తెలుగు బ్లాగర్లను ప్రోత్సహించాలని ప్రజ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇంతక్రితం నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగును సమీక్షిస్తూ బ్లాగరు సతీష్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. తెలుగు బ్లాగర్లకు సుపరిచితులు అయిన కష్టేఫలే శర్మగారి అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు ఈ రెండవ ప్రయత్నం. తెలుగు బ్లాగర్లలో కష్టేఫలే బ్లాగు తెలీనివారుండరనడంలో అతిశయోక్తి లేదు. గతంలో పల్లె ప్రపంచం బ్లాగు కోసం శర్మగారిచ్చిన ఇంటర్వ్యూను రీ పబ్లిష్ చేస్తున్నాను.
పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న శర్మగారు అభినందనీయులు. పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా మాయమైపోతున్న అనేక మంచి సాంప్రదాయాలను, మంచి విషయాలను ఆయన తన బ్లాగులో టపాలుగా మనకి అందించారు.
రెగ్యులర్‌గా కష్టేఫలే బ్లాగు చదివే వారికి ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా బ్లాగుప్రపంచంలోకి వస్తున్నవారికి ఆ కబుర్లు ఎప్పటికీ పాఠాలుగా ఉపయోగపడతాయి అనడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. జీవితానుభవంలో తాను నేర్చుకున్న, ఆచరించిన అనేక విషయాలు నేటి తరం వారికి అందిస్తూ శర్మగారు చాలా మంచి పని చేస్తున్నారు. ఆయన నుండి మరిన్ని మంచి పోస్టులు వస్తాయని ఆశిస్తున్నాను.
బ్లాగుని సమాజానికి ఉపయోగపడేలా ఎలా ఉపయోగించవచ్చో ఆయన బ్లాగు మనందరికీ పాఠం చెపుతుందని అనిపిస్తుంది. మంచిని పెంచడానికి మంచిని పంచడమూ ఉపయోగపడుతుందని శర్మగారి బ్లాగు నేర్పుతుంది. ఓ చిన్న మాట లేదా విషయం కూడా ఒక్కోసారి అది తెలియని వారికి చాలా పెద్ద మేలు చేస్తుంది. మనసులోనే మంచిని దాచుకోకుండా దానిని పదిమందికీ పంచడానికి బ్లాగులూ వేదికగా ఉపయోగపడతాయని శర్మగారు నిరూపించారు. మెయిల్ ద్వారా నేనడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చిన శర్మగారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఓ రకంగా నేను శర్మగారిని ఇంటర్వ్యూ చేశానన్నారాయన. కానీ శర్మగారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఈ విషయాలు చాలవేమో. ఆయన చెప్పిన వివరాలు చదివి మీ అభిప్రాయాలు చెపుతారని ఆశిస్తున్నాను.
నేనడిగిన ప్రశ్నలకు శర్మగారి అభిప్రాయాలు ఇవి :
- మీ వివరాలు తెలుపగలరా?
- పేరు :- చిర్రావూరి భాస్కర శర్మ అనే మాచనవఝుల వేంకట దీక్షితులు.
పుట్టిన ఊరు :- గూటాల - పశ్చిమ గోదావరి జిల్లా.
పుట్టిన తేది :- 04.11.1941
చదువు :- ఎస్.ఎస్.ఎల్.సి.
ఉద్యోగం :- రిటయిర్డ్ టెలికం ఇంజనీర్.( సబ్ డివిజనల్ ఆఫీసర్).
( టెలిఫోన్ ఆపరేటర్ గా జీవితం ప్రారంభం,అంచెలంచెలుగా, ఉద్యోగంలో చదువుతో, పోటీ పరీక్షలలో విజయాలతో ప్రమోషన్లు )
ఇతర వివరాలు :-
కావలసినవారు పెంచుకోడంతో ( పెంచిన తల్లి అన్నపూర్ణ) పేరు మాచనవఝుల వేంకట దీక్షితులుగా మారింది.
దత్తత వచ్చిన ఊరు దుళ్ళ. తూర్పు గోదావరి జిల్లా.
నాకిద్దరు తల్లులు, రెండు జిల్లాలు. నా జీవిత కార్యస్థలాలు.
శేషారత్నం భార్య. 52 సంవత్సరాల వైవాహిక జీవితం. కష్టాలే ఇష్టాలుగా చేసుకు బతికేం, ఒకే మాటగా. ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు మా సంతానం. అందరూ జీవితంలో స్థిరపడ్డారు.
ప్రస్తుత నివాసం :- అనపర్తి.
- URL : https://kastephale.wordpress. com. Total Posts : 743.
- మీ బ్లాగు లక్ష్యం ?
- సర్వే జనాః సుఖినో భవంతు.
- మీకు బ్లాగు రాయాలనే ఆలోచనెలా కలిగింది?
- టెలికం ఇంజనీర్ నైనా కంప్యూటర్ గురించి తెలీదు. రిటయిర్ అయ్యేనాటికి, ఎ,బి,సి,డి లు కూడా తెలియని ఒకతను గురువుగా కంప్యూటర్ నేర్చుకున్నా,స్వయంగా, ఎప్పుడూ? అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో. అదో పెద్ద కథ.
శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారు సీనియర్ బ్లాగర్, పూనా వాసులు, తూ.గో.జి వారు. 2011 లో ఒక టపాలో చిన్నప్పుడు తాము ఉన్న చోటుగురించి రాశారు, నాకు తెలిసిన, వారి గురువులను తలుచుకున్నారు. ఆ టపాకి కామెంట్ రాశాను. అలా వారితో పరిచయం పెరిగి, వారు బ్లాగు రాయమంటే, ఒక సంఘటన రాసి, ’రాసినది బాగుందా? నేను రాయగలనా చెప్పండి? మీరు బాగుందంటే బ్లాగు మొదలుపెడతా’నన్నా. వారేమో దాని మీద ఏ అభిప్రాయమూ చెప్పలేదు.
ఈ లోగా నాకు ఆతృత ( అదేలెండి దురద) పెరిగి బ్లాగ్ మొదలుపెట్టేశాను. నేనొక్కరోజు బ్లాగ్ మొదలుపెట్టడం ఆలస్యం చేసి ఉంటే వారే దానిని ప్రచురించి ఉండేవారు, వారి బ్లాగులో, నేను బ్లాగు మొదలు పెట్టేవాణ్ణి కాదు... ఇలా రాసిపెట్టి ఉంటే అలా ఎందుకు జరుగుతుందీ? చిత్రం అలా రాసిన మొదటి టపా మాత్రం నేటికీ టపాగా రాలేదు, నా బ్లాగులో.
- సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?
- నేను బ్లాగు మొదలు పెట్టి మూడేళ్ళే. నాకంటే చాలా మంది సీనియర్లున్నారు. తక్కువ కాలం లో ఎక్కువ టపాలు రాశాననుకుంటా, అదీ తేడా. బ్లాగు రాయడంలో, మొదలుపెట్టడమే ఆలస్యం తప్పించి, రాయడం లో ఎక్కడా ఇబ్బంది కలగలేదు.రకరకాల అనుభూతులు మాత్రం కలిగాయి, డభ్భై సంవత్సరాల వయసులో మొదలెట్టినదేమో, రేపులేదన్నట్టే రాశాను. కరంటు పోవడం, నెట్ ఇబ్బందులు, బ్లాగు గురించి టెక్నికల్ గా తెలియకపోవడం, ఇబ్బందులు కలిగించాయి. ఇప్పుడు హై-ఫై మూడు కంప్యూటర్లు, కరంట్ పోయినా బాధ లేని సోలార్ సిస్టం, కాని రాసేందుకే మనసు లేదు.
అనుభవాలు-జ్ఞాపకాలు ఎన్నెన్నో. కొన్ని చెబితే కొన్ని మరచిపోతామేమోనని భయం. అనుభవాలకొస్తే రాయడం మొదలుపెట్టిన కొద్దిరోజులలోనే దీపావళి టపాను మెచ్చుకుని వారి ఆగ్రిగేటర్ లో చాలా కాలం ప్రదర్శించారు, బ్లాగిల్లు శ్రీనివాస్ గారు. హారం లో సైడ్ బార్ లో ఎక్కువగా చదివిన టపాలు/దీన్నో లుక్కెయ్యండిలో నా టపా తప్పని సరిగా ఉండేది.
నా బ్లాగును మొదటగా పరిచయం చేసినవారు డాక్టర్ మధురగారు, ఆ తరవాత మా ఇంటికి సతీ సమేతంగా విచ్చేసి, దానిని బ్లాగులో నా ఫోటో తో పెట్టినవారు, బ్లాగ్ గురువులు ఫణిబాబుగారు. ఆ తరవాత పుట్టింటి కొచ్చినంత ఆనందంగా ఉందని, నన్ను, బ్లాగును పరిచయం చేసినవారు వనజ వనమాలి గారు. ఆ తరవాత నా ఇంటర్వ్యూ ను తమ ఆగ్రిగేటర్ లో పెట్టినవారు లాస్య రామకృష్ణ గారు. ఆ తరవాత ఒక సందర్భం లో లక్కాకులవారొక టపా రాసేశారు, నా గురించి. ఇక తల్లి జిలేబి గారి గురించి చెప్పడమే కష్టం, ఏ చిన్న విషయానికైనా తమ బ్లాగులో నా పేరు చెప్పెయ్యడం ఒక అలవాటుగా మారిపోయివుంది, వారికి. మానేద్దామనుకున్న ప్రతిసారి అడ్డుపడినవారు జిలేబిగారు, నవ్వుల రేడు బులుసు సుబ్రహ్మణ్యంగారు.
ఎంతో మంది తాతా అన్నవారు, బాబాయ్ అన్నవారు, నన్ను అభిమానించి తమ కుటుంబ సభ్యునిగా చేసుకున్నవారెందరో! పొరపాటుగా గారు అని సంబోధిస్తే కోపగించుకుని నన్ను మరిచిపోయావా తాతా? అని నిష్టురం ఆడినవారూ ఉన్నారు. చిన్నప్పుడు ’ఆయ్! అమ్మనాదీ’ అని దెబ్బలాడు కున్నట్టుగా కొంతమంది వద్దంటున్నా వినకుండా మనసులో చేరిపోయారు :) నా కుటుంబ సభ్యులే అయినవారు కొందరు. పేర్లు చెప్పడం మొదలెడితే కొన్ని మరచిపోతానని భయం. ఒకరయితే అత్తాయ్, తాతాయ్ కామెంట్లేగా, అని సరదాగా ఎకసెక్కెంకూడా చేసేరు, కామెంట్ల గురించి. ఇక స్నేహితులు చెప్పే పనే లేదు. కొద్దిరోజులు టపా రాయకపోతే ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు కనుక్కునవారెందరో! ఘనా నుంచి ఒకరు, అమెరికా నుంచి మరికొందరు, గుర్తులేదుగాని చాలా మంది ఫోన్ చెసేవారు, ఆ తరవాత కవినని (కవి= కనబడదు, వినపడదు) తెలిసి, మాట మానేసి మైల్ ఇవ్వడం తో సరిపెట్టేరు.
ఒక మనవారాలు తాను సాయంత్రం టపా చదువుకోడానికి వీలుగా ఇక్కడ ఉదయమే టపా వేయమని కోరితే అలాగే ఉదయమే ఐదున్నరకి టపా వేసే అలవాటు చేసుకున్నా. ఇప్పటికి అది కొన సాగుతూనే ఉంది. కామెంట్లలో ఒక మాట పట్టుకుని మరునాటికి టపా రాసిన రోజులున్నాయి. కొంతమంది అడిగితే రాసిన టపాలూ ఉన్నాయి. వెంకట్.బి.రావు గారయితే హిందూ పేపరు లాగా, నిన్నటి టపా చదవకుండానే మరో టపా వస్తూంటే కామెంటే టైమేదీ? అన్నారు. ఫాతిమాజీ బ్లాగ్ గాంధీ అని పేరెట్టేరు.
- మీ బ్లాగులో మీకు నచ్చిన పోస్ట్/పోస్ట్ లు ?
- కాకిపిల్ల కాకికి ముద్దు, నా టపాలన్నీ నాకు నచ్చినవే!
- కొత్త బ్లాగర్లకు మీరిచ్చె సలహాలు-సూచనలు?
- సలహాలు, సూచనలు చేయగలవాడను కాదేమోనని అనిపిస్తుంది, డీగ్రీ లు లేనివాడిని,పల్లెటూరులో పుట్టి, పల్లెలలో పెరిగి, పల్లెలలో ఉద్యోగం చేసి, పల్లెలో బతుకుతున్న మట్టి మనిషిని, మనసున్నవాడిని, భేషజం తెలియనివాడిని... తెనుగు తప్ప మరో భాష రానివాడిని. అయినా అడిగారు కనక, "చదవండి, చదవండి, చదవండి. రచయిత ఏమీ చెప్పేడో పరిశీలించండి, ఎలా చెప్పేడో పరిశీలించండి. అవే అక్షరాలు, అవే మాటలు, అవే వాక్యాలు, కాని కొంతమంది చెబితే అయ్యో! అప్పుడే అయిపోయిందా! మరి కొంచం ఉంటే బాగుణ్ణు, అనిపిస్తుంది. మరికొందరు చెబితే........మీ నాన్నగారున్నారా? అన్నదీ, నీ అమ్మ మొగుడున్నాడా? అన్నదీ ఒకటే కాని మొదటిదే వాడతాం.....చెప్పే సులువు కనుక్కోండి, అది మీదయినదై ఉండాలి, మరొకరిని అనుకరించద్దు, చెప్పేదెప్పుడూ మీరు రాసినది ఉండాలి. మరొకరిదయితే ఫలానా వారిదనీ చెప్పాలి., అలా చెప్పడం వారికి మనకి కూడా గౌరవం. అనుకరించద్దు, అది ఎంత గొప్పదయినా సరే. అదీ విజయ రహస్యం. ఏదీ కష్టపడక మీ ఒడిలో వాలదు. కష్టే ఫలీ.
- బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు, ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
- పెద్దగా లేవనే చెప్పాలి. ఒకటి మాత్రం హారం శ్రీ భాస్కర రామిరెడ్డిగారు నన్ను అపార్ధం చేసుకున్నపుడు కలిగినది. ఆ తరవాత వారే జరిగినదానికి నా బాధ్యత తక్కువేననీ అనుకున్నారు. మొన్న మొన్న జరిగినది, ఒకరు నావైన టపాలు ఇరవై దాకా తమ బ్లాగులలో తమవిగా ప్రచురించుకున్నారు. నా దురదృష్టం కొద్దీ అవి నా కళ్ళ పడ్డాయి, వారు ఇటువంటి టపాలు కావాలని నన్ను అడిగి ఉంటే వారి పేరు మీద కొన్ని రాసి ఇచ్చి ఉండేవాడిని. ఇదేం పని అడిగితే ఆకుకు అందని పోకకుపొందని సమాధానాలిచ్చారు, వారి బ్లాగుల్లోనే,ఆ తరవాత అందరూ తిడితే నామీద బురద జల్లడానికీ తయారయ్యారు, ఆ ప్రయత్నమూ చేశారు,కక్ష సాధించాలనీ చూశారు. ఆ తరవాత నేను పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాననీ తమ ఫేస్ బుక్ లో రాసుకున్నారట, ఒక స్నేహితులు దాని కాపీ పంపేరు, అది ఇదే మీకోసం :
"Girija Kandimalla
October 1 at 8:41am · Hyderabad ·
శర్మ గారికి పిచ్చెక్కింది..... వయస్సు మీద పడితే చాదస్తం ఎక్కువవుతుంది అంటారు..... అదే నేను కూడా నమ్ముతాను..... అందుకే ముసలి వారిని మర్యాదగానే పలకరిస్తాను(వారు విసిగించినా)...... కానీ శర్మగారికి పిచెక్కింది..... తన బ్లాగ్ లో ఒక ఉన్మాదిలా పోస్టులు చేస్తూ తనని అనుసరించే వారిని తన ఊహలతో రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు..... సభ్యతా సంస్కారం తన రాతలలోనే కాని ప్రవర్తనలో ఆలోచనలో ఎక్కడా కనపడలేదు.... కాటికి కాళ్లుచాపుకున్న వయసులో కూడా ఏదో కారణం తెలియని కసితో ద్వేషం తో రగిలిపోతూ అందరిని అదే పిచ్చిలో భాగస్వాములను చేస్తూ కాలక్షేపం చేస్తున్న ఈ కురువృద్దుడిని ఏమని అనాలో అర్థం కావటం లేదు.......... దేవుడా ఈ చివరి రోజుల్లో అయిన శర్మగారి మనస్సులో మంచి మానవత్వం అనేవి మేల్కొల్పు తండ్రి.....
LikeLike · · Share
Deva Das likes this.
Anand Ram intaki evara sarma enti ayana kharma
October 1 at 6:28pm · Like · 1
Girija Kandimalla ఆయనొక మూర్ఖ శిఖామణి అన్నయ్య స్వామి..... కాలక్షేపం కబుర్లని పిచ్చిపిచ్చి మాటలతో జనులకు తప్పుడు విషయాలని చెప్పి రెచ్చగొడుతుంటారు........
October 1 at 6:33pm · Edited · Like"
ఇలా చేయడంతో, ఉత్సాహం పోయింది, రాసేందుకు నీరసం వస్తోంది, బ్లాగంటే చిరాకేసే పనయిపోయింది. నిజానికి సృజన చచ్చిపోయింది, ఆఘటనతో.ఎప్పటి కైనా మళ్ళీ సృజన చిగురించదా అనే ఆశతో బ్లాగులో ఉంటూ, ఏదో రాస్తూ వస్తున్నానంతే! ఈ సంఘటన నా పై కోలుకోలేని పెద్ద దెబ్బ తీసిందన్నదే నిజం.
- తెనుగు బ్లాగుల అభివృద్దికి మీరిచ్చే సూచనలు?
- తెనుగులో రాయండి. కొన్ని పరభాషాపదాలు మన తెనుగులో చొరబడ్డాయి, వాటిని కాదనలేం. రోడ్డు, స్టేషను లాటివి, చాలా చోట్ల బ్లాగుల్లో చూస్తున్నా, ఏక్టుయల్లీ, రియల్లీ అంటున్నారు, ఇలాగే మరికొన్ని పదాలూ, వాటికి సరయిన పదాలు మనకులేవా? నిజానికి అని వాడచ్చుగా? మరి ఇది ఎందుకు? ఈ అలవాటు మార్చుకోండి. భాష లో పొరపాట్లు ఎవరు చెప్పినా సరిదిద్దుకోండి, చెబుతున్నారని విసుక్కుంటే, కొంత కాలానికి మీరు భాషకి దూరమైపోతారు,చెప్పేవారూ ఉండరు, మనం పిచ్చివాళ్ళ స్వర్గం లో ఉంటాం, అంతే!, వాదించకండి,తప్పకపోతే వాదన ఎక్కడ ఆపాలో తెలుసుకుని ఆపేయండి, భిన్నాభిప్రాయం సహజమనుకోవాలి. ’మాకు తెలుసు, మాకేం చెప్పక్కరలేదు, భావం ముఖ్యం కాని భాష కాదంటారా? సుద్దులేం చెప్పక్కరలేదంటారా? మీ పని మీరు చూసుకోండంటారా?’ అస్తు, చెప్పడం తప్పు నాదే! చెంపలేసుకుంటున్నా! నాకు మారీచుని మాటే వేదం.
సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః.
భావం :- మెరమెచ్చు మాటలు చెప్పేవాళ్ళే దొరుకుతారు. నిజమైన దానిని చెప్పేవాడు దొరకడు. ఒక వేళ ఎవరైనా చెప్పినా వినేవాడు లేడయ్యా అన్నాడు.
- మీకు నచ్చేబ్లాగులు?
- అమ్మో! చాలా చిక్కు ప్రశ్న, అది రహస్యం. :) నేనందరి బ్లాగులూ చదువుతాను.
- బ్లాగులవల్ల ఉపయోగాలేమని మీరనుకుంటున్నారు?
- ముఖే ముఖే సరస్వతి.ఎవరెవరో, ఎంతవారో తెలియదు.అందరికి అన్నీ తెలిసి ఉండవు, తెలిసి ఉండాలనుకోడమూ పొరపాటు. ఎవరికి తెలిసినది వారు రాస్తే మిగిలినవారు దానిని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి నేను నా ఇంటికి సోలార్ పేనల్స్ వేయించుకున్నాను, అది బ్లాగులో రాశాను, చాలా మంది ఆసక్తితో గమనించారు, అనురాధ గారయితే తామూ వేయించుకున్నామని, నేను చెప్పినది చూచి, ఉపయోగకరంగా ఉందనీ బ్లాగులో పెట్టేరు. ఒకరికి ఉపయోగ పడినా ఆనందమే కదా!
- మీరు చెప్పదలచుకున్నదేమయినా.......?
- బ్లాగ్ లోకంలో ఇన్ని ఇంటర్వూ లు మరెవరూ ఇచ్చి ఉండరేమో! ఇది చాలా సుదీర్ఘ, సవివర ఇంటర్వూ. దీని టైప్ చేయడానికి నాకు మూడు రోజులు పట్టింది, అన్నీ గుర్తుచేసుకుంటూ. నా ఇంటర్వూ ప్రచురించాలనుకున్న శ్రీ పల్లా కొండలరావు గారికి ధన్యవాదాలు.
- Palla Kondala Rao
కష్టేఫలే "శర్మ"గారి ఇంటర్వూ బాగుంది సర్!
ReplyDeleteధన్యవాదములు చౌదరి గారు.
Deleteశర్మ గారితో మీ ముఖా ముఖి చాలా బాగుంది.ఎప్పటి నుండో వారి పోస్టులు చదువుతున్నాం కానీ ఆయనగురించి పూర్తిగా తెలిసికోవడం చాలా మంచిగా అనిపించింది.ఇంత మంచి పోస్టు అందించినందుకు పల్లె ప్రపంచం కొండలరావుగారికి ధన్యవాదాలు.
ReplyDeleteధన్యవాదములు లక్ష్మీ'స్ మయూఖ గారు.
Deleteఆలశ్యంగా చూశాను ఈ టపా. చాలా బాగుంది. పురాణ కాలంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు పురాణ కధలు చెప్పేరుట. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో శర్మ మహర్షి మంచి చెడు చెబుతున్నారు. శర్మ గారు మరెన్నో టపాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteఈ ఇంటర్వ్యూ చేసిన కొండలరావు గారిని అభినందిస్తున్నాను.
బులుసు సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదములు.
DeleteNice job. మీకూ, శర్మగారికి కూడా అభినందనలు. ఆయన్ని పట్టుకిన్ ఎవరో నానా మాటలూ అన్న సందర్భం చదివి బాధనిపించింది. సున్నిత మనస్కులు బ్లాగుల్లో మనలేరు.
ReplyDeleteనారాయణ స్వామి గారు ధన్యవాదములు. బ్లాగులలో, సోషల్ మీడియాలో ఇలా అసభ్యంగానూ, ఉన్మాదంగా ప్రవర్తించేవారినీ అందరం కలసి ఎదురించాలి. లేకుంటే వీరి ఆగడాలు మితిమీరిపోతాయి.
Delete
ReplyDeleteబ్లాగు గాంధీ అని వీరికా పేరు ఎందుకొచ్చిందండీ ??
జిలేబి
ఫాతిమాజీగారు పెట్టారు. నాకు నచ్చి హెడింగుకు మార్చానండి.
Delete