"న గాయత్ర్యా:పరంమంత్రం,న మాతు:పర దైవతం" 
గాయత్రి వంటి మంత్రం , తల్లి వంటి ప్రత్యక్ష దైవం వేరొకటి లేదన్నది లోకోక్తి !
అమ్మంటే అంతులేని సొమ్మురా  ప్రేమ అది ఏనాటికి తరగని భాగ్యంబురా అన్నారు ఓ..సినీ కవి  !!

అమ్మ ..

ఏ కవి కలానికి అందనిది
ఏ సూక్ష్మదర్శినికి .. చిక్కనిది ..

అమ్మ ప్రేమ..

సృష్టి ఉన్నంత కాలం..
తల్లిబిడ్డల ప్రేమ అనంతం ..
అపూర్వం. అజరామరం ..


అమ్మ పాటలు, అమ్మ కథలు, అమ్మ సామెతలు.... ఇలా సాహిత్యంలో అమ్మ ను గురించిన కమ్మనైన ఊసులు నాటి నుండి నేటికీ, ఏనాటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి. కనిపిస్తూనే ఉంటాయి. కారణం అమ్మ ప్రేమ అత్యంత సహజమైన అంశం. అది ప్రకృతిసిద్ధమైన ఓ సహజాతం. ఎంత చెప్పినా తరగని భావం. నిత్య నూతనమైన ఆత్మీయ అనుబంధం. నాగరికత ఏర్పరచుకున్న భద్రత నాన్న అయితే సహజ రక్షణ, ప్రేమ, నిత్య భద్రత అమ్మ.  పురాణ కాలం నుండి నేటి నెటిజెనుల కాలం వరకూ అమ్మ ప్రత్యేకత అమ్మదే. కాలమేదైనా కమనీయ పదం అమ్మ. దేవుడు లేడనేవాడున్నాడు కానీ అమ్మ లేదనేవాడసలే లేడన్నాడు సినీ గేయ రచయిత రాజశ్రీ. దేవుడు ఇంటింటా తానుండలేనందున అమ్మ రూపంలో ఉంటాడంటూ అమ్మను దేవునితో పోలుస్తారు.

ప్రతి ప్రసవం మరణానికీ చేరువగా వెళ్ళడమే అని తెలిసి కూడా స్త్రీ  తల్లిగా మారడానికి సాహసిస్తుంది. నవ మాసాలు మోసి రక్తాన్ని పంచి బిడ్డకి జన్మనిస్తుంది లాలిపోసి జోలపాడి గోరుముద్దలు తినిపిస్తూ తన రెక్కలక్రిండ పొదువుకుని రక్షణ కల్పిస్తుంది. తల్లి శిక్షణ ,తండ్రి రక్షణ బిడ్డలకి ఎల్లప్పుడూ అవసరమే ! ఒకవేళ తండ్రి భాద్యతలని సక్రమంగా నెరవేర్చకపోయినా అన్నీ తానై బిడ్డలని పెంచి పెద్దచేయడంలో అలసిపోయినా  బిడ్డల పట్ల ప్రేమతో తన భాద్యత ని నెరవేర్చుతూ కొవ్వొత్తిలా కరిగిపోయేది అమ్మ .

తండ్రి బీజమైతే తల్లి క్షేత్రం. బిడ్డకి జన్మ ప్రదాతలు ఇద్దరూ అయినప్పటికీ బిడ్డని పెంచడంలో తల్లి పాత్ర ముఖ్యమైనది. తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమైనది. స్పర్శ ద్వారా బిడ్డకి అందించే ఆలంబన రక్షణ కోటగోడల్లాంటివి.   బిడ్డకి ప్రధమ గురువు తల్లి. మనిషి నడవడికలో  ముఖ్యంగా తల్లి నుండి నేర్చుకున్న సంస్కారం అడుగడుగునా ఉట్టిపడుతుంది. అది  బిడ్డపై జీవితాంతం నిలిపి ఉంచే తల్లి యొక్క ప్రభావం. చరిత్రలో ఎన్నో పాఠాలు ఈ అంశాన్ని మనకు తెలియజేస్తాయి.


ఆధునిక కాలంలో అమ్మ భాద్యత మరింత పెరిగింది. అమ్మకి వంట పని ఇంటి పనే కాదు,  వృత్తి-వ్యాపారం మొదలైన వాటిలో తలమునకలై ఉన్నా కూడా బిడ్డల పట్ల శ్రద్ద చూపడంలో సమయం హెచ్చిస్తూనే ఉంది. బిడ్డల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటుంది. పసి తనంలో  తల్లిదండ్రుల  ముద్దు మురిపెం కరువై అమ్మమ్మ, తాతయ్యల పెంపకంలో తర్వాత సంరక్షణాలయంలో  బాల్యంలో  చదువులలో మంచి రాంక్ కోసం హాస్టల్ లో ఉండాల్సి రావడం, మంచి ఉద్యోగం కోసం,  మంచి మంచి అవకాశాలు కోసం తల్లి  బిడ్డలు దూరంగా ఉండవలసి రావడం వల్ల తల్లిబిడ్డల మధ్య దూరం పెరుగుతుంది. తనకి దూరంగా ఉన్నా .. బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని,  బిడ్డ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటూ  చల్లని దీవెనలు అందించే తల్లులున్నారు. "బిడ్డలని ఉన్నత శిఖరాలకి చేర్చే వాహకం "అమ్మ " . అమ్మంటే ఎప్పటికి  నిలిచి ఉండే ప్రేమ , అమ్మంటే వాత్సల్యం. అమ్మ  అంటే ఏమిటో అర్ధం కావాలంటే అమ్మ అయితే తప్ప అమ్మ గురించి తెలుసుకోలేరు. అది అమ్మ యొక్క  గొప్పదనం.


పై ఫోటోలోని వ్యక్తి పేరు నిర్మల. ఆమె వద్దనున్న బాలిక పేరు అంకిత. ఆమెలోని మాతృత్వం కన్న పిల్లలనే కాక దొరికిన ఆడపిల్లను సైతం అదే ప్రేమతో పెంచుతోంది. అదీ భర్తనూ ఇతర కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ. ఈమె స్పూర్తివంతమైన గాథను ఇక్కడ చూడండి. ఇలాంటి మహిళలెందరో నేటి సమాజంలో ఆదర్శవంతులుగా ఉండడం అనేది నిస్సంధేహంగా అమ్మ ప్రేమతోనే. అందుకే ఓ సినీ కవి అన్నారు. కంటేనే అమ్మంటే ఎలా? అని. దట్ ఈస్ మదర్. తను కనకపోయినా మాతృ ప్రేమకి  నిదర్శనంగా నిలిచిన యశోద ప్రేమ, బిడ్డని  తనంత తానే దూరం చేసుకుని చేసుకుని లోలోపల విలపించే కుంతిమాత, కన్యకగానే గర్భం ధరించి లోకానికి ప్రేమ మార్గాన్ని చాటి చెప్పిన ఏసుకి జన్మ నిచ్చిన మరియ వీరంతా అమ్మ అమృత ప్రేమకి నిదర్శనంగా నిలిచినవారే ! కురూపులైన తల్లి ఉంది అనుకోగల బిడ్డలు ఉంటారు. కాని..కూరూపి అయిన బిడ్డ ఉండదు.. అది అమ్మ హృదయ సౌందర్యం. అమ్మలని ద్వేషించే బిడ్డలు ఉండకూడదంటే అమ్మగా ఉండటమే అసలైన అర్హత.  ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!

కేవలం మాతృప్రేమే కాదు మహావీరులను తీర్చిదిద్దిన వారు, మహానేతలుగా వెలిగిన మాతృమూర్తులూ ఉన్నారు. భీరువైన ఖడ్గ తిక్కనను ధీరువుగా మలచిన మాతలున్నారు. శివాజీని వీరుడిగా తీర్చిదిద్దినది వీరమాత జిజియాబాయి. రాణీ రుద్రమ నుండి ఇందిరాగాంధీ వరకూ పరిపాలన చేసిన మహిళామణులున్నారు. ఉగ్గుపాలతో జోలపాటతో మొదలయ్యే అమ్మ ఒడి పాఠాలు సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేందుకు పునాదిని వేస్తాయి. కనుక మాతృమూర్తులు నిత్యం చైతన్యవంతులై మెలగాలి. అప్పుడు మరింత మెరుగైన సమాజం ఏర్పడుతుంది. అమ్మే తొలిగురువు కనుక అమ్మ ఒడిలో నేర్పే పాఠాలే చైతన్య దీపికలయితే మరీ మంచిది కదా!


నేటి పరిస్తితులలో అమ్మల పాత్ర కూడా అక్కడక్కడా పంటి క్రింది రాయిలా కలత పెడుతున్నది.  ప్రస్తుత కాలంలో మాతృత్వం పై కూడా  మచ్చ పడుతుంది దేహకాంక్షల పర్వంలో  క్షణికావేశంలో హద్దులు దాటినా తప్పు ఎవరిదైనా ఫలితం తల్లికావడం అనే వరంలాంటి శిక్ష స్త్రీ మోయాల్సిరావడం వల్ల భ్రూణ హత్యలు, లేదా పసి కందులని విసిరి పారేయడం లాంటివి చూస్తున్నాం . అయితే ఆ సంఘటనలు చాలా స్వల్పమే.

వృద్ధాప్యంలో అమ్మలను ఆదరించే సంస్కారం బిడ్డలలో కరువవుతున్నది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశం. విదేశీ చదువులు, కెరీరిజం మానవసంబంధాలలో పెద్ద మార్పునే తీసుకువస్తున్నది. నాగరికత మనసులను దూరంగా నెట్టివేయడం అమ్మను కలవరపెడుతున్నది. ప్రేమగా పెంచుకున్న బిడ్డలు రెక్కలొచ్చి ఎదిగిపోతున్ననదుకు సంతోషించాల్సింది పోయి వారు ఉండీ దూరంగా ఉండాల్సి రావడం తల్లి హృదయాన్ని తల్లడిల్లేలా చేస్తున్నది. విద్యా - ఉద్యోగ - ఉపాధి అవకాశాలను అన్ని ప్రాంతాలలో సమానంగా అందరికీ పనీ - అందరికీ విశ్రాంతిని కలిపించే మానవ సంబంధాలను నిజమైన మానవీయకోణంలో ఆవిష్కరింపజేస్తే తల్లి ఎదుటే బిడ్డలు ఉన్నతంగా జీవించగలిగితే అమ్మకు సంతోషం కలుగుతుంది. అలాంటి పరిస్తితులు సమాజంలో మెరుగు పడాలి. అమ్మకు బిడ్డలు దూరమైతేనే ఎదుగుదల అనే పరిస్తితులు మారాలి.  మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారుతున్న నేటి కాలంలోనూ విలువను కోల్పోని ఏకైక స్వచ్చమైన బంధం అమ్మ ప్రేమ. అదే అమ్మ ప్రత్యేకత. అటువంటి అమ్మ ను కాపాడుకుందాం. అమ్మ మనసు ఆందోళనకు గురికాని పరిస్తితులను నిర్మించుకుందాం.

అమ్మ తన బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటుంది. తన కళ్లెదుటే సంతోషంగా జీవించాలని అందరితో తన బిడ్డ మంచివాడనిపించుకోవాలని కోరుకుంటుంది. ప్రతీ అమ్మ ఇలాగే కోరుకుంటుందంటే ప్రతీ బిడ్డా తల్లి కోరికను నెరవేర్చే కర్తవ్యం తీసుకోవాలి. తల్లిని ఆనందంగా ఉంచేలా సమాజ పరిస్తితులలో మార్పు తెచ్చేందుకూ తాను ఆవిధంగా మారేందుకూ నిత్యం ప్రయత్నించాలి. ప్రతి స్త్రీ హృదయం లోను అమ్మతనం దాగి ఉంది . అమ్మా అనే పిలుపు వినగానే ఆకాశమంత హృదయ వైశాల్యంతో కరుణని కురిపించే మమతలున్న తల్లులందరిలోను దైవత్వంని చూస్తున్నాం కాబట్టీ .. అమ్మ ఎన్నటికి పూజ్యనీయురాలు.  అమ్మని ప్రేమిద్దాం, పూజిద్దాం. ప్రతి స్త్రీ మూర్తి లోనూ అమ్మని చూస్తూ గౌరవించడం  ద్వారా మన సంస్కారం చాటుకుందాం!  ఆడవారినీ అమ్మను గౌరవించేలా ప్రతి అడుగులో జాగ్రత్తగా మెలుగుదాం. అన్నివేళలా మన యోగ క్షేమాలు ఏ మాత్రం కల్మషం లేకుండా కోరుకునే, పాటుపడే అమ్మ యోగక్షేమాలు అన్ని వేళలా మనమూ కాపాడుదాం. ఏ స్తితిలోనూ అమ్మకు అభద్రత - ఆందోళన కలిగించే అంశాలను కల్పించని మంచి సమాజం కోసం మనమందరం కృషి చేయాలి.  అమ్మకు ఏ అడుగులోనూ ఆందోళన కలుగని ఉన్నత సమాజాన్ని నిర్మిద్దాం. ప్రతి తల్లి సమాజ నిర్మాణంలో బిడ్డలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. చైతన్యవంతమైన యువతరాన్ని అందించడంలో అమ్మ విజయవంతంగా తన పాత్రను నిర్వర్తించాలి. ప్రతీ బిడ్డా తల్లి ని జీవితాంతం గౌరవించేలా, పూజనీయ భావంతో సత్ప్రవర్తనతో మెలగాలి. తల్లీ బిడ్డలిలా వర్ధిల్లితే లోకమంతా నిత్య చతన్యవంతంగా విరాజిల్లుతుందనడంలో సందేహం లేదు.

--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com

జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top