చాలా రోజులతరువాత ఓ మంచి పాటని మీకు గుర్తు చేద్దామని మొదలుపెట్టాను. అదీకూడా మహనటి సావిత్రి అభినయానికి పరాకాష్ట ఐన పాట. ఈ పాట విన్న, చూసిన వారి కనుల వెంట నీరు రానివారు ఉండేవారు కాదట ఆరోజుల్లో. మా అమ్మ గారు చెప్పేవారు. నాకు కాస్త ఊహ తెలిసిన తరువాత చూశా ఈ చిత్రాన్ని. ఆమె నటనకు పోటీ ఎప్పటికీ ఎవరూ లేరు,రారు అని నాకనిపించింది,,ఈ పాట చూస్తే మీకూ తప్పకుండా అలానే అనిపిస్తుందని ఆశిస్తూ........
మనిషికి బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్యం ప్రధానమైనది అనే ఇతివృతంతో రూపొందిన చిత్రం నాదీ ఆడజన్మే. నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్ మరియు జమున నటించిన ఈ సినిమా 1964 లో విడుదల అయ్యింది.
ఇక పాట విషయానికి వస్తే ఈ చిత్రంలో సావిత్రి ఒక చదువు లేని, నల్లని చాయతో ఉంటుంది. అందునా దిగువ మద్యతరగతికి చెందిన అన్నయ్యకు (అల్లు రామలింగయ్య) చెల్లిగా ఉంటుంది. చెల్లిని ఉన్నత కుటుంబంలోకి పంపుతున్నానే గానీ వారు ఆమెను ఎలా అంగీకరించి, ఆదరిస్తారని ఆలోచించడు. అదే విషయాన్ని ఈ గీతం యొక్క సాహిత్యంలో పొందుపరిచారు కవి. అలాంటి స్థితిలో ఉన్న ఓ మహిళ పడే మనోవేదనను అత్యంత హృద్యంగా దర్శకులు చిత్రీకరించారు. సావిత్రి అభినయం గురించి చెప్పటానికి ఏమీ లేదు. చూసేవారి హృదయాన్ని పిండేస్తుంది. అంత చక్కటి పాట. మొత్తం చిత్రమంతా నటులు, ముఖ్యంగా మామా కోడలుగా ఎస్.వి.ఆర్, సావిత్రి లు పోటీ పడి నటించారు.
ఇక వీక్షించండి :
ఇక వీక్షించండి :
చిత్రం: నాదీ ఆడజన్మే
సంగీతం: టి. వి.రాజు
గీత రచయిత: దాశరధి కృష్ణమాచార్య
గానం: P.సుశీల
గానం: P.సుశీల
పల్లవి::
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండవు నా
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా..ఆఆ
చరణం:1
గుణమెంచ లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
గుణమెంచ లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరి జూచుకుని నన్ను మరిచావయా
సిరి జూచుకుని నన్ను మరిచావయా
మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
చరణం:2
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
- మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి
*** *** ***
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
*** *** ***
*Republished
Thank you Rajyalakshmi garu.
ReplyDelete