దేవులపల్లివారూ, శ్రీ అనుముల కృష్ణమూర్తిగారూ, శ్రీ ఇందారపు కిషన్ రావుగారూ, శ్రీ మోతుకూరి మధుసూదనరావుగారూ, శ్రీ ఆవాల దామోదర రెడ్డి గారూ, శ్రీ అడ్డగట్ల శ్రీధర్‍గారూ, శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తిగారూ, శ్రీ సదానందాచారిగారూ, శ్రీ పల్లా రామకోటార్యగారూ, శ్రీ అనుమాండ్ల భూమయ్యగారూ, శ్రీమతి
కాత్యాయనీ విద్మహేగారు మొదలైనవారివల్ల ప్రభావితుణ్ణయ్యాను. ముఖ్యంగా మా తెలుగు ఉపన్యాసకురాలు శ్రీమతి శ్యామలగారి తండ్రిగారు శ్రీ టి.ఎస్.ఆర్.అప్పారావుగారి సూచనలవల్ల లక్షణబద్ధమైన పద్యం ఎలా రాయాలో తెలిసింది. ఇలాంటి మార్గదర్శకులలో ఒకరు శ్రీ కంది శంకరయ్యగారు. వారి పరిచయం నా పద్యాన్ని ఒక మలుపు తిప్పింది.

ప్ర - తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జ- విద్యార్థులలో పదసంపదను వృద్ధిచేయడం కోసం వాళ్ళకు తెలియని వివిధ పదాలను సులభమైన వాక్యాల్లో ప్రయోగించి, తమంతతామే వాటి అర్థాలను తెలుసుకొనేలా, ఆ పదప్రయోగాలనుంచి తామూ పదాల్ని వాక్యాల్లో ఎలా ప్రయోగించాలో ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేయడం.

లక్షణ(వ్యాకరణ)బద్ధమైన భాషను వ్యావహారిక భాషద్వారా  పద, వాక్య ప్రయోగాల ద్వారా తమంతతాముగా తెలుసుకునేట్టుగా చేయడం.

ఛందస్సును సులభమైన రీతిలో ఉదాహరణలతో (అప్పటికప్పుడు జరిగిన సంఘటనను గానీ, విద్యార్థుల పేర్లువచ్చేట్టుగాగానీ పద్యాలను నల్లబల్లపై రాసి) బోధించడం.

నేనే విద్యార్థులకై ఒక సులభ వ్యాకరణం రాయాలనుకుంటున్నాను.

ప్ర -  మీ లక్ష్యం ఏమిటి?
జ - “తెలుఁగు పద్యంబు నిత్యమై తేజరిల్లు” తెలుగు పద్యానికి ప్రాచుర్యం కలిగించడం. బంగారు తెలంగాణ సాధనలో నేనూ పాత్రధారిని కావడం
(కల్వకుంట్ల చంద్రశేఖర రావు)
ప్ర -  మీ అభిమాన నాయకుడు?
జ - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె. చంద్రశేఖర రావుగారు…తెలంగాణ సాధనకై నడుంబిగించి, మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగివచ్చారు…తెలంగాణను సాధించారు…తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు! అహర్నిశలూ కృషిచేస్తున్నారు.

ప్ర - మీకు నచ్చిన సినిమా  ?
జ - పాత సినిమాలు ఎన్.టీ.రామారావుగారివి, అలాగే పౌరాణిక, జానపద చిత్రాలు బాగా నచ్చుతాయి. ఇప్పటికాలానికి చెందినవి అన్నమయ్య, శ్రీరామరాజ్యం నచ్చిన చిత్రాలు.

( హిట్ పెయిర్ మహా నటీ-నటులు సావిత్రి - ఎన్.టి.ఆర్ )
ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ - నటరత్న, పద్మశ్రీ ఎన్.టి.రామారావు, సావిత్రి …ఇద్దరూ నాకు నచ్చిన నటీనటులు.

ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ- ఈ జగన్నాటకంలో మనం కేవలం పాత్రధారులమే...అంతా ఆ భగవంతుని లీల. ఇంతమాత్రానికే ఈ దోపిడీలూ, కక్షలూ, కార్పణ్యాలూ, అవినీతీ, స్వార్థం, దౌష్ట్యవర్తనం ప్రదర్శించడం అర్థంలేని పని. మన మనస్సులో ఎన్ని ఆందోళనలున్నా ఆ భగవంతునిపై భారం వేసి మన శక్తికొద్దీ ప్రయత్నించడం..మిగతాది భగవంతుడే చూసుకుంటాడనే నమ్మకంతో పనిచేయడం వల్ల మానసిక ప్రశాంతతకు ఆటంకం ఏర్పడదు. అనవసరపు ఆందోళన కలుగదు. అంతా ఈశ్వరేచ్ఛ అనుకోవడం వల్ల ఏదైనా ఆశించనిది జరిగితే భగదిచ్ఛగా భావించాము కాబట్టి పరస్పర నిందాలాపాలకు మనం కారకులం కాము. సాత్త్విక జీవనం సాధ్యమవుతుంది. భగవంతుడు మనకు ఇంతే ఇచ్చాడనే ఆత్మ సంతృప్తి కలిగి, ఈర్ష్యాద్వేషాలకు తావులేకుండాపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికజీవితం మనిషిని ఉన్నతంగా, మహా మనీషిగా తీర్చిదిద్దుతుందని నా నమ్మకం.

ప్ర - మతం పై మీ అభిప్రాయం?
జ-’మతం’ అంటేనే అభిప్రాయం అని అర్థం. వివిధ మతాలవారు వివిధ రీతులలో తమ భక్తి ప్రపత్తులను ప్రకటించుకున్నా, అందరు ప్రయత్నించేదీ ఆ భగవంతుని కృపకొరకేననే పరమసత్యం తెలుసుకుంటే ఏ మతవిద్వేషాలూ మన మనస్సులను చేరవు. అన్ని మతాల సారం ఒకటే...మానవత్వం ప్రదర్సించి, తోటి జీవులపై ప్రేమభావంతో ఉండడం...కష్టాలలో సహాయకారులమై ఉండడం...మనకున్నదానిలో కొంతలో కొంతైనా బాధితులకు, నిర్భాగ్యులకు దానంచేయడం...అన్యాయవర్తనులం కాకుండా ఉండడం...మొదలైనవి ఏ మతమైనా బోధిస్తుంది. కాబట్టి మతంపేరుతో విద్వేషంతో విధ్వంసం సృష్టించడం అమానవీయం. అలా ప్రవర్తిస్తే దైవాగ్రహానికి గురికావలసివస్తుంది. కాబట్టి సర్వమానవ సమానతే మతానికి గమ్యం కావాలి.

ప్ర - సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?
జ- సనాతన ధర్మం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. దీనికి స్వార్థం, విద్వేషం తోడైతే అది కలుషితమవుతుంది. అది ధర్మభ్రష్టమై అధర్మానికి దారితీస్తుంది. పర మతాల్ని శత్రువులుగా భావింపజేస్తుంది. అందుకని సనాతన ధర్మ నిర్వహణలో మానవుడు తన హద్దులు దాటకుండా ప్రవర్తిస్తే అది మహనీయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఛాందసంగా (మూర్ఖంగా) ఆలోచించకుండా, మానవీయంగా ఆలోచిస్తే మేలు కలుగుతుంది.

ప్ర - మీరు చెప్పదలచుకున్న ఇతర అంశాలు?
జ - స్వార్థ ప్రయోజనాలను వదలి…సత్యమైన అంశాలను…అవసరమైన విషయాలను…మోసం ఎంతమాత్రం లేకుండా …ఆచరణయోగ్యమైనవిధంగా…ప్రభావవంతంగా…ప్రతిభాయుతంగా అందిస్తే …పాఠకులకు  గొప్ప మేలు చేసినవారవుతారు.
***********************************************
మీరు మీకు నచ్చిన బ్లాగరుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మాకు వ్రాయండి. వివరాలకు ఇక్కడ నొక్కండి. ఇతర ఇంటర్వ్యూలను వీక్షించదానికి ఇక్కడ నొక్కండి.
***********************************************
- పల్లా కొండల రావు.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top