స్వామి వివేకానంద!
ఈ పేరు తలచుకోగానే భారతీయ యువ హృదయాలు ఉప్పొంగుతాయి. ఈ పేరు తలచుకోగానే భారతదేశపు ఆధ్యాత్మిక వేత్తల హృదయాలు సంతోష తరంగితమౌతాయి. ఈ పేరు తలచుకోగానే మహోన్నత భావ వీచికలు సకల జన హృదయాంతరంగాలనూ మరల మరలా సృశించి పరవశింపజేస్తాయి.
ఆధునిక కాలంలో భారతదేశపు ఆర్ష విజ్ఞాన పతాకాన్ని దేశ దేశాలలోనూ సమున్నతంగా నిలిపిన మహనీయులు ఇద్దరు. మొదటి వాడు వివేకానందుడు. ఆ తరువాతి వ్యక్తి భారత వేద ఋషి సంప్రదాయంలో చివరి ఋషిగా కీర్తించబడిన అరవిందుడు. అరవిందుడు కారాగారవాసంలో భగవద్గీతను అధ్యయనం చేస్తున్నప్పుడు కొన్ని సందేహాలు కలిగితే వాటిని వివేకానందుడు స్వప్నంలో సాక్షాత్కరించి నివృత్తి చేసినట్లుగా తెలుస్తున్నది.
వివేకానందుడనే సన్యాసాశ్రమ నామ ధేయంతో ప్రసిధ్ధుడైన మహనీయుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రుడు. పూర్తిపేరు నరేంద్రనాథ దత్తు. 1863లో జనవరి 12న జన్మించిన నరేంద్రుడి తండ్రి విశ్వనాథ దత్తుగారు ఒక పేరుమోసిన వకీలు. బాల్యం నుండీ ఆధ్యాత్మిక చింతన కల నరేంద్రుడు మొదట బ్రహ్మసమాజంలో చేరినా వారి బోధనలతో తృప్తిపడలేదు. 1881 నవంబరు నెలలో దక్షిణేశ్వరంలో రామకృష్ణపరమహంసను దర్శించి సూటిగా మీరు దేవుణ్ణి చూసారా? అని అడగిన నిర్మొగమాటీ, ధీశాలీ, అయిన యువకుడు నరేంద్రుడు. రామకృష్ణులు తడుముకోకుండా అంతే సూటిగా, "దేవుణ్ణి చూసాను. నిన్ను చూచినంత స్పష్టంగానూ అత్యంత ఆత్మీయంగానూ దేవుణ్ణి చూస్తున్నాను" అని చెప్పటంతో నరేంద్రుడికి తన అధ్యాత్మికోన్నతికి మార్గదర్శి లభించి ప్రశాంతత కలిగింది. రామకృష్ణుల దివ్యబోధనలతో ఆయన వ్యక్తిత్వమూ, ఆధ్యాత్మిక చింతనా పరిణతి చెందాయి. నరేంద్రుడు వివేకానందుడైనాడు. భారతదేశం అంతా పర్యటించి నలుమూలలా అలముకొన్న ఆకలీ, అజ్ఞానాలను చూసి పరితపించాడు. 1893లో ఆయన ప్రపంచ మత మహాసభలకు వెళ్ళి అక్కడ చేసిన దివ్య ప్రబోధం ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపింది. స్వదేశీయులను అది జాగృతపరచింది. 1897లో ఆయన రామకృష్ణామిషన్ అనే సంస్థను నిర్మించి రామకృష్ణుల సందేశాన్ని తన దివ్య ప్రసంగాలతో వ్యాప్తిచేసారు. జూలై 4, 1902న దైవసాన్నిధ్యం చేరుకున్న వివేకానందుడికి తీరని కోరిక ఒక్కటే, మరికొంత మంది వివేకానందులను జాతికి అందించలేకపోవటం.
వివేకానందుడు ఆవిర్భవించి నూట యాభై సంవత్సరాలు గడిచాయి. ఎన్నో సంవత్సరాలుగా, ఆయన ప్రతి జన్మదినోత్సవం నాడూ మనదేశస్థులం పాడిందే పాటగా వివేకానందుడి బోధనల వలన స్ఫూర్తి పొందామని బొంకుతూనే ఉన్నాం. మన రాజకీయ నాయకులు వివేకానందుడి దివ్యప్రభకు వ్యతిరేకంగా ఒక్కముక్క మాట్లాడినా జనం సహించరన్న భయంతో వివేకానందుడి బోధనలు తరతరాలకూ స్ఫూర్తినిచ్చే గొప్ప వారసత్వ సంపదలనీ, వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలనీ ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు.
నిజానికి వివేకానందుడి బోధనలు యువతరాలకు అందించేందుకు ఎటువంటి ప్రయత్నాలైనా జరుగుతున్నాయా? ఎంతో కాలంగా పాఠశాల విద్యార్థులకు వివేకానంద బోధనలు అందించాలని ప్రభుత్వానికి రామకృష్ణామిషన్ వారు విన్నపాలు చేస్తూనే ఉన్నారు. మన ప్రభుత్వం వారు 2009వ సంవత్సరంలో ఇచ్చిన ఒక జీవోలో పాఠ్యగ్రంథాలలో చేసే మార్పుల్లో భాగంగా వివేకానందుడి గురించిన పాఠం తొమ్మిదవ తరగతి పుస్తకాల్లో చేర్చుతున్నట్లు ప్రకటించారు. చివరికి 2013వ సంవత్సరంలో తొమ్మిదవ తరగతి నాన్-డీటైల్డ్ పుస్తకంలో వివేకానందుడి మీద ఒక అధ్యాయం చేరుస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎంతవరకూ అమలైనదీ తెలియదు. గమనార్హమైన విషయం ఏమిటంటే, వివేకానందుడి వంటి మహానుభావుడి గురించి మన పిల్లలకు ఇన్నాళ్ళూ బోధించటమే లేదు!
గత సంవత్సరం గుజారాత్లో బడిపిల్లలకు వివేకానందుడి చిత్రపటం ముద్రించి ఉన్న సంచులను ప్రభుత్వం పంపిణీ చేయటాన్ని కాంగ్రేసు వారు చిన్నపిల్లల మనస్సులను విషపూరితం చేసే చర్యగా అభివర్ణించారు.
ఇలా ఎందుకు జరిగింది? ఇలానే మనదేశంలో ఎందుకు జరుగుతోందీ? వివేకానందుడు ఒక హిందూ సన్యాసి. ఆయన కీర్తి కూడా ఆయన హిందూ మత సిథ్థాంతాలను పాశ్చాత్యదేశాలలో ఆమోద యోగ్యమైన సరళిలో పరమ సరళంగా ప్రచారం చేయటంతోనే ముడివడి ఉంది. మన ఘనత వహించిన దొరతనం వారికి హిందూ మతం అనేది ఒక ఓటు బ్యాంక్ ఎన్నడూ కాదు. మన దేశంలో మైనారిటీలు ఓటు బ్యాంకులనే అపోహ నడుస్తోంది. అందుచేత వారిని సంతృప్తి పరచటం కోసం మన నేతలు హిందూ మతాన్ని తమ తమ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని తాపత్రయ పడతారు. మన నేతలకు హిందూ టెర్రరిష్టులు కనబడుతున్నారు. ఒక వేళ వివేకానందుడు ఈ కాలపు వ్యక్తి అయి ఉంటే తప్పక ఒక హిందూ టెర్రరిష్టుగా ముద్రపడి ఉండేవాడు.
కాని నిజం ఏమిటంటే, వివేకానందుడు వెలిగించిన అఖండ జ్ఞానజ్యోతి ఇంకా సముజ్వలంగా వెలుగుతూనే ఉంది. ఆయన హిందూ మతానికి చెందిన సన్యాసిగా అవతరించినా హిందువుల్లో వ్యాప్తి చెందిన అనారోగ్యకరమైన భావాజాలాన్నీ హిందూ మతాచారాల్లో పేరుకుపోతున్న అనాచారాల్నీ నిర్మొగమాటంగా కడిగిపారేసాడు. మతం ఏదైనా ఆయన సందర్భానుగుణంగా నిస్సంశయంగా మెచ్చుకున్నాడు. అలాగే నిర్మొగమాటంగా చురకలూ వేసాడు. అలాగే వేదభారతి యొక్క పరమ సమ్మోహనకరమైన సుందర జ్ఞాన స్వరూపాన్ని ఆయన ఆవిష్కరించినట్లుగా మరెవరూ చేయలేదు. హైందవ వేదాంత విజ్ఞానాన్ని భారతదేశపు ఎల్లలు దాటి సమస్త మానవాళికీ అందుబాటులోకి వచ్చేలా చేసాడు. అందుకే ఆయన వేదాంత విప్లవమూర్తి! నిత్య చైతన్య స్పూర్తి !!
కేవలం మతాచార్యులకూ, ముదుసలివాళ్ళకూ మాత్రమే ఉద్దేశించినవి కావు మత గ్రంథాలు. అవి యువకులకూ అత్యంత విలువైన సందేశాన్ని ఇచ్చే విజ్ఞాన భాండారాలని వివేకానందుడు లోకానికి చాటి చెప్పటమే ఆయన చేసిన గొప్ప మహోపకారం. గ్రంథాలు పారాయణం కోసం కాదు అవి నిత్య జీవితానికి అన్వయించుకొని పురోగమించాలని ఆయన నిరూపించాడు. యువతకు బలమూ, ధైర్యమూ, కర్తవ్యనిష్టా అనేవి ఆయన ఉపన్యాసాలు నూరిపోసాయి. అందుకే ఆయనను ఆరాధ్య పురుషుడుగా ఇప్పటికీ యువతరం భావిస్తున్నది. ప్రతి యువతరమూ అలాగే భావిస్తుంది కూడా.
వివేకానందుడు శుష్కవేదాంత వాది కాడు. పరమ వాస్తవిక వాది. అఖండ వేద విజ్ఞానం కల వాస్తవిక ప్రపంచంలోని ప్రజ్ఞాశాలి. వేదాంత శాస్తాన్ని కాచి వడపోసి అమృత తుల్యంగా దాన్ని ప్రపంచ జనులకు వడ్డించిన దార్శనికుడు. వేదాంతాన్ని జీవితంలోకి విస్తరించి చూపిన మార్గదర్శి. ఆయన భారతదేశ వాసుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించాడు. నిర్మొగమాటంగా వారి భావ దారిదద్ర్యాన్ని ఎండగట్టాడు. దేశాన్ని ఆకలి బాధ నుండి తప్పించటానికి పారిశ్రామికీకరణకు నడుం బిగించమని ఉద్బోధించాడు. భారత దేశీయులు శాస్త్ర పరిశోధనా రంగాల్లో వెనకపడి ఉండటాన్ని ఎత్తి చూపాడు. ఈ ఉద్బోధనతో ఉత్తేజితుడైన జెమ్షెడ్జీ తాతా ఆయనకు 1898లో వ్రాసిన ఒక లేఖలో స్వామిని మానవతా విలువలతో కూడిన శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి దేశానికి పథనిర్దేశం చేయాలని అర్థించారు.
భారతదేశం అన్నిరంగాల్లోనూ స్వయంసమృధ్ధి సాధించాలన్నదే వివేకానందుల ప్రగాఢవాంఛ. 1897లో ఒక సందర్భంలో మాట్లాడుతూ స్వామి భారతీయులకు ఒక సందేశం ఇచ్చారు - వచ్చే అర్థశతాబ్దం పాటు ప్రతి భారతీయుడూ మాతృ దేశాభివృధ్ధి ఒక్కటే లక్ష్యంగా కర్తవ్యంగా జీవించాలన్నదే ఆ మహత్తర సందేశం. అది ఇప్పటికీ అవసరమైన సందేశమే.
ఎందుకంటే, నేటి యువతరం ఇక్కడ పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, పట్టా పుచ్చుకొని అమెరికా లాంటి ఇతర సంపన్న దేశాలకు పోయి తమ తమ సామర్థ్యాల్ని ఆదేశాల్ని మరింతగా సుసంపన్నం చేయటానికే వినియోగిస్తున్నారు. వారు తినగా మిగిలిన నాలుగు ఎంగిలి మెతుకులు ఇండియాలో తమ వాళ్ళకు విదిపి తమ వాళ్ళకూ తమ దేశానికీ ఉపకారం చేసామన్న భ్రమలో ఉంటున్నారు. ఇక్కడి వారు కోరేది వలస పోయిన యివతరం విదిపే ఎంగిలి కాదు. ఈ దేశాన్ని స్వయం సమృధ్ధం చేసే యువ నాయకత్వం! ఈ దేశాన్ని నడిపించటానికి యువశక్తి కావాలి. దీనికి పునర్వైభవాన్ని తీసుకు రావటానికి శ్రమించే యువశక్తి కావాలి.
వివేకానందుడే తన గురించి తాను చెప్పుకున్నట్లు, ఆయన 'భారతదేశపు సంక్షిప్త స్వరూపం'. ఆయన వాక్కు భరతమాత దివ్యవాక్కు. ఆయనకు జై అనగానే సరిపోదు. ఆయన బోధనల్ని మనం వంటబట్టించుకోవాలి. కార్యాచరణకు నడుం బిగించాలి. అదే వివేకానందుడికి మనం ఇచ్చే శ్రద్ధాంజలి.