భాషాభిమానం ! - వెర్రి వ్యామోహం !! - ఆచరణలో చేయాల్సిందేమిటి?

మనం తెలుగు భాషపై ప్రేమతో ఇతర భాషలను చులకనగా చూడడం, కొన్నిసార్లు కొందరు కించపరచడం చేస్తుంటారు. ప్రతీది తెలుగులో స్పష్టం గా మాట్లాడాలని ఆరాటపడుతుంటారు.

తెలుగు భాషపై అభిమానముండడంలో తప్పే లేదు. ఇతర భాషలను తూలనాడడమే తప్పు. 

మన తెలుగుకు మనవాళ్లెవరూ చేయని కృషి బ్రౌన్ చేశాడంటే, కన్నడిగుడైన రాయలు దేషభాషలందు తెలుగు లెస్స అన్నా, అది తెలుగులో ఉన్న గొప్పదనమే. దానిని మనం ప్రత్యేకించి వాదులాడి చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్.టీ.ఆర్ వచ్చేంతవరకూ తెలుగును పట్టించుకోని తెలుగు పాలకులనేమనాలి? తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని సంతసమిల్లి పోటీ పెట్టకుండా మద్దతిస్తే పీ.వీ తరువాత ఏమి చేశాడు. పోనీ 15 భాషలు నేర్చుకున్న పీ.వీ తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగువారికి చేసిందేమిటి?

కనుక, భాష గొప్పదనం భాషలోనే ఉంటుంది. ఎవడు కించపరిచినా అది తగ్గేదీ, తరిగేది కాదు. ఎప్పటికప్పుడు మెరుస్తూనే ఉంటుంది. మెరుగవుతూనే ఉంటుంది.

వాడుక భాషలో కొన్ని కొత్త పదాలు కలగా పులగంగా పుట్టుకొస్తాయి. కొత్త కొత్త వస్తువులను కనుక్కున్నప్పుడు వాటిని తెలుగులో కంటే వేరే భాషలోనే పలకడం, చెప్పడం తేలిక. అలా చెపితేనే భావం అర్ధమవుతుంది మరి. అలాంటి సందర్భాలలోనూ "ఏను తెలుగు వల్లభుండా" అనుకుంటూ స్వచ్చమైన తెలుగు వాడడం లేదని  అజ్ఞానులను తిట్టిపోయద్దండీ.

తెలుగు భాష గొప్పదనాన్ని, స్వచ్చతనూ, సరళతనూ , ఔన్నత్యాన్ని కాపాడుకుంటూనే సామాన్య ప్రజానీకం వాడే వాడుక భాషనూ, వారి భాషాపటిమ స్థాయిని గమనంలో ఉంచుకోవాలి.


ఉదాహరణకు సిగ్నల్ (రైల్వే కు పాతకాలం లో ఉన్నది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉన్నది) అనాలనుకోండి. "ధూమ శకట గమనాగమన నిదర్శక తామ్ర పట్టిక " అనాల్నా? సిగ్నల్ అంటే సరిపోతుందా? ఆలోచించండి.


ధూమ శకటమంటే పొగబండి అదేనండి బొగ్గింజనుతో నడిచే రైలు. గమనాగమన అంటే రాక పోకలను తెలిపే, తామ్ర పట్టిక అంటే తామ్రముతో చేసిన ప్లేటు అని అర్ధం . 

ఇదంతా అనే బదులు సిగ్నల్ అంటే ఈజీగా అర్ధమవుతున్నప్పుడు అదే వాడుక భాషలో వాడితే తప్పు కాదు. అక్కడ భావం అవసరం మేరకు కమ్యూనికేట్ అవుతుందా ? లేదా ? అనేదే పాయింట్.

భాష అనేది మానవ పరిణాం క్రమంలో వచ్చింది. మనిషి అవసరాలరీత్యా సైగలు అనుభవంతో స్వరపేటిక అభివృద్ధి అయి భాష ఏర్పడింది. తరువాత లిపి వచ్చింది. ఇది ప్రాంతాలను బట్టి సమూహాలను బట్టి వివిధ రకాలుగా విరాజిల్లుతూ వచ్చింది. విరాజిల్లుతూనే ఉంది.

తరువాత కాలం లో రాజ్యాలు - వలసలు - ఆక్రమణలు ఏర్పడి దోపిడీదారుల భాషే ప్రపంచ భాషగా ఏర్పాటయింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం వల్ల ఆంగ్ల భాష రాజ భాషగా , అలా...అలా ప్రపంచ భాష అయింది తప్ప దానికేమీ ప్రత్యేకతలు లేవు. ఆ మాటకొస్తే మన తెలుగులా అందులో తీయదనమే లేదు. మన ఉభయగోదావరులంత విస్తీర్ణం లేని ఇంగ్లాండు వారి భాష ప్రపంచ భాష కావడానికి కారణం సామ్రాజ్యవాద దోపిడీయే.

అన్ని అక్షరాలను స్పష్టంగా పలకగలిగే + వ్రాయగలిగే మన భాష నిజం గా గొప్పదే. అందుకే " దేశ భాషలందు తెలుగులెస్స" అన్నా, " ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్"గా పేరొందినా మన భాషలో వ్రాసిన గ్రాంధికాలూ , వాటిల్లో ఉన్న ఔన్నత్యాలూ నేటికీ సామాన్యులకు అందకపోవడం విచారకరం.

అయితే మన భాష గొప్పదే. కానీ ఆ గొప్పదనం కోసం నేటి సమాజ పరిస్తితులలో మడిగట్టుకు కూచుంటే కుదరదు. శాస్త్రీయం గా ఆలోచించినా ఇది సరికాదు.

తెలుగు భాషమీద ప్రేమ అంటే ఇతరభాషలను ద్వేషించడం కాదు. తెలుగును తక్కువ చేసి ఆదిపత్య పైత్యం కోసం మమ్మీ డాడీ విష సంస్కృతిని తలకెక్కించుకోవడమూ కాదు.

తరతరాలుగా తెలుగు వారు జాతికందించిన అద్భుత సంస్కృతినీ అందులో ఉన్న గొప్పదనాన్ని భావి తరాలకు అందిస్తూ పతనమవుతున్న విలువలను కాపాడడమే. చాలా చాలా మంచి విషయాలు చెప్పిన మన తాత్వికులను , ఉదాహరణకు అన్నమయ్య , వేమన ల తత్వగతులు అద్భుతమైన మానవతా విలువలున్న భాండాగారాలు.

వాటిని మంచి ఉదాహరణలతో సరళం గా అందరికీ పంచుదాం. ఇప్పటికే తెలుగు అభివృద్ధికి అంతర్జాలం లో చాలామంది మితృలు మంచి కృషి చేస్తున్నారు. వారికి అండగా నిలుద్దాం ! ఈ కృషి చేసే మరింత మందిని తయారు చేద్దాం !!
 
- పల్లా కొండలరావు
18‌-07-2012.
*Republished post

Post a Comment

  1. సైన్సులో మాకు హైస్కూల్‌లో ఎనిమిది, తొమ్మిది తరగతులలో జఠర నిర్గమ సంవరణి కవాటం అన్న్ అపదం ఉండేది. అర్ధమేమిటంటే పేగులలోని ఆమ్లం వనక్కి వెళ్ళకుండా ఆపే కవాటం అని. అప్పట్లో మా సైన్స్ టీచర్ దానిని పైలోరిక్ కవాటం అనే నేర్చుకొమ్మని మాకు చెప్పారు.

    ReplyDelete
  2. "సో, భాష గొప్పదనం భాషలోనే ఉంటుంది" ఈ సో ఏమి సోదరా??

    ReplyDelete
  3. ఆంగ్లంలో సిగ్నల్ అన్నాడు కాని, ట్రైన్ సిగ్నల్ అని కాని స్టీం ఇంజన్ సిగ్నలని కాని అనలేదుకదా. అటువంటప్పుడు పైత్యం కాకపోతే, సిగ్నల్ అన్న ఆంగ్ల పదానికి తెలుగులో అంత సాగతీసి ధూమశకట గమనాగమన నిదర్శన తామ్ర పట్టిక అనిచెప్పటం ఎంతవరకూ సబబు. చాలా సులభంగా, సిగ్నల్ ని "సూచి" అంటే సరిపోదా! కొత్త పదాలను తయారు చేస్తున్నామనుకుంటూ, డ్రాయింగ్ రూముల్లో కూచుని తాము మాత్రమే పండితులం అనుకునేవాళ్ళు "మాటలు" వండితే ఇలాగే ఉంటాయి. సామాన్యుల నోళ్ళల్లో అద్భుతమైన తెలుగు పదాలు పుట్టుకు వస్తాయి. అవ్వే భాషను నిలబెట్టేవి కాని, అనువాదకుల వల్ల కాదు. తెలుగులో కొత్త మాట రావటం అంటే మరొక భాష నుండి అనువాదం అన్న వెర్రి నుండి బయటపడాలి. అప్పుడే పండితులమనుకునే వాళ్ళు కూడా కొత్త మాటలను సామాన్యులతో సమంగా ఆలోచించగలుగుతారు అని నా అభిప్రాయం.

    ReplyDelete

  4. << చాలా సులభంగా, సిగ్నల్ ని "సూచి" అంటే సరిపోదా! కొత్త పదాలను తయారు చేస్తున్నామనుకుంటూ, డ్రాయింగ్ రూముల్లో కూచుని తాము మాత్రమే పండితులం అనుకునేవాళ్ళు "మాటలు" వండితే ఇలాగే ఉంటాయి. సామాన్యుల నోళ్ళల్లో అద్భుతమైన తెలుగు పదాలు పుట్టుకు వస్తాయి. అవ్వే భాషను నిలబెట్టేవి కాని, అనువాదకుల వల్ల కాదు. తెలుగులో కొత్త మాట రావటం అంటే మరొక భాష నుండి అనువాదం అన్న వెర్రి నుండి బయటపడాలి. అప్పుడే పండితులమనుకునే వాళ్ళు కూడా కొత్త మాటలను సామాన్యులతో సమంగా ఆలోచించగలుగుతారు అని నా అభిప్రాయం.>>

    మీ అభిప్రాయం బాగుంది ప్రసాద్ గారు. కామెంట్ కు ధన్యవాదములు.

    ReplyDelete
  5. @Anonymous
    సో ను సరిచేసాను అజ్ఞాత గారు.

    ReplyDelete
  6. ఈనాడువాళ్ళు ఎ.టి.ఎం.ని నిత్య ధన కేంద్రం అని వ్రాస్తున్నారు. ఎ.టి.ఎం. అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్. వాళ్ళు దాన్ని ఎనీ టైం మనీ అనుకుని నిత్య ధన కేంద్రం అని అనువదించారు. దాన్ని స్వయంచాలక చెప్పరి యంత్రం అన్నా వాళ్ళ పైత్యం బయటపడేది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top