తెలుగుభాషావిశిష్ట కేంద్రం రాష్ట్రానికి కేటాయించి మూడేళ్లు గడచినా అంగుళం కూడా ముందుకు సాగలేదు.
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోవడంతో విశిష్ట కేంద్రం ఎక్కడ స్థాపించాలనేది మళ్లీ మొదటికి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాచీన భాషా హోదా పొందిన భాషల అభివృధ్ధికి ఏటా వంద కోట్ల రూపాయిలు వరకూ కేటాయించే వీలు కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని , మౌలిక వసతులను కల్పించకపోవడంతో వ్యవహారం కాస్తా అటకెక్కింది.
ఈ హోదాతో దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా విభాగాలను ప్రారంభించేందుకు, రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో , ఉన్నత విద్యాసంస్థల్లో తెలుగు భాషాభివృద్ధి- పరిశోధన పీఠాలను ప్రారంభించేందుకు వీలుంది.
2011 డిసెంబర్‌లో మైసూర్‌లోని సిఐఐఎల్‌లో తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు క్లాసికల్ లాంగ్వేజి సెంటర్‌ని తెలుగు భాషా వ్యవహారిక కేంద్రమైన తెలుగురాష్ట్రంలోనే స్థాపించడం సమంజసంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులను వెళ్ళాక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు అప్పటి ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
ఈ కేంద్రాన్ని దేనికో అనుబంధంగా కాకుండా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలనీ తదనుగుణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ప్రయత్నాలు ప్రారంభించటం కూడా జరిగింది.
తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చిన మూడేళ్లకు ఒడిశా భాషకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. ఒడిశా ప్రభుత్వం అపుడే రెండు అంతర్జాతీయ అవార్డులను కూడా ప్రవేశపెట్టి భాషాభివృద్ధికి, పరిశోధనలకు పీట వేసింది.
మన తెలుగు సంగతే ఎవరికీపట్టకఈసురోమని పడుంది.
ఇప్పుడు తెలుగువాళ్ళ రాష్ట్రం ఒకటి చిరిగి రెండురాష్ట్రాలయ్యింది. ఇప్పుడు ఈ విశిష్టకేంద్రం విషయం రంగం మీదకు వచ్చే అవకాశం అసలు ఉందా? ఉన్నా, అది కూడా ఉభయరాష్ట్రాల మధ్యా మరొక చిచ్చు రేపే అవకాశం లేదంటారా? ఇంట్లోకూడా ఇంగ్లీషే మాట్లాడుకునేంతగా అభివృధ్ధి చెందిన మనతెలుగుసంస్కృతికి ఈ విశిష్టం కేంద్రం ఒరిగించేది ఏమన్నా ఉందా? దీనినీ మనవారు ఒక రాజకీయకేంద్రం చేసేయరన్న భరోసా ఏమన్నా ఉందా? అన్నింటిలోనూ ఒకింత అసమంజసమైన స్పర్థలతో ఢీ అంటె ఢీ అంటున్న తెలుగురాష్రాలు పోటీపడి తెలుగుభాషను అభివృధ్ధి చేసేందుకు అవకాశం ఏమన్నా ఉందా? ఊకదంపుడు వ్యాసాలతో జనం బుర్రలు తినే మన మేథావులు తెలుగుభాషాభివృధ్ధి విషయంలో ఎందుకు కల్పించుకోరు?
-శ్యామలీయం.
*Republished
*Republished
ఏమీ లేదు. ఎదో ఒరుగుతుందని హోదా రాక ముందూ అనుకోలేదు.
ReplyDelete