కొన్నేళ్ళ క్రితం నేను ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నాను. ఒక ముసలాయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తరువాత అతని కొడుకులు రాకపోవడంతో వీధిలో ఉన్నవాళ్ళు చందాలు వేసుకుని శవాన్ని దహనం చేశారు. దహనం పూర్తైన తరువాత తెలిసింది, అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారని. వాళ్ళలో ఒకరు వైద్యుడు. ఆ వైద్యుని దగ్గరకి వెళ్ళి అడగ్గా అతను ఒక విషయం చెప్పాడు. అతని తండ్రి చిన్నప్పుడు వాళ్ళనీ, వాళ్ళ అమ్మనీ కొట్టేవాడు. వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళు నాన్న దగ్గర ఉండి చదువుకున్నారు కానీ పెద్దైన తరువాత అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అతని కోపం వల్ల అతనికి భార్య దూరమైంది, పిల్లలు కూడా దూరమయ్యారు. ఆ కొడుకులు తమ తండ్రిని వదిలేసి ఉద్యోగాలు చూసుకుని వెళ్ళిపోవడం న్యాయమే. ఎందుకంటే వీళ్ళు తమ తండ్రి దగ్గరే ఉండి, కుటుంబ సభ్యుల్ని కొట్టడం తప్పు కాదనే భావం ఏర్పరుచుకుని, రెపు తమ పిల్లల్ని కూడా కొట్టి పెంచితే, ఈ అనారోగ్యకర వాతావరణాన్ని కొనసాగించినట్టు అవుతుంది.
కొన్ని కుటుంబాలలో ఇంకో రకం పరిస్థితి ఉంటుంది. ఇద్దరు పిల్లల్లో మార్కులు ఎక్కువ వచ్చేవాణ్ణి లేదా మాట వినేవాణ్ణి బాగా చూసుకుంటారు మార్కులు తక్కువ వచ్చేవాణ్ణి లేదా మాట విననివాణ్ణి కొట్టి పెంచుతారు. ఇద్దరు పిల్లల్ని పెంచడం కష్టమైతే ఒక బిడ్డతోనే కుటుంబ నియంత్రణ చెయ్యించుకోవాలి కానీ పిల్లని ఈ పద్దతిలో పెంచడం ప్రమాదకరమే. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కానీ దాని వల్ల సమాజంపై ఉన్న అభిప్రాయాలు ఏమీ మారవు. దాని కోసం కన్న కొడుకుని కొట్టి పెంచితే తండ్రి-కొడుకుల సంబంధం కూడా డబ్బు సంబంధమే అని పిల్లలు అనుకునే అవకాశమే ఎక్కువ. ఒకే కంపెనీలో ఇద్దరు marketing managers తెచ్చే ఆదాయం సమానంగా ఉండదు. అలాగని కంపెనీ యజమాని ఒక marketing managerని కొట్టడు. కొడితే అతను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు, బయటివాళ్ళని కొడితే పరువు తక్కువగా ఉంటుంది అనుకుని ఆ కంపెనీ యజమాని తన పరిమితుల్లో తాను ఉంటాడు. సంఘంలో గౌరవం పేరుతో బయటివాళ్ళ దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తే సరిపోదు, ఇంటిలోనివాళ్ళ దగ్గర కూడా మంచిగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. బయటి వ్యక్తిని కొడితే అతను ఊరుకోడు. ఇంటిలోవాళ్ళని కొడితే బయటకి చెప్పుకోలేక పడుంటారు. అందుకే కొంత మంది బయటవాళ్ళ దగ్గర మంచిగా ఉంటూ ఇంటిలోవాళ్ళ మీద విరుచుకుపడతారు.
Home corporal punishments ఇవ్వడం తప్పని ఇందియాలో ఎవరూ అనుకోవడం లేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను కొడుతున్నాడని మా మామయ్యకి చెపితే అతను పట్టించుకునేవాడు కాదు. మా నాన్నకి చెప్పే ధైర్యం అతనికి లేకపోతే తాను ఆ విషయం నాకు నేరుగా చెప్పాలి కానీ అది కూడా అతను చెయ్యలేదు. పైగా అతను నాదే తప్పన్నట్టు మాట్లాడాడు, ఇంటిలో విషయాలు బయటకి చెప్పకూడదంటూ నాకు బోధించాడు. మా ఇంటి విషయంలో జోక్యం చేసుకునే ధైర్యం తనకి లేదని అతను నేరుగా చెప్పుంటే నేనే నా దారి చూసుకునేవాణ్ణి. పరువు మర్యాదల ముసుగు వేసుకుని బాధని భరించాలని అతను నాకు సలహా ఇవ్వక్కరలేదు. కొట్టినవానిది కాకుండా దెబ్బలు కాసినవానిది తప్పనడం నాకు చాలా బాధ కలిగించింది. దారి తప్పిపోయిన ఒక వ్యక్తి రైల్వే స్తేషన్‌కి దారి అడిగితే అతనికి ఇటు వెళ్ళు, అటు వెళ్ళు అని సూచనలు ఇస్తాం కానీ మనకి తెలిసిన వ్యక్తే తన కుటుంబ సమస్యల గురించి చెపితే అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పకుండా వీడు సుత్తి కొడుతున్నాడు అనుకుంటాం. ఆ విషయంలో అతనికి ఏమి చెప్పాలో మనకి తెలియకపోతే తెలియదని నేరుగానే చెప్పాలి కానీ నీ కుటుంబ గొడవలు నాకెందుకు అంటూ విసుక్కోకూడదు. మనకి ఏమీ తెలియదనిపిస్తే అతను తన దారిన వెళ్ళిపోతాడు కానీ మనం విసుక్కుంటే అతనికి మన మీద కూడా చెడు అభిప్రాయం కలుగుతుంది.
కొన్ని కుటుంబాలలో బయటివాళ్ళ చెప్పుడు మాటలు విని పిల్లల్ని కొట్టడం జరుగుతుంది. తమ పిల్లలు చదవడం లేదనో, మాట వినడం లేదనో ఉన్న కోపాన్ని మనసులో దాచుకున్న తల్లితండ్రులు తమ పిల్లలపై ఎవరి నుంచో ఫిర్యాదులు వచ్చినప్పుడు కారణం దొరికిందనుకుని తమ పాత కోపాన్ని నిద్రలేపుకుంటారు. "నువ్వు ఇలా చెయ్యకపోతే వాళ్ళు ఎందుకు అలా చెపుతారు" అంటూ తమ పిల్లల్ని కొడతారు. పిల్లలు పక్కింటివాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య ఏవో గొడవలు జరుగుతాయి. ఆ సమయంలో అవతలివాళ్ళ తల్లితండ్రులు మన పిల్లలపై మనకే తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో అవతలివాళ్ళ మాటలని నమ్మి మన పిల్లల్ని మనమే కొడితే మనం చెప్పుడు మాటలు విని చెడిపోయే రకం అని పిల్లలకి అర్థమైపోతుంది. బయటివాళ్ళ ముందు పరువు కాపాడుకోవడానికి మన పిల్లల్ని మనమే కొడితే అది మన కుటుంబం పైనే చెడు ప్రభావం కలిగిస్తుంది. పిల్లలు సిగరెత్‌లు తాగుతున్నారనో, బార్‌కి వెళ్తున్నారనో ఫిర్యాదులు వస్తే వాళ్ళకి చెడు స్నేహాలు ఉన్నాయో, లేదో కనుక్కోవడానికి ప్రయత్నించాలి. చెడు స్నేహాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళని స్నేహితులతో తిరగనివ్వకూడదు. పిల్లలు ఆడుకునే సమయంలో గొడవలు వచ్చినప్పుడు మాత్రం అవతలివాళ్ళ తల్లితండ్రులు ఇచ్చే ఫిర్యాదులని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజం గురించి పెద్దలకి తెలిసినంతగా పిల్లలకి తెలియదు. ఆటలు లాంటి చిన్న విషయాలలో గొడవలు జరిగితే అలా గొడవపడొద్దని పిల్లలకి చెప్పాలి కానీ అవతలివాళ్ళ పిల్లల మీద వాళ్ళ తల్లితండ్రులకి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడమో, మన పిల్లల మీద ఇతరులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులని నమ్మడమో చెయ్యకూడదు.
క్రమ శిక్షణ పేరుతో పిల్లల్ని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని కొట్టినంతమాత్రాన వాళ్ళ ప్రవర్తన మారదు. పిల్లల ప్రవర్తనపై సమాజ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. మంచి ప్రవర్తన అయినా, చెడు ప్రవర్తన అయినా పిల్లలు సమాజాన్ని చూసే నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు పిల్లల్ని కొట్టడం వల్ల కూడా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. స్కూల్ పుస్తకాలలో ఓర్పూ, సహనం గురించి పాఠాలు వ్రాస్తారు కానీ ఉపాధ్యాయులు ఓర్పు నశించి పిల్లల్ని కొడతారు. ఇది చూస్తే స్కూల్ పుస్తకాలలోని నీతులని నిజ జీవితంలో ఎవరు ఆచరిస్తారు అనే అనుమానం పిల్లలకి వస్తుంది. ప్రైవేత్ స్కూల్‌లలో పని చేసే ఉపాధ్యాయులైతే "మీరు చదువుకోకపోతే తోపుడు బండి మీద ఇడ్లీలు అమ్ముకుంటారు" అని పిల్లల్ని భయపెట్టి చదివిస్తారు. "ఆ ఉపాధ్యాయుడు కూడా చదువుకున్నవాడే అయినా అతను తక్కువ జీతానికి ప్రైవేత్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు" అనే అనుమానం పిల్లలకి వస్తుంది. చదువుకున్నవాళ్ళందరూ ఆఫీసర్లు అవుతారనే భ్రమ పిల్లలకి కలిగించడం సాధ్యం కాదు. పిల్లలకి చదువు మీద ఆసక్తి కలిగేలా మన విద్యా విధానం మారితేనే పిల్లలు శ్రద్ధగా చదువుకోవడం జరుగుతుంది కానీ కొట్టి చదివించడం వల్లో, ఇడ్లీ బండి నడుపుతారని బెదిరించడం వల్లో ప్రయోజనం ఉండదు.
మనిషి ప్రవర్తనపై అతను జీవించే పరిస్థితుల ప్రభావం ఎక్కువే ఉంటుంది. ఒక యువకుడు తనకి పిన్ని వరస అయిన స్త్రీని ప్రేమిస్తే అతనికి వరసలు తెలియవని అందరూ అనుకుంటారు. వరసలు పాటించడం, పాటించకపోవడం కంటే పెద్ద సమస్యల్ని ఆ యువకుడు తన జీవితంలో చూసి ఉంటాడనీ, అందు వల్ల వరసలు అనేది అతనికి చిన్న విషయంలా కనిపించి ఉంటుందనీ ఎంత మంది తెలుసుకుంటారు. సంప్రదాయాల పేరుతో చెలియలికట్టలు కట్టి వాటిని దాటకూడు అంటే అందరూ ఆ చెలియలికట్టలకి ఇవతలే ఉండిపోరు. సొంత బుర్ర ఉపయోగించి సొంత అనుభవాల ఆధారంగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. గ్రహణాలు చూడకూడదనే నమ్మకం ఉన్న రోజుల్లో కొంత మంది గ్రహణాలని చూసి పరిశీలించబట్టే కదా "భూమి నీడ చంద్రుని మీద పడడం వల్ల గ్రహణం వస్తుంది" అని తెలిసింది. వ్యక్తిగత విషయాలలో తాను చేస్తున్నది తప్పా, కాదా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మనిషికి ఉండాలి. ఆ స్వేచ్ఛ మనిషికి లేకపోతే మన నమ్మకాలు గ్రహణం చంద్రుణ్ణి చూడకూడదు అనుకునే స్థాయిలోనే ఉంటాయి.
--------------------------------------------------
*Republished
మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com
జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.
జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.