“15ఏండ్లు మూడు రాష్ట్రాలలో జడ్జిగా పనిచేశా. హైకోర్టుకు ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులని ఎక్కడా చూడలేదు. ప్లీజ్…సారీ.. అనే పదాలను వాడడం వల్ల మీ తప్పులని క్షమించలేము. మీలాంటి ఐ.ఏ.ఎస్ లను చూడలేదు. ఉద్దేశపూర్వకంగా ఇస్తే కోర్టు ధిక్కరణ అని తెలియదా? క్షమాపణలు కాదు వాస్తవాలు చెప్పాలి” ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ ఇంచార్జి ఎం.డీ, ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఇచ్చిన వార్నింగ్ ఇది. కోర్టుకే తప్పుడు నివేదిక అందించాల్సిన అగత్యం ఐ.ఏ.ఎస్ లకు ఎందుకొచ్చింది? ఎవరి మొండిపట్టుదలను నెగ్గించడానికి వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు వేయించుకుని పరువు పోగొట్టుకోవలసిన అగత్యం ఏమిటి? ఆర్.టీ.సీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు ఐ.ఏ.ఎస్ లకు వేసిన అక్షింతలు చర్చనీయాంశమయ్యాయి. ఎంతో సంక్షేమ స్వభావం, ప్రజలకు కీడు జరగకుండేందుకు మరెంతో సంక్లిష్టతతో పకడ్బందీగా రూపొందించిన భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సేవ చేయడంలో ఐ.ఏ.ఎస్ అధికారులది కీలకపాత్ర. కానీ రాజకీయనాయకుల ఒత్తిడికి లొంగో, అవినీతికి తలొగ్గో వారా పాత్రను సక్రమంగా నిర్వహించలేకపోవడం దురదృష్టకరం. ఐ.ఏ.ఎస్ లందరూ అదేబాటలో లేకున్నా అత్యధికులదీ ‘అయ్యా! ఎస్’ బాటేనన్నది బహిరంగరహస్యం.
ఐ.ఏ.ఎస్ లు మూడు రకాలని చెప్పాలి. ఒకటి ‘అయ్యా!ఎస్’ అంటూ పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ స్వామికార్యమే పరమావధిగా పని చేస్తూ దొంగ స్వభావం కలిగిన దొరలకు అనుకూలంగా, అత్యంత నేర్పుగా రాజ్యాంగాన్ని పాలకులకు అనువుగా వాడడంలో వీరు సిద్ధహస్తులు. పైకి చూడడానికి ప్రజల కోసమే అన్నట్లు భ్రమింపజేసేలా లూప్ హోల్స్ తో జి.ఓ లు తయారు చేయగలరు. ఎక్కడ ఏ కన్నం ద్వారా పాలకులు తప్పించుకోవచ్చొ నేర్పుగా చెప్పగలరు. వారికి, వారికి పెట్టుబడులు సమకూర్చే బడాబాబులకు అండగా వీరి తెలివిని పెట్టుబడిగా పెట్టి లబ్ధి పొందుతుంటారు. వీరు ఏరకం I.A.S అంటే Iam Always Safe బాపతన్నమాట. వీరు స్వామి కార్యం చేసి మెప్పించినందుకు జీతం తో పాటు విలాసవంతమైన జీవితమూ ల(లా)భిస్తుంది. అయితే ఎల్లవేలలా వీరి ఆటలు సాగవన్నది చరిత్ర చెప్తున్న సత్యం. పాలకుల, వారి పెట్టుబడిదారుల అవినీతి సామ్రాజ్యాలకు అండగా చక్రం తిప్పినవారు ఆనక పరిస్థితిలో మార్పు వచ్చినపుడు కటకటాలు లెక్కించాల్సి వస్తున్నదీ నిజమే. ఆ… మనదాకా వస్తుందా…? అన్న మొండి ధైర్యం, పాలకుల అండ చూసుకుని వీరు ప్రజలకు, సమాజానికి ద్రోహం చేస్తుంటారు. వీరు నీచులుగా ప్రజలు,సమాజం దృష్టిలో ముద్ర వేయబడతారు.
రెండోరకం వారు మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. వీరిలో బ్యూరోక్రాటిక్ శాడిజం మాత్రమే కనిపిస్తుంది. వీరి వల్ల వారి ఈగోకు తప్ప అందరికీ నష్టమే. ప్రజలకూ, తోటి ఉద్యోగులకూ, మంచిపాలన చేద్దామనుకున్న నేతలకూ వీరు అడ్డుగోడగా నిలుస్తారు. అడుగడుగునా అడ్డుగోలు రూల్స్ తో అందరికీ ఆటంకంగా ఉంటారు. ఒకరకమ్గా వీళ్లు పెద్ద నసగాళ్లు. పుస్తకాలలో చదివి తెలుసుకున్నవి మాత్రమే అధికారంలో ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతూ తమ అధికారంతో అందరినీ హింసిస్తూ తాము పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీరు ఏ రకం I.A.S అంటే Iam Always Sincere అని తమకు తామే అనుకునే బాపతన్నమాట. వీరు కేవలం రూల్స్ కి మాత్రమే సేవ చేస్తారు. వీరితో ఎవ్వరికీ ఏ ప్రయోజనమూ ఉండదు.
మూడోరకం ఆణిముత్యాలు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపిస్తారు. తమ పరిధిలో ఉన్నమేరకు ప్రజలకు సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటారు. సామాన్యులు సైతం స్వేచ్ఛగా వీరిని కలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడా అహంకారం ప్రదర్శించరు. సింపుల్ గా సామాన్యులతో మమేకం కాగలరు. క్రింది అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ సఖ్యంగా మెలగడం ద్వారా క్లిష్టమైన, ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించగలరు. తాము చదివిన చదువుకు సార్ధకత చేకూరుస్తారు. ఇటువంటి వారు సమాజానికి కీడుకలిగే సందర్భాలలో పాలకులను సైతం ధిక్కరిస్తారు. అవమానాలను, అవహేళనలను ఎదిరిస్తారు. అకారణ బదిలీలను, ఇక్కట్లను ఎదుర్కుంటారు. ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను సైతం ఎదిరించి ప్రజల పక్షం వహించి నీతి, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఐ.ఏ.ఎస్ లూ చరిత్రలో ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నారు కూడా. S.R.శంకరన్, కాకి మాధవరావు, K.R.వేణుగోపాలరావు, బుక్కా నాదెండ్ల యుగంధర్, B.D.శర్మ వంటి అనేకులు ఈ కోవకు చెందిన వారు స్పూర్తిగా ఉండగా ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య వంటి వారూ ప్రజల మెప్పు పొందుతున్నారు. వీరు Iam Always Serve (Serve for Society) రకం I.A.S అన్నమాట. ఇటువంటి అధికారులకు అండగా ఉండాలి. వీరిపై రాజకీయుల పెత్తనాన్ని ప్రజలు, పౌరసంఘాలు అడ్డుకోవాలి.
ఎలాంటి అడ్డగాడిదైనా ఏ మంత్రి స్థానం అయినా పొందవచ్చు. కానీ ఎంతో కష్టపడి చదివితే తప్ప ఐ.ఏ.ఎస్ లు కాలేరు. అలాంటి ఐ.ఏ.ఎస్ లు అడ్డగోలు వ్యక్తుల సేవలో ఎందుకు తరించాలి? కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనైనా ఐ.ఏ.ఎస్ లు మేలుకోవాలి. ఆలోచించాలి. తాము దొరలకు బానిసలమా? ప్రజలకు సేవకులమా? అన్నది తేల్చుకోవాలి. ఏ దొర పెత్తనానికి తాము బలికాకుండా తమను తాము కాపాడుకోగలగాలి. ప్రజల పక్షాన నిలవాలి. సమాజం కోసం పదవిలో ఉన్నపుడు, పదవీ విరమణ అనంతరం, పదవిని వదులుకుని కూడా పని చేస్తున్న ఉత్తమంగా ప్రజల తరపున నిలబడుతున్న ఐ.ఏ.ఎస్ అధికారులకు ‘జనవిజయం’ తరపున అభినందనలు.
- పల్లా కొండల రావు.
అయ్యా ఎస్ అనకపోతే.. ఎల్వి సుబ్రమణ్య నికి ఏ గతి పట్టిందో అదే పడుతుంది . ఎంత రిచ్ తెలుగు వాడి కబుర్లు చెప్పుకున్నా , చివరకి మతి లేని రాజకీయ నాయకుల చేతుల్లోనే వీళ్ళ భవిష్యత్తు ఉండేది .
ReplyDeleteఅంతేగా... అంతేగా..
DeleteExcellent analysis article sir
ReplyDeleteధన్యవాదాలు జి.కె.కె గారు.
DeleteGood Analysis
ReplyDeleteధన్యవాదములు సర్.
DeleteGood article sir.
ReplyDeleteధన్యవాదములు సర్.
Deleteప్రభుత్వాధికారులను చూస్తే జాలివేస్తుంది. వారు ప్రజలు ఎన్నుకొన్న ప్రజాసేవకుల ఆదేశాలను అమలు జరుపటానికీ, ఆ ప్రజాసేవకులకు తగిన సూచనలూ సమాచారమూ అందించటానికీ మాత్రం పరిమితమైన పాత్రలో జీవించే (అ)భాగ్యజీవులు. నిజంగా వారికి ఏమి స్వతంత్రత ఉన్నదనీ?
ReplyDeleteఈరోజున వారు న్యాయమూర్తుల వలన చీవాట్లు తినవలసి వచ్చిందంటే దానికి వారి చేతకానితనమే కారణంగా పైకి కనబడుతుంది. కాని వాస్తవానికి వారు కలంతెరచి ఏమి వ్రాయాలన్నా, నోరువిప్పి ఏమి మాట్లాడాలన్నా అది ప్రభుత్వవిధానాలకూ, అంతకంటే ముఖ్యంగా దొరతనం చెలాయిస్తున్న నాయకుల ఆదేశాలకూ అనుగుణం ఉండితీరవలసిన పరిస్థితి అని దయచేసి అందరూ అర్ధం చేసుకోవాలి.
అందుచేత నిజానికి న్యాయమూర్తులు వేసిన చీవాట్లు అధికారుల ద్వారా ప్రభుత్వానికి అందించినట్లుగా భావించాలి.
నిజమే, ప్రబుత్వాదికారుల్లోనూ అవినీతి అసమర్ధతా బాగానే కనబడుతుంది. దానిక్కారణం కూడా అవినీతిని పోషించి నీతినిపాతేసే దొరతనాలే - వాళ్ళకు జై కొట్టని వాళ్ళమీద విరుచుకు పడే అగ్నికీలలే అని కూడ మనం మరచిపోరాదు.
అందుచేత చర్చనీయాంశం నిజానికి ప్రభుత్వాలూ వాటిని నడుపుతున్న నాయకత్వాలూ కోర్టుల్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయీ అన్న్దది మాత్రమే నండి.
మీరన్నదీ కరెక్టే. కానీ ఇక్కడ చర్చ ఐ.ఎ.ఎస్ లలో రకాల గురించి. అవినీతిని పైనుండి నరకాలన్నా ఐ.ఎ.ఎస్ లేదా బ్యూరోక్రాట్ల పాత్ర కూడా కీలకమే అవుతుంది కదా? కాదంటారా?
Delete
ReplyDelete--ఎలాంటి అడ్డగాడిదైనా ఏ మంత్రి స్థానం అయినా పొందవచ్చు
-- గాడిద పాలుకి మంచి ధర పలుకుతుందని మా కష్టేఫలి తాతగారన్నారండీ !
--కానీ ఎంతో కష్టపడి చదివితే తప్ప ఐ.ఏ.ఎస్ లు కాలేరు
చదువెందుకు ?..... పాత సామెత :)
పాత రోజులలో కడివెడైననేమి..... అని అన్నారు కదా...
Deleteఅప్పుడు చదువు... సంస్కారం.... అది వేరే కదా....
కాదంటారా?