చర్చకు ఉంచిన పదం : తెలుగులోంచి ఆంగ్లంలోకి వెళ్ళిన పదాలు.
Name: | శివరామప్రసాదు కప్పగంతు |
E-Mail: | deleted |
Subject: | తెలుగులోంచి ఆంగ్లంలోకి వెళ్ళిన పదాలు :: తెలుగులో విచిత్రార్ధంలో వాడబడుతున్న ఆంగ్లపదాలు |
Message: | తెలుగలో అనేకమైన ఆంగ్ల పదాలే కాదు, సంస్కృత, పారశీక, హిందుస్థానీ మొదలైన భాషా పదాలు ఉన్నాయి. ఒక్క ఆంగ్లాన్నే ఎక్కుబెట్టి అనువాద పదాల వండకం ప్రస్తుతపు ఫ్యాషన్ (దీనికి తెలుగేమిటి!). పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొన్ని జిల్లాల సమూహానికి సర్కారు(హిందీ పదం) ప్రాంతం అనే పేరు ఉన్నది. ఇక్కడ సర్కారు అంటే అంటే ఇంగ్లీషు వారి పాలనలో ఉన్నది అనే అర్ధం, అదే మాట ఇప్పటికీ వాడుతున్నాము. సర్కారు అంటే ఏమిటి, ప్రభుత్వం అన్న అర్ధం. విచిత్రం, ఈరోజున సర్కారు ప్రాంతమే కాదు రాయలసీమ కూడా కలిపి ఒకే ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ, పాత వాసన వదలక, సర్కారు పదం కొన్ని జిల్లాల సముదాయానికి వాడటం సర్కారు పదాన్ని విచిత్రార్ధంలో వాడటమే. బ్రిటిష్ వాళ్ళు మనను రెండు శతాబ్దాలు పరిపాలించి మనతో కలిసి బతికారు కదా, తెలుగు మాటలు ఏమన్నా ఆంగ్లంలోకి వెళ్ళినాయా? నాకు తెలిసినంతవరకూ, రైతు అన్న పదం, Ryot గా ఆంగ్లంలోకి వెళ్ళింది. కాని పదకోశ వెతుకులాటలో తెలిసినది రైతు అనే మాటకు మూలం పారశీకము ఆపైన హిందీ. కాబట్టి మనం తెలుగు అనేసుకున్న పదాలు ఎంతవరకూ తెలుగు అని చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలుగులో ఒక పండు పేరు నారింజ అని వాడుకలో ఉన్నది. అదే పండును ఆంగ్లంలో Orange అని అంటారు. కాబట్టి తెలుగలో నారింజ ఆంగ్లంలో ఆరంజ్ అయ్యిందా, లేక ఆంగ్ల ఆరంజ్ తెలుగులో నారింజ అయ్యిందా? సంస్కృతం లో ఉన్న नारङ्ग, ఇటాలియన్ భాషలో ఉన్న Naranza, పారశీకంలో ఉన్న Naranj ఈ పదానికి మూలాలుగా కనపడుతున్నాయి ఇంతేనా? లేక నారింజకు తెలుగు మూలాలు ఉన్నాయా? తెలియదు. ఎవరన్నా భాషా పండితులు చెప్పాల్సిందే! ఆంగ్లంలో ఫ్యామిలీ అంటే కుటుంబము, కాని తెలుగులో వాడే ఈ ఆంగ్ల పదం భార్య అనే పదం సూచించటానికి ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఆంగ్ల పదం ఒక విచిత్రార్ధంలో తెలుగులో వాడబడుతున్నది. ఈ విషయం గురించి మన బ్లాగుల్లోనే ఈ మధ్యనే ఒక వ్యాసం చూసాను, బాగా వ్రాశారు. ఆ వ్యాసం ఎవరు వ్రాశారో గుర్తుకు రావటం లేదు టూరుకు వెళ్ళటం, టూర్లో ఉన్నారు అనే వాడుకలో టూరు తెలుగు మాట కాదు. Tour అనే ఆంగ్ల పదానికి తెలుగీకరణ అయ్యి తెలుగు పదంగా వాడుకలోకి వచ్చేసింది. టూర్లో అనే మాట తెలుగు పద్ధతిలోనే ఆంగ్ల పదాన్ని తెలుగు చేసేశారు. అలాగే కాంపులో ఉన్నారు, కాంపుకెళ్లారు కూడా అంగ్ల పదాన్ని తెలుగులో వాడుకోవటమే. OK అనే పద సముదాయం లేదా హ్రస్వ పదం ఆంగ్లం లోకి ఎలా వచ్చిదో తెలియదు, దీనికి పెద్ద చర్చ ఆంగ్లేయులు జరుగుపుకున్నారు. ఈ పదసముదాయం తెలుగులోకి వచ్చేసి, ఓకేనా, ఒకే, ఒకేరా ఇలా రకరకాలుగా తెలుగు పదం అయిపోయింది. తోడల్లుడు, అంటే అక్కచెల్లెళ్ళ భర్తల మధ్య ఉన్న చుట్టరికాన్ని తెలియ చేసే పదం. ఆంగ్లలో ఇదే చుట్టరికాన్ని వాళ్ళు ఎలా అంటారు! నాకు తెలిసి వాళ్లకు ప్రత్యెక పదం లేదు అందుకని బ్రదర్ అనే మాటనే ఈ చుట్టరికానికీ వాడతారు. బ్రదర్ అంటే తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు తోడల్లుడూ కావచ్చు. కాని ఈ మధ్య తెలుగులో Co-Brother అనే పదం తోడల్లుడు కు వాడేస్తున్నారు. అంటే తెలుగులో వాడుకలో ఉన్న తోడల్లుడు, సంధి విడతీస్తే (నాకు తెలిసి) తోడు+అల్లుడు లో ఉన్న తోడు కు ఆంగ్లలో \"Co\" వాడుకుని అల్లుడు కు ఆంగ్లలో పదం లేక బ్రదర్ అనేసుకుని, \"కో బ్రదర్\" అనే విచిత్ర తెలుగు పదం వాడుకలోకి వచ్చింది. ఇది ఆంగ్ల పద భ్రష్ట వాడకమే. తెలుగులో కూడా \"తోడల్లుడు\" అక్కచెల్లెళ్ళ భర్తల మధ్య ఉండే చుట్టరికాన్ని తెలియచెయ్యటానికి సవ్యమైన పదమేనా? ఈ చుట్టరికాన్ని తెలియచేసే తెలుగులో మరొక మాట ఉన్నది \"షడ్డకుడు\" అని. ఈ పదానికి ఇంటర్నెట్టులో సవ్యమైన అర్ధం దొరకటంలేదు. ఈ మాట దాదాపు 60-70 దశకాల వరకూ వాడుకలో ఉన్నది. ఈరోజున కొబ్రదర్ తెలుగు మాటయ్యి కూచున్నది. మొత్తం మీద తెలుగునుంచి ఆంగ్లంలోకి వెళ్ళిన తెలుగు పదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు తట్టటం లేదు, ఎవరికన్నా తెలిస్తే చెప్పగలరు. |
*Re-published
Bandicoot అనే ఆంగ్లపదం 'పందికొక్కు' అనే తెలుగుపదంనుండి వచ్చింది. చిన్నప్పుడు మా ఇంగ్లీషు మాష్టారు చెప్పారు. Webster's dictionary లో కూడా మూలం Telugu - Pandikokku నుండి అని ఉంది.
ReplyDeleteనాకు తెలిసి బండి అనే తెలుగు పదాన్ని ఆధారంగా తీసుకొని ఆంగ్లంలో (తోపుడు బండి లేదా టేలా అర్ధం వచ్చేలా) bandy వచ్చింది.
ReplyDeleteతెలుగులోని "కూర" అనే పదం ఆంగ్లంలో "కర్రీ" గా మారింది.
ReplyDeleteపైగా బ్రిటిష్ పాలనలో కలక్టర్లుగా నియమింపబడే బ్రిటిష్ జాతీయులు తప్పని సరిగా తెలుగు నేర్చుకోవాలనే నిభందన కూడా ఉండేదట. అందువల్లె బ్రౌన్ అనే అంగ్లేయ కలెక్టర్ తెలుగు భాషాభిమానిగా మారి అనేక తెలుగు గ్రంధాలను, సాహిత్యాన్ని ముక్యంగా వేమన పద్యాలను సేకరరించి తెలుగు జాతికి అందించాడు. ఇక సన్స్కృతం నుండి ఆంగ్లంలో చేరిన పదాలకు కొదవే లేదు ఉదాహరణకు సంఖ్యలను చూస్తే త్రి (3)=three, అష్ట(8)= Eight నవ(9) = nine, దంత వైద్యుడు = Dentist