చిన్నపిల్లలు పెద్దలను అనేక ప్రశ్నలేస్తారు. కనిపించిన ప్రతీదాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఏమిటి? ఎందుకు? ఎలా? అని తెలుసుకునే జిజ్ఞాస వారికి ఎక్కువ. పిల్లలడిగిన అనేక ప్రశ్నలకు తల్లి దండ్రులు చెప్పిన సమాధానాలకు ఆ తరువాత పాఠశాలలో బోధించే వాటికి పొంతన లేనపుడు పిల్లలకు కొత్త ప్రశ్నలు పుడతాయి. పాఠ్యాంశాలలో చెప్పే నీతికి సమాజంలో జరిగే రీతికి తేడా స్పష్టంగా కనబడుతుంటుంది. ఉధాహరణకు 'అంటరానితనం నేరం' అని ప్రతి పాఠ్యపుస్తకంపైనా, నోటు బుక్కులపైనా ఉంటుంది. ఆచరణలో దానికి విరుద్ధంగా జరుగుతుంటుంది. కుల మతాలు లేవంటూనే అడ్మిషన్లపుడు తప్పక కులం అడుగుతారు. నీతి పాఠాలు చెప్పే టీచర్లు నీతిని తప్పి ప్రవర్తిస్తుంటారు. బడిలో చెప్పిన పాఠాలు ప్రభావం జీవితంపైన కీలకంగానే ఉంటుంది. ఇది ఒక ఎత్తైతే కొందరు ఉపాధ్యాయులు ఆసక్తి కరంగా పాఠాలు చెపుతుంటారు. పిల్లలకు ప్రశ్నించడం నేర్పుతూ పాఠాలు బోధిస్తుంటారు. బట్టీ పట్టే విధానం, విసుగుతో సమాధానాలు కాకుండా ఓపికగా మరిన్ని ప్రశ్నలడిగేలా చెప్తుంటారు. దీనివల్ల విధ్యార్ధులలో అవగాహన పెరుగుతుంది. ప్రశ్నించే శక్తి పెరుగుతుంది. విద్యార్ధులకు ప్రశ్నించే తత్వాన్ని అలవరచడంలో ఉపాద్యాయుల పాత్ర ఏమిటి? నేటి ఉపాధ్యాయులు పిల్లలకు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవరచడంలో సఫలమవుతున్నారా? ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాలను పంచుకోవాలని విజ్ఞప్తి.

- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. మీ చక్కని ప్రశ్నకు ధన్యవాదములు. నేను ఇప్పుడు (చాదస్తపు) ఉపాధ్యాయుడి స్థానంలోనే ఉన్నాను. గత ఆరు సంవత్సరాలుగా విద్యార్ధుల మనోభావాలను అర్ధం చేసుకుంటున్నాను. గతపు రోజులలో ఉపాధ్యాయుడికి, నేటి ఉపాధ్యాయుడికి చాలా తేడా ఉంది. ఇది ఉపాధ్యాయుడి ఆలోచనలలో వచ్చిన మార్పుల కారణం కొంతైతే విద్యార్దుల ప్రవర్తనా తీరులో వచ్చిన మార్పు ప్రధాన కారణం. పూర్వపు విద్యార్ధికి ఉపాధ్యాయుడే సర్వస్వం. ఆ ఉపాధ్యాయుడు చెప్పిందే వేదం. అతనికి మరే ఇతర సాధనాలు అందుబాటులో లేవు. కనుక తెలియని విషయం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయుడే ఆధారం. అందుకే గురు శిష్యుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేవి. ఆ కాలపు ఉపాధ్యాయుడు కూడా విద్యార్ధులకు ఏదో ఒకటి చెప్పి ముందుకు సాగిపోవాలని ఆలోచించేవాడు కాదు. ఆయా విద్యార్ధులను తన బిడ్డలుగా భావించడం, ఆ విద్యార్ధుల తల్లిదండ్రులు ఉపాధ్యాయునికిచ్చే గౌరవం చూసి ఉపాధ్యాయుడు మరింత బాధ్యతెరిగి తన బిడ్డల (విద్యార్ధుల) భవిష్యత్తును గురించి నిరంతరం ఆలోచించేవాడు. కానీ నేటి విద్యార్ధికి ఉపాధ్యాయుడు అతని జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. దానికి కారణాలను అన్వేషిస్తే, విద్యార్ధికి సమాచారాన్ని అందించడంలో ఉపాధ్యాయునికంటే ప్రసార మాధ్యమాలు ముందు ఉంటున్నాయి. విద్యార్ధికి చక్కని వినోద మాధ్యమాలు రా రమ్మంటూ పిలుస్తున్నాయి. అవి ఆసక్తికరంగా ఉండడంతో విద్యార్ధివాటిపట్ల పెట్టే శ్రద్ద ఇటు పాఠ్యంశాలపై పెట్టడం లేదు.అందువల్ల ప్ర శ్నించాల్సిన అవసరమే రాకుండాపోతున్నది. విద్యార్ధి నేడు ఆసక్తిగా గమనించేవి తనకిష్టమైన సినిమా హీరోలు, హీరోయిన్లను గురించి, తనకిష్టమైన క్రీడ, క్రికెట్‌ను గురించి, కొద్దిగా వయస్సు పెరిగి, పెద్దవాడైన విద్యార్ధి లైంగిక పరమైన ఆకర్షనలకు లోనై, అసభ్యకరమైన సాహిత్యం గురించి, బ్బాయిలు అమ్మాయిలను గురించి, అమ్మాయిలు అబ్బాయిలను గురించి, వారితో ఫోన్‌ సంభాషణలు,ఫేస్బుక్‌ స్నేహాలు గురించి ఆలోచించడమే. వీటిలో వచ్చే సందేహాలను పాపం ఉపాధ్యాయుడు తీర్చలేడు. ఒకవేళ తీర్చగలిగినా విద్యార్ధి ప్రశ్నంచలేడు.అందుకే ఆయా ప్రశ్నలన్నింటి మిత్రుల వద్దనే ప్రస్తావిస్తున్నాడు. ఇక మరొక కారణం తల్లిదండ్రుల వైఖరిలో వచ్చిన మార్పు. ఇందాక అన్నట్లుగా గతంలో తల్లిదండ్రులు సంపూర్ణంగా ఉపాధ్యాయుడిని నమ్మి విద్యార్ధిని ఉపాధ్యాయుని చేతిలో ఉంచేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఒంటరి కుటుంబ (చిన్న కుటుంబాలు) పెరిగిపోయాయి. తల్లిదండ్రులు తమ బిడ్డలను అతి గారాబంగా పెంచడం మొదలైంది. వారి ఒంటిపై చిన్న దెబ్బను కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. మధ్యతరగతి వారు కూడా తమ బిడ్డలకు రోజూ పాకెట్‌మనీగా కనీసం రూ. 10 వరకూ ఇవ్వగల (అది ఇవ్వకపోతే పిల్లలను సరిగా చూసుకోలేదంటుందట సమాజం) స్థోమతకు చేరుకున్నారు. ఎగువ మధ్యతరగతివారైతే ఏడు, ఎనిమిదో తరగతులలో సెల్‌ఫోను, పది పాసైతే పాతదో కొత్తదో బండి, ఇంటర్‌ పాసైతే . . . చిత్రం చూడండి సెల్‌పోను, బండి ఉన్నోళ్లలో ఎంతమంది ఇంటర్‌ డిగ్రీలు గట్టెక్కుతారు లెండి వారి గురించి అనవసరం. సరై పైవన్నీ చేసిన తల్లిదండ్రులే మా మంచి నాన్న, మా మంచి అమ్మ అనిపించుకోగలుగుతున్నారు. మరి అలాంటి తల్లిదండ్రులు చదువుకు విలువిచ్చి (ఒకవేళ ఇచ్చినా) ఉపాధ్యాయునికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు గురు శిష్య సంబంధాలేలా బావుంటాయి? ఉపాధ్యాయుడిని విద్యార్ధి ప్రశ్నంచడం ఎలా కుదురుతుంది.?
    ఇక ఉపాధ్యాయులు కూడా చాలా మారిపోయారులెండి. గతంలో అంకితభావం కలిగి, వృత్తిని దైవంగా భావించేవారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవారు. మిగిలినవారు, ఈ వృత్తి చాలా కష్టమైనది మనవల్ల కాదంటూ దూరంగా ఉండేవారు. కానీ ప్రస్తుత రోజులు అలాలేవు. కొన్ని దరిద్రాల పుణ్యమాని ఏ ఉద్యోగం రానివారు ఉపాధ్యాయులవుతారు అనే పరిస్థితికి చేరుకుంది నేటి ఉపాధ్యాయ భర్తీ విధానం. ప్రైవేటు ఉపాధ్యాయులు దీనికేమీ తీసిపోరు. బాగా చదువుకున్నవాళ్లు ఇతర ఉద్యోగాల్లో మంచి జీతాలతో స్థిరపడుతుంటే, బాగా చదవలేక, సొంతూరు వదల్లేక ఉన్నవారే ఉపాధ్యాయులుగా మిగిలిపోతున్నారు. మరి అలాంటి ఉపాధ్యాయునికి అంకితభావం ఎలా వస్తుంది? విద్యార్ధులలో ప్రశ్నించే తత్వం ఎలా వస్తుంది. బాధ్యత ఎలా వస్తుంది?


    విద్యావ్యవస్థ ఎలా బాగుపడుతుంది?

    క్షమించండి. మీరు వేసిన ప్రశ్న నుంచి నేను దూరంగా పోయినట్లున్నాను. అయినప్పటికీ నేటి విద్యా వ్యవస్థలో ఉన్న నిజం పైన నేను ఉదహరించినదే

    ReplyDelete
    Replies
    1. చైతన్యకుమార్ గారు, బాగున్నారా! చాలా రోజులయింది మీ పలకరింపులు లేక.

      మారిన పరిస్తితిలోని కొన్ని కఠినమైన వాస్తవాలను వివరించారు. అయితే అసలు ప్రశ్న ఈ పరిస్తితిని మార్చడానికి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏమీలేదా? మొత్తం ఉపాధ్యాయులే చేయలేరు. కానీ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం కాదా? సమాజాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం బోధన అని నా అభిప్రాయం.

      Delete
    2. ఒకతను రోడ్డుపై అతివేగంగా వెళ్తున్నాడు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతున్నాడు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పట్టించుకోవడం లేదు. అలా ప్రయాణిస్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక చెట్టును ఢీకొట్టాడు. కాలు ఎముక విరిగింది. ఆసపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చూసి కాలి ఎముక విరిగిందని నిర్ధారించారు. బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. అందరూ ఆ వ్యక్తిని చూసి వారిలో వారే అనుకుంటున్నారు ఇతను రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనీ, ట్రాపిక్‌ నిబంధనలు పట్టించుకోడనీ, . . . మధ్యలో ఒకతను వచ్చి సరే అయ్యిందేదో అయిపోయింది. అతని కాలు విరిగిందంటున్నారు. నెప్పికి తట్టుకోలేకపోతున్నాడు. డాక్టరు గారూ. ఒక నొప్పి తగ్గడానికి ఒక మంచి ఇంజక్షన్‌ ఇచ్చి డిశ్చార్జ్‌ చేయండి అన్నాడు. వెంటనే మిగిలినవారంతా డిశ్చార్జ్‌ చేయడమేంటని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.


      మనం చర్చించాలనుకుంటున్న అంశం ఇలాంటిదే కొండలరావుగారూ, సమస్యకు ఉన్న మూలాలను మరచి ఉపాధ్యాయులలో మార్పు ఆశించడం, కాలు విరిగిన వారికి వైద్యాన్ని ఇంజక్షన్‌తో సరిపెట్టడం లాంటిదే. సరే. నా అభిప్రాయంలో ప్రస్తుతం ఏం చేస్తే బావుంటుందో చెప్తాను మీ ప్రశ్నకు సమాధానంగా
      ముందుగా ఉపాధ్యాయుల వైఖరిలో మార్పు రావాలి. విద్యార్ధులు మన బిడ్డలన్న భావనతో విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాలి.
      విలువలను తనలో నిలుపుకునే ప్రయత్నం జరగాలి. తాను చెప్పేదొకటి చేసేదొకటి కాకుండామంచి విలువలను పాటిస్తూ తాను మంచివాడిగా మారాలి. ఆపై విద్యార్దినీ విద్యార్ధులకు మంచి నేర్పాలి. ఇవి ఉపాధ్యాయులలో రావల్సిన కీలకమైన మార్పులు. ఇవి వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత పాఠ్యప్రణాళికలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యార్ధులు పాఠ్యపుస్తకాలను సొంతంగా చదవగలిగేలా, ప్రశ్నించే తత్వం వారిలో పెరిగేలా పాఠ్యపుస్తకాలలో ఎన్నో మార్పులు చేశారు. జరగాల్సిందల్లా బోధనా విధానాల్లో మార్పులు, అంకితభావంతో కూడిన బోధన.
      ఉపాధ్యాయుడు విద్యార్ధులకు చక్కని స్వేచ్చనివ్వాలి.
      విద్యార్ధులు తనతో సరదాగా (పాఠ్యసంబంధ విషయాలేలెండి) మాట్లాడగల సామీప్యతను అలవాటు చేయాలి.
      విద్య కేవలం పుస్తకాలలోనే లేదు. పుస్తకాలను దాటి తెలుసుకోవాల్సిన ఙ్ఞానం ఎంతో ఉందని విద్యార్ధులకు తెలియచేయాలి.
      వారికి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాలైన పుస్తకాలు, ఇంటర్‌నెట్‌వంటివాటిని విద్యలో ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయుడు శిక్షణ ఇవ్వాలి.
      అన్నంటినీ మించి విద్యార్ధులను ఉపాధ్యాయుడు మాటలతో ఆకర్షించగలగాలి
      పై మార్పులు పాఠశాలల్లో, ఉపాధ్యాయుల్లో జరిగిననాడు సమాజం బావుంటుంది.

      ఏమైనా మీరన్నది నిజం. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యంత కీలకమైనది

      ఒక డాక్టరు తప్పు చేస్తే ఒక రోగి అకారణంగా చనిపోయే వరకూ అతని ఆటలు సాగుతాయి. ఆపై అతను నకిలీ డాక్టరన్న విషయం సమాజానికి తెలుస్తుంది. అతన్ని సమాజం శిక్షిస్తుంది.

      ఒక లాయరు తప్పు చేస్తే న్యాయం ఉన్నా కేసు ఓడిపోతే తెలిసిపోతుంది అతనికి వాదించడం రాదని, న్యాయాన్ని గెలిపించలేడని.

      ఒక ఇంజనీరు తప్పు చేస్తే అతను కట్టించిన భవంతి కూలిపోవడమే ఒక సంవత్సరానికే బీటలువారడంతోనో తెలిసిపోతుంది.

      కానీ ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే, అంకిత భావంతో పనిచేయకపోతే కొన్ని తరాలు తరాలు ఇబ్బంది పడుతూనే ఉంటాయి. కనీసం తప్పుకు కారణం అయిన ఉపాధ్యాయుడు శిక్షించడం అటుంచి, కారణం ఉపాధ్యాయుడే అన్న విషయంకూడా ఎవరకీ తెలియదు. కాదంటారా?

      Delete

    3. చైతన్యకుమార్ గారు,

      క్షమించాలి. నేను కేవలం ఉపాధ్యాయులే కారణం అన్న ధోరణితో ఈ ప్రశ్న అడుగలేదని మనవి. ప్రశ్న అనే అంశంపైనా, ప్రశ్నించడం ఎవరికి ఎలా నేర్పాలి? ఎలా ప్రశ్నించకుడదు? అనేది నేను నేర్చుకోవడానికీ ఎవరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మాత్రమే వరుసగా ప్రశ్నలు ఉంచుతున్నాను. ఈ అంశంపై ప్రతి పోష్టులో ఇంత క్రితం టపా , తరువాతి టపా లింకులు ఇస్తున్నది అందుకే. ఇంత క్రితం ప్రశ్నలు కూడా ఆ లింక్ నొక్కి చూస్తే మీకు ఆ విషయం అర్ధమవుతుందని భావిస్తున్నాను. మీకు వీలుంటే 'ప్రశ్న' లేబుల్ తో ఉన్న టపాలన్నీ ఒకసారి చూడగలరు. సమాజం లో పౌరులు ఎంత చైతన్యవంతంగా ఉన్నారనేది వారు ప్రశ్నించే శక్తిని బట్టి ఉంటుంది. ఆ శక్తి చిన్నప్పటి నుండి ప్రోది కావాలి. దానికి ఎక్కడెక్కడ ఎలాంటి బీజాలు పడుతున్నాయి? ఎక్కడ ప్రశ్నించడాన్ని తెలివిగా అణచివేస్తున్నారు? అక్కడ సరి చెయాల్సింది ఏమిటి? అనేది మీ అందరి అభిప్రాయాలను ఒకచోటకు తీసుకురావాలనే ప్రయోగమే దీని ఉద్దేశం. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే సమాజాన్ని మార్చలేరు. ఉపాద్యాయుల నుండి మాత్రమే నేర్చుకోరు. కానీ ఉపాధ్యాలపైనా బాధ్యత ఉన్నది. సమాజాన్ని మార్చగలిగే, ప్రభావితం చేయగలిగే , చేసిన నేతల శక్తిలో వారి వారి ఉపాధ్యాయుల ప్రోత్సాహం తప్పక ఉన్నదనేది నిజం. ఆ మేరకు మీరు ఇప్పటి కామెంటులో ఉపాధ్యాయులుండాల్సిన తీరుపై చెప్పిన విషయాలు బాగున్నాయి. ధన్యవాదములు.

      Delete
  2. మీరే నన్ను క్షమించాలి. గతంలో మీరు ప్రచురించిన 'ప్రశ్న' వ్యాసాలను నేను గమనించలేదు. సర్లెండి నా వృత్తి గురించేగా నేను విశ్లేషణ చేసుకుంది. అదీ వాస్తవాలనే. సరే మీ ప్రచురణ ద్వారా నా వృత్తిలో ఉన్న లోటుపాట్లను ఒక్కసారి ఆలోచించే అవకాశం లభించింది ధన్యవాదములు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top