మనిషికీ - జంతువుకూ ఉన్న తేడా ?
'మనిషి' భూమి మీద ఉన్న జీవరాసులలో తెలివైనవాడు. మిగతా జీవులతో పోల్చుకున్నప్పుడు భిన్నమైన వాడు కూడా. మనిషికీ - జంతువుకూ ఉన్న తేడా ఆలోచన + శ్రమ . మనిషి ఆలోచించడం ద్వారా నిరంతరం తనను తాను మార్చుకుంటాడు. గతాన్ని బేరీజు వేసుకుని వర్తమానాన్ని ఉపయోగించుకుంటాడు. భవిషత్తులో కావలసిన దానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకు తోటి మనుషులతో సంభాషిస్తూ శ్రమ ద్వారా తనను తానూ మార్చుకుంటూ ఉంటాడు.
జంతువులు అలా కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతి జంతువూ అప్పుడు ఎలా ఉందో ఇపుడూ అదేవిధంగా ఉంది. ఏ మార్పూ ఉండదు. జన్మత: ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవి మాత్రమే జంతువులకు ఉంటాయి. ఒక సాలె పురుగుకి గూడు అల్లడం అనేది పుట్టుకతో అబ్బే లక్షణం. అంతకు మించి దాని లక్షణాలలో లేదా నైపుణ్యత పెరగదు. అలాగే ప్రతి జంతువు పుట్టుకతో వచ్చే లక్షణాలతొనే లక్షల , వేల సంవత్సరాలనుండి అలాగే ఉన్నాయి. మనిషి మాత్రమే ప్రకృతిని వాడుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగైన జీవనం సాగించేందుకు తనను తాను మార్చుకుంటున్నాడు. అందుకే జంతువులలో జీవులలో మానవ జన్మ ఉత్తమమైనది.
మనిషిలో మార్పు సంభవం అనేది 20 వ శతాబ్ధపు అద్భుతం అని కూడా అంటారు అందుకే . ప్రతి మనిషి ప్రయత్నిస్తే తనను తాను ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. ఎవరికి వారు తనను తాను చెక్కుకునే శిల్పి కావాలి ఇందుకు.
ఈ సందర్భంగా ఒక బుక్ లో చదివిన కథ మీకోసం.
అడవిలో జంతువులన్నీ ఒక్కసారి సమావేశమయ్యి " జంతునాం నరజన్మ దుర్లభం " అంటారు. మానవుడిలో గొప్ప ఏమిటి? మనకన్నా గొప్పవాడా? అని చర్చించడం మొదలుపెట్టాయి.
" నేను ఆకలితో ఉంటే తప్ప జంతువులను చంపను. నా ఆకలి తీరాక విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో లేడిపిల్లలు నా మీద గెంతులు వేసినా ఏమీ చెయ్యను. కానీ మానవుడికి చచ్చేంత ఆశ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి... ఇంకా సంపాదించాలి అని నానా గడ్డి కారుస్తాడు. అటువంటి మానవుడికి మమ్మల్ని బంధించే హక్కు ఎవరిచ్చారు ? మనిషి మాకన్నా ఏవిధంగానూ గొప్పవాడు కాదు " అంది సింహం.
"నిజమే... మానవుడికి అత్యాశకు తోడూ విశ్వాసం కూడా లేదు. నాకు తిండిపెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంగా పడి ఉంటాను. అతనికి ఎవరు హాని చేసిన ప్రాణాలతో విడిచిపెట్టను. కానీ మానవుడు తిన్న ఇంటి వాసాలు లెక్కబెడతాడు. అన్నం పెట్టిన వారికే అన్యాయం చేస్తాడు, కాబట్టి మానవుడు మనకన్నా గొప్ప కానే కాదు" అంది కుక్క ఆవేశంగా.
" అవునవును... మానవుడి కన్నా నేను ఎన్నో రెట్లు శక్తివంతురాలిని. ఎంతటి బరువునైనా మోస్తాను. అలాగే నా తెలివితేటలూ కుడా ఎక్కువే. ఏ పని చెప్పినా చేస్తాను. మానవుడు స్వార్ధపరుడు ఆ పనులన్నీ నా చేత చేయించి క్రెడిట్ కొట్టేస్తున్నాడు " అని ఘోషించింది ఏనుగు.
అన్ని జంతువులూ తమ తమ గోడు వేల్లబోసుకున్నాయి. దీనికి పరిష్కారం గుహలో తపస్సు చేసుకునే మునీశ్వరుడు మాత్రమే చెప్పగలడని భావించి వెళ్లి అడిగాయి.
అంతా విన్న ముని నవ్వుతూ...
" నిజమే ! మీరన్నది అక్షరాలా సత్యం. కానీ మీకూ మానవుడికి ఉన్న తేడా ఒక్కటే. మానవుడిలో మార్పు సాధ్యం... మీలో అది అసాధ్యం . ఉదాహరణకి మాంసం బదులు పూరీ పెడితే కుక్క తింటుందా? పెద్దపులికి పెసరట్టు పెడితే సరిపోతుందా ? నక్కకి మంచి బుద్దులు నేర్పితే జిత్తులు మానుకోగలదా ? " అని ప్రశ్నించాడు.
" నిజమే చాలా కష్టమే " అన్నాయి జంతువులు ఏకకంఠంతో. మునీశ్వరుడు సంభాషణ కొనసాగిస్తూ.. " కానీ మానవుడు మారగలడు. సృష్టి ప్రారంభమైనపుడు మానవుడు పూర్తిగా వెజిటేరియన్. చెట్లమీద తిరుగుతూ కాయలు, పళ్ళు తినేవాడు. అందుకనే దేవుడు అతనికి కోరలు, పంజాలు, పదునైన పళ్ళు, పులిలాంటి గోళ్ళు ఇవ్వలేదు. రాను రాను అతనికి మారాలనిపించింది. తిండి మార్చుకోవాలనిపించింది. రాళ్ళతో జంతువులను కొట్టి వాటిని భుజించాడు. తరువాత విల్లు, బాణం తయారు చేసుకున్నాడు. ఆ తరువాత నిప్పు కనిపెట్టాడు. వండుకుని తినడం ప్రారంభించాడు. తన తెలివితేటలను ఉపయోగించుకుని జంతువులను అదుపు చేసాడు. దానికి కారణం అతను మారాలని అనుకోవడమే " అన్నాడు.
"నిజమే..నిజమే.. మేమెవరం మార్పు రావాలని కోరుకోలేదు...కోరుకోలేము కుడా..." అంది సింహం. ఈలోగా అసహనంతో ఉన్న కోతి లేచి, " అయ్యా ! మునీశ్వరా ! సరే ! మేము మారలేము.. మరి మనుషుల్లో కుడా అలా మారని వాళ్ళ సంగతి ఏమిటి ? " అని లా పాయింటు ఎత్తింది.
" వాడికీ మీకు తేడా ఏం లేదు " అంటూ ఆ ముని నవ్వుతూ గుహ లోనికి వెళ్ళిపోయాడు.
మరి ముని చెప్పినట్లు మనం మారదామా ? లేక ఇలాగే (?) ఉందామా ?
- Palla Kondala Rao,
19-03-2012.
మార్పు అనేది మీరు ఏయాంగిల్లో కోరుతున్నారో చెప్పనేలేదు. ఏవిధమైన మార్పు ప్రస్తుతం మనిషికి కావాలని మీ అభిప్రాయం?
ReplyDelete@ శ్రీకాంత్ గారూ !
ReplyDeleteసరిగా చెప్పారు.అందుకే చివరిలో ఇలాగే అన్న దగ్గర (?) మార్క్ పెట్టాను. గమనించే ఉంటారు. ఎంతమంది స్పందిస్తారో? ఎలా స్పందిస్తారో? చూశాక ఏయే అంశాలలో ప్రస్తుతం ఎలా మారుతున్నాము? ఏవి మంచి మార్పులు? - ఏవి చెడ్డ మార్పులు? చర్చ కొనసాగిద్దాం. ముందు మనిషికీ-జంతువుకీ ఉన్న తేడా చెప్పాను. కొన్ని విషయాలలో ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది.కానీ అందరికీ అవసరమైన మార్పులు గురించి నా అభిప్రాయాలు మాత్రమే మీ అందరితో 'మనం మారాలి!'అనే శీర్షిక క్రింద ఒక్కొక్కటిగా చర్చిస్తానని మనవి.
బాబోయ్..!! ఇదేదో చందమామ పుస్తకాలలోని కథలా అనిపిస్తేనూ.. అలా అడిగానండీ. సహజంగా ఆ కథలన్నింటిలో ఏదో ఒక విషయాన్ని తీసుకుని, ఈ విషయములో మార్పురావాలి అని రాస్తుంటారు. మీ కథలో ఆ విషయం లేదు. అందుకే అలా అడిగాను.
ReplyDeleteఇక మార్పుపై చర్చించడం అనేది ప్రహసనం. ఎందుకంటే.. మారే వాల్లు ఎవరు? అదీ చర్చల ద్వారా? ఎవ్వరూ ఉండరు. ఒక వేల ఆమార్పు మీరు కమ్యూనిస్టు భావజాల పరంగా ఊహించుకుని, దాన్ని చర్చిద్దామంటే ముందుకొచ్చేవారు కూడా ఉండరు.
కానీ, చర్చకు ఆహ్వానించే పద్దతి ఇదికాదేమో అనిపిస్తోంది. మీరు మారని వాడు పశువు అని చెప్పేశారు. ఫోటోలలో కూడా జంతువులను పెట్టేశారు. ఇక్కడికి వచ్చి, ఎవరన్నా మారము అనో మారాల్సిన అవసరం లేదు అనో భావించారనుకోండి(వారికా హక్కు ఉంది) వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా? అసలు మీరు మార్పు అని భావించేదాన్ని.. అవతలివారు కూడా మార్పు అని భావిస్తారని ఎలా అనుకుంటున్నారు?
ఉదాహరణకు, మీరు కమ్యూనిజం అనేది పెట్టుబడివిధానానికి తరువాతి దశ అని జనాలందరూ ఆతరువాతి దశకు మారాలని చెబుతారు, నేనేమో కమ్యూనిజం అనేది.. పెట్టుబడిదారి విధానానికి తరువాతి దశ అని చెప్పడానికి సరైన వివరణ అనేది లేదు కాబట్టి అలా అనుకోవడం కుదరదు అని చెబుతాను. ఇక్కడ మీరో నేనో ఎవరో ఒకరం మారడం అన్నది జరగదు.
అయినా, నాకు బ్లాగుల్లో ఇప్పటివరకూ అర్థమయ్యింది ఏమిటంటే.. కమ్యూనిస్టులు చర్చించడానికి రాలేదు. వారి ఇజాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే వచ్చారు. దానికి కారణం ప్రస్తుతం వారు దేశములో ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితులు కావచ్చు. ఇజాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన వారిదగ్గరకి వెల్లి చర్చించడం వలన లాభాలుండవు. ఎందుకంటే.. వారు వచ్చించి చర్చించి మంచో చెడో తేల్చుకోవడానికి కాదు. కేవలం మా ఇజం మంచిది నమ్మండి అని ప్రచారం చేయడానికి మాత్రమే.
ఇది నాకు ఇదివరకే ఒక బ్లాగులో అర్థమయ్యింది. వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎన్ని ప్రూఫులు చూపించినా ఫలితం లేదు. వారి వాదం వారిదే. ఈ మధ్య బహిరంగంగానే అంగీకరించేశారు, ఇక్కడెవ్వరూ మారడం అంటూ ఉండదు అని. అంటే, మిగిలిన వారే వెల్లి అక్కడికి మారాలి లేకపోతే వదిలేయాలి. నేను రెండోది ఎంచుకున్నా (చాలా మంది అదే ఎంచుకున్నారేమో).
ఈ పరిస్థితుల్లో, ఏరకమైన మార్పును గురించి మీరు ప్రస్తావిస్తున్నారో ముందే చెబితే బావుంటుంది.
ఈ ప్రపంచం లో శాశ్వత మైనది మార్పు మాత్రమే అంటారు.మార్పు వ్యక్తిగతంగా సామాజికం గా వస్తు ఉంటుంది.ఆ మార్పు కాల పరీక్షకు ఎలా నిలబడుతుంది అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది.ఇక మనిషిలో మానసిక మార్పు వరకు వస్తే ఈ అవసరం ఎక్కువగా కనిపిస్తుంది.
ReplyDelete@oddula ravisekhar
ReplyDelete<< ఇక మనిషిలో మానసిక మార్పు వరకు వస్తే ఈ అవసరం ఎక్కువగా కనిపిస్తుంది.>>
Yes ravi sir !