“ ఓటు హక్కు ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం . పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఓటరుగా నమోదు కావాలి. ప్రజాస్వామ్య సూత్రానికి ఓటు మూల స్థంభం. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులందరూ ఎన్నికలలో విథిగా ఓటు హక్కును వినియోగించు కోవాలి ......”
నిజమే. ఓటు హక్కు వజ్రాయుధమే. అయితే ఓటరు చేతిలో ఉన్నప్పుడు కాదు. ఓటరు చెయ్యిదాటి నేతకు చేరినప్పుడు. అవినీతికి చేరువైనప్పుడు. ఇదీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో జరిగే ప్రహసనం.
రాజకీయ పార్టీలు రెండో మాట లేకుండా అంగబలం, అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి దించుతాయి . ఎన్నిఅకృత్యాలు చేసయినా గెలవగల సత్తా ఉండడమే అభ్యర్థిత్వానికి ముఖ్య అర్హత . అవినీతి మలికి అంటని స్వఛ్ఛత–సేవాతత్పరత, నిరాడంబరత, సంస్కారం – ఇలాంటి ట్రాక్ రికార్డు అవసరం లేదు.
రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థిత్వాలు ఇలా ఉంటే ఎవరికి ఓటెయ్యాలి . ఎవరికి ఓటేసినా గెలిచిన వాడి చేతికి వజ్రాయుధాన్నిచ్చినట్టే. వాడు దాన్ని ప్రజలనూ ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ప్రజాధనం దోచుకుంటున్నాడు.
పూర్వం న్యాయవాద విద్యనభ్యసించిన వారే ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు. రాజకీయాలలోకి వచ్చిన ఇతరత్రా వారికి కూడా ప్రజాసేవ పట్ల నిబధ్ధతా, అవినీతి ముద్ర పడుతుందేమోననే జంకూ ఉండేది.
నేడు అధికారం కోసం నేతలు పడే తహ తహ చూస్తూ ఉంటే ఎలాంటి జంకూ గొంకూ కనబడడం లేదు. కేవలం అధికార , ధన దాహం తప్ప.
బడా కాంట్రాక్టర్లూ, బడా పారిశ్రామిక వేత్తలూ, లిక్కర్ కాంట్రాక్టర్లూ, చివరకు గూండాలూ రౌడీలూ కిల్లర్లూ రాజకీయ నేతల అవతారమెత్తి అధికారం కోసం తహతహలాడడం ప్రజాసేవ కోసమే అనుకోగలమా?
దీన్ని ప్రజాస్వామ్యమని మభ్యపెట్టుకొనాల్నా? మేథావుల సలహాను పాటించి ఉన్నంతలో మెరుగైన అభ్యర్థికి ఓటేసి చేతులు దులుపుకో వలసిందేనా? మరేదైనా పరిష్కారం ఆలోచించవలసి ఉందా?
అసలీ రాజకీయ పార్టీలవ్యవస్థను నిషేధించాలి. అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగాలి. నామినేషన్ దశ లోనే సమగ్ర పరిశీలనద్వారా వివిథ అంశాలలో అభ్యర్థిత్వాన్ని మదింపు వేసి పోటీ చేయడానికి అర్హతను నిర్థారించాలి. ప్రచారార్భాటాలనూ కోట్లాది రూపాయలు వ్యయం చెయ్యడాన్నీ నిషేధించాలి. స్వయంగా గాని మీడియా ద్వారా గానీ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నియోజక వర్గ ఓటర్లను కలిసి అభ్యర్థించడం మాత్రమే చేయాలి. పోటీలోని అభ్యర్థులంతా వడకట్టబడిన మంచి అభ్యర్థులైనప్పుడు గెలుపొందిన అందరూ ప్రజాసేవకుపక్రమించడాన్ని అనుమానించవలసిన అవసరముండదు .
ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా ముఖ్య మంత్రిని ఎన్నుకోవడం,ముఖ్యమంత్రి మంత్రులను ఎన్నుకోవడం – ఈ విధంగా పార్టీ రహిత ప్రభుత్వాన్నిఏర్పాటు చేసుకోవచ్చు .
ఇలాంటి ఏదైనా మంచి ఎన్నికల సంస్కరణ అమలై మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఏర్పడి నప్పుడు తప్ప ఇప్పుడున్న రాజకీయ పార్టీల వ్యవస్థలో మాత్రం మంచి ప్రజా ప్రతినిధులను ఆశించడం , ప్రజాధనం దోపిడీని నివారించడం అత్యాశే అవుతుంది .
మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవడం ఎలా? అనే అంశం మీద ఇది ఒకానొక ఆలోచన మాత్రమే . విభిన్న ఆలోచనలు చేస్తే గాని అంశం ఒక కొలిక్కి రాదు. చర్చించండి .
- లక్కాకుల రాజారావు
--------------------------------------------------
*Republished
మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com
ReplyDeleteపనికి మాలిన చర్చల నాపేసి జనాలు బుద్దిగా చైనీయుల్లా పనిచేస్తూ పోతే ప్రజాస్వామ్యం తన్ను తాను పరిరక్షించు కొనును
ఇట్లు
సలహాల్రాణి
జిలేబి
పాలకులు మాత్రం పక్కరాజ్యాలపై కన్నేసుకోవొచ్చును.
Delete