వధువులుగా మార్చి బాల్యాన్ని బలి చేయడం భావ్యమా!?
కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు ఏవైనా మనిషి జీవితంలో ప్రధాన ఘట్టం 'పెళ్లి'. ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలు వేరైనా జరిగే వివాహం సంప్రదాయబద్దంగా జరిగినా, దండల మార్పిడితో జరిగినా, రిజిస్టర్ మారేజి అయినా మరే పద్ధతి అయినా ఆ పెళ్లి ఆడ, మగ ఇరు వ్యక్తులను కలుపుతుంది. జీవితాంతం కలసి ఉండే బంధం ఏర్పరుస్తుంది. అది సామాజిక అవసరం కూడా. నిజానికి పెళ్లి వ్యక్తిగతం. అయినప్పటికీ, పెళ్ళితో ఏర్పడే ఆ బాంధవ్యం బాల్యంలో ఏర్పడకూడదు. సహాజీవనం బాల్యంలో జరగకూడదు. అది చట్ట విరుద్దం.
బాల్యం అంటే:
18 ఏళ్ళలోపు వారంతా బాలలే. ఆడపిల్లకి పెళ్లి వయస్సు 18 నిండాలి. మగ పిల్లవాడికి 21 ఏళ్ళు నిండాలి. అప్పుడు చేసుకునే పెళ్ళికి మాత్రమే చట్టబద్దత ఉంటుంది. కానీ, మన దేశంలో 45% పెళ్ళిళ్ళు 18 ఏళ్ల లోపు జరిగేవే. అంటే చట్టబద్దం కానివే.
మూఢనమ్మకాలు, ఆర్ధిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మతపరమైన సాంప్రదాయాలు, బాల్య వివాహాలని ప్రోత్సహిస్తున్నాయి. ఆడ పిల్లంటే 'ఆడ' పిల్లగానే భావించేలా చేస్తున్నాయి. పెళ్ళే లక్ష్యంగా ఆడపిల్లల్ని పెంచడం కనిపిస్తుంది. ఆర్థికంగా, విద్యా విషయికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన వారిలో బాల్య వివాహాలు ఎక్కువ. బాల్య వివాహం ఆ బాలికపై శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా లోతైన మరచిపోలేని మరకగా మిగిలిపోతోంది.
భారతదేశంలో బాల్య వివాహాల తీరు:
బాల్య వివాహాలపై 1926 ఆగష్టు 26న "యంగ్ ఇండియా " పత్రికలో వ్యాసం ప్రచురితమైంది. అందులో 'బాల్యవివాహం నైతికంగా, శారీరకంగా ఒక దురాచారం. బాల్య వివాహాన్ని నిషేధిస్తూ ఒక శాసనం తీసుకురావడం ఎంతైనా అవసరం. కానీ, శాసనం ఒక్కటే ఈ దురాచారాన్ని రూపుమాపలేదు. ప్రజల్లో చైతన్యం రావాలి. '18 ఏళ్ళలోపు బాలికలు పెళ్లి జరగకూడదు ' అన్నారు గాంధీజీ. బాల్య వివాహం చేయడం అంటే ఆ బాలుడు లేక బాలిక మానవ హక్కులను కాలరాయడమే. వారు తమ హక్కుల్ని కోల్పోవడమే.
నగరాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో ఇప్పటికీ బాల్యవివాహాలు ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువ. యునిసెఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో 2006-2007 లో 43 శాతం బాల్య వివాహాలయితే మన రాష్ట్రంలో అది 51. 9 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 48 శాతం కాగా పట్టణ ప్రాంతాల్లో 29 శాతం.
మన ఆంధ్రప్రదేశ్లో 2005 - 2009 మధ్యకాలంలో బాల్య వివాహాలు సుమారు 71 శాతం తగ్గాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నివేదిక వెల్లడిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల్యవివాహాల తీరు/రేటు ఒకే విధంగా ఉందని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ నివేదికలు ఏమి చెప్పినప్పటికీ లెక్కల్లో నమోదు కాకుండా జరిగే బాల్యవివాహాలు తక్కువేం కాదు. అవి జరుగుతూనే వున్నాయి. ఆడ పిల్లలపై పెళ్లి చేసుకోమనే వత్తిడి కొనసాగుతూనే ఉంది.
రెండు మూడేళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్ లోని పురులియాకు చెందిన ముగ్గురు బాలికల్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభినందించిన విషయం తప్పనిసరిగా గమనించాలి. పదకొండు సంవత్సరాల రేఖ కాలిండి, పదమూడేళ్ళ సునీత మహాతో, అఫ్సానా ఖటున్ లు బాల కార్మికులు. వారికి రెండేళ్ళ క్రితం చదువుకునే అవకాశం వచ్చింది. చదువుంటున్న క్రమంలోనే వారు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్దాలని అర్ధం చేసుకున్నారు. అవగాహన పెంచుకున్నారు. కుటుంబంలో తమకు తలపెట్టిన పెళ్ళిని వ్యతిరేకించారు. తల్లిదండ్రులపై పోరాడి విజయం సాధించారు. అలా పోరాడగలిగే స్తైర్యం, ధైర్యం అనుకున్నది సాధించుకోగలిగే ఆత్మవిశ్వాసం ఎంతమంది ఆడ పిల్లలకు ఉన్నాయి?
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం వల్ల ఆధునిక సమాజంలో టీనేజ్ పెళ్ళిళ్ళు అనివార్యం అని ఈ మధ్య ఒక కేసులో తీర్పు ఇస్తూ స్పష్టం చేసింది డిల్లీ కోర్టు. అంటే 1929 నాటి బాల్య వివాహాల చట్టాన్ని ఈ తీర్పు అపహాస్యం చేసినట్లే కదా !? ఉల్లంఘించినట్లే కదా!?
చారిత్రక నేపథ్యం :
వేదకాలంలో వధూవరుల వయసు ఎంత ఉండాలి? అని స్థిరమైన అభిప్రాయం లేకపోయినా యుక్తవయస్కులై ఉండాలి అన్నారు. 16 ఏళ్ళ వారిని యుక్తవయస్కులుగా చెప్పారు. ఆ కాలంలో బాల్య వివాహాలు కనిపించవు.
పురాణకాలంలోకి వచ్చేసరికి మగ పిల్లవాడి వయస్సు కంటే ఆడపిల్ల వయస్సు మూడు రెట్లు తక్కువ ఉండాలన్నారు. బృహస్పతి ఆడపిల్ల పెళ్లి వయసు 7 ఏళ్ళు అంటే మనువు ఆడపిల్ల పెళ్లి 8 ఏళ్ళలోపు చేయాలని శాసించాడు. మనువు చెప్పిందే ఆనాటి నుంచి ఈనాటి వరకూ శిరోధార్యంగా, పరమాదర్శంగా భావిస్తున్నారు. పురాణేతిహాసాల కాలంలో బాల్య వివాహాలు పూర్తిగా అమలులోకి వచ్చాయి. 5-6 ఏళ్ళ పిల్లలకే పెళ్ళి చేయడం ఆచారమయింది. బ్రహ్మ పురాణం 4- 10 ఏళ్ల మధ్యనే ఆడపిల్ల పెళ్లి చేయాలని నియమం చేసింది. లేకపోతే ఆమెకు మోక్షం లేదు అని ప్రజల్లో విశ్వాసం కలిగించింది. కౌటిల్యుడు 12 సంవత్సరాలలోపు ఆడపిల్ల పెళ్లి చేసేయాలన్నాడు. బౌద్ధ, జైన మతాల్లోనూ ఇవి సర్వ సాధారణమయ్యాయి. మొఘలుల కాలంలోనూ బాల్య వివాహాలు ఒక మామూలు విషయంగా కనిపిస్తుంది. 10 ఏళ్ళ లోపే ఆడపిల్ల పెళ్ళి జరిగేది.
రామాయణ, మహాభారతాల్లో స్త్రీ పాత్రలను గమనిస్తే వారికి యుక్తవయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఉదాహరణకి పురాణాల్లోని ప్రముఖ పాత్రలు సీత , ద్రౌపది ....
ఉత్తర భారతదేశం లోని ఒకటి రెండు కులాలు తప్ప పురాతన భారత దేశంలో బాల్య వివాహాలు జరిగిన దాఖలాలు కనిపించవు. విదేశీయులు మన దేశాన్ని పాలించిన కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యల్ని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడమో చెరచడమో చేసేవారట. పెళ్ళయిన వారిని ఎత్తుకెళ్ళరని మన వాళ్ళ నమ్మకం. అందుకే తమ ఆడ పిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేయడం మొదలు పెట్టి ఉంటారు.
తమ కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టం కావడానికి, ఆస్తిపాస్తులు దాటిపోకుండా ఉండడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధు వర్గాలో ఫలానా వాడి కోసం పుట్టిందని నిర్ణయించే విధానమూ మనకు తెలిసిందే.
సాంస్కృతిక కారణాలు :
పురాణకాలం నుండి ఆడపిల్ల ఈడ పిల్ల కాదు "ఆడ" పిల్లేనన్న భావన నరనరాల్లోను జీర్ణించుకుపోవడంతో ఆ పిల్ల పెళ్లి చేసి గుండెలపై కుంపటి దించుకొవాలన్న తహ తహ కనిపిస్తుంది. మేనరికాలు మనవాళ్ళకి సర్వ సాధారణ విషయం. చిన్నప్పుడు చేస్తేనే వారి బంధుత్వం మరింత గట్టి పడుతుంది అన్న నమ్మకం, కుల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ కారణమే.
ఆర్ధిక కారణాలు :
ఒకనాటి సంఘంలో కన్యాశుల్కం , ఈనాటి సమాజంలో వరకట్నం దురాచారాలుగా చెలామణి అవుతున్నాయి. అయితే, అప్పుడూ ఇప్పుడూ అందుకు బలైంది, అవుతున్నది మాత్రం ఆడపిల్లే. ఆడపిల్లను చదివిస్తే చదువుకు ఖర్చుపెట్టాలి. ఇటు వరకట్నం ఇవ్వాలి. ఇంట్లో ఉంటే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ వంటావార్పూ చేసి ఇంటిని చక్కపెడుతుంది అన్న భావన. రోజు రోజుకూ అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్నట్లే కట్నాల మార్కెట్లో అబ్బాయిల రేటూ పెరుగుతోంది. చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే ఆ బాధ కొంత తప్పుతుంది అనే ఆలోచన . వయసు పెరిగిన ఆడపిల్లకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడంతో పాటు కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని భావన.
కొందరు పేదరికం కారణంగా అధిక కట్నం ఇవ్వలేక బాల్య వివాహం చేసేస్తున్నారు. పెళ్లి ఖర్చు తగ్గించు కోవడం కోసం ఒకేసారి, ఒకేరోజు ఇద్దరు ముగ్గురు కూతుళ్ళ పెళ్లి చేస్తున్నారు.
బాల్య వివాహాలు ఎక్కువగా దగ్గర బంధువుల్లోనే చేయడం కనిపిస్తుంది. కారణం ఆ కుటుంబాల ఆస్తి కట్నం రూపంలో బయటికి పోకుండా కాపాడుకోవడం కోసం అనుకోవచ్చు.
సాంఘిక కారణాలు :
ఈనాటికీ ఆడపిల్లని 'ఆడ' పిల్లగా భావించడం, పొరుగింటి మొక్కని తమ దొడ్లో పెంచడంగా భావించడమే. గుండెల మీద కుంపటిగా భావించడమే. కన్యాత్వానికి , కుటుంబ గౌరవానికి లింకు పెట్టడం. ప్రాధాన్యతనివ్వడం. బాలిక కన్యత్వం పోయిందంటే కుటుంబ గౌరవం మంట కలసినట్లేనని భావించడం. పెళ్లి ద్వారా ఆమెను, ఆమె కన్యాత్వాన్ని రక్షించినట్లుగా భావించడం. పెళ్లి కాకుండా ఆమె కన్యాత్వాన్ని కాపాడడం కష్టం అని, అది కుటుంబ ప్రతిష్టకు భంగం అని ఎక్కువమంది భావించడం. అనుకోని అవాంచిత సంఘటనలో ఆమె కన్యాత్వాన్ని కోల్పోతే, ఆమె పెళ్ళికి పనికి రాదనీ, పూజకు పనికి రాని పువ్వుగా భావించడం.
చదువు పేరుతో గడప దాటిన ఆడపిల్ల చదువుతో పాటు లోకాన్ని చూస్తోంది. తన దృష్టి విశాల పరుచుకుంటోంది. తనకు నచ్చిన వాడిని తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకునే స్వేచ్చ తిసుకుంటోంది. అది తల్లిదండ్రుల, కుటుంబంలో ఇతర పెద్దల పెద్దరికాన్ని, ఆహాన్ని దెబ్బ తీస్తోంది. అందువల్ల చిన్నప్పుడే ఆడపిల్లకు పెళ్లి చేస్తే చెప్పు చేతల్లో ఉంటుందని , చదివిస్తే ఆమె తమ మాట వినదన్న భయం , ప్రేమ అంటూ తమని లెక్క చేయక పోతే తమ పెద్దరికం ఎమౌతుందోనన్న సంశయం. కులం, మతం కట్టుబాట్లను మంట గల్పుతారేమోనన్న సందేహం బాల్య వివాహాలకు మొగ్గు చూపేలా చేస్తోంది.
ప్రస్తుత సమాజంలో నానాటికీ హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. మంచి చెడు విచక్షణ నశిస్తోంది. అమ్మాయిలపై ఆసిడ్ దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి . ఎత్తుకెళ్ళి అమ్మివేయడం , మాయమాటలతో మరో చోటుకి తరలించడం జరుగుతోంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చే నమ్మకం లేకుండాపోతోంది. టీవీ లు , సినిమాలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ అమాయకమైన ఒక్కోసారి ఆమెకు తెలియకుండానే ఊబిలోకి నెట్టివేయ బడుతోంది.
సంప్రదాయాలు ఆచారాలు :
ప్రస్తుత సమాజంలో అమ్మాయి అబ్బాయికి వరకట్నం ఇవ్వడం ఒక సాంప్రదాయంగా, ఆచారంగా వస్తోంది. ఎంత డబ్బు ఖర్చు చేసి చదివించినా వరకట్నం ఇవ్వక తప్పడం లేదు ఈ స్థితిలో తల్లి దండ్రులు ఆమెను చదివించడానికంటే, ఆర్ధికంగా నిలబడేలా చూడడం కంటే పెళ్లికే ప్రాధాన్యత నిస్తున్నారు. ఆత్రుతపడి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.
మగపిల్లవాడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడన్న నమ్మకమ్. అంతా ఆడపిల్లలే ఉంటే మగ పిల్ల వాడికోసం మరో పెళ్లి చేసుకోవడం
ఇతర కారణాలు :
- చట్టాలు సరిగా అమలు కాకపోవడం చట్టాల పట్ల అవగాహన లేకపోవడం.
- చట్టబద్దమైన వివాహ వయస్సు తెలియకపోవడం
- చిన్నప్పుడే పెళ్లి చేస్తే చెప్పు చేతల్లో ఉంటారనీ, చూపించినవాడిని చేసుకుంటుందని
- కొన్ని కులాల్లో, కుటుంబాల్లో పిల్లల్ని ఆర్ధిక వనరుగా భావించడం.
- అమ్మమ్మో , నాయనమ్మో , తాతయ్యో వత్తిడి. మనుమరాలి పెళ్లి చూడాలన్న ఆకాంక్ష.
- రాజకీయ నిబద్దత లేకపోవడం
- ఉన్న చట్టాలని పటిష్టంగా అమలుపరచాలని , లోపాలను సవరించాలని చైతన్యం కలిగించాలన్న నిబద్దత లేకపోవడం .
- అంతే కాదు మహిళలకు సంబంధించిన విషయాలు అంటే ఇంకా ఉన్న చిన్న చూపు
- విద్య, విజ్ఞానం, సమాజ దృష్టి లేకపోవడం.
- చదువుకున్నా శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ విలువలు, ప్రజాస్వామిక విలువలు, మానవసంబంధాల ప్రాధాన్యత తెలియకపోవడం
- అధికారంలో ఉన్నవారు, ఆధిపత్యం చెలాయించేవారు వారు కూడా చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరపడం. అలాంటి కార్యక్రమాలకి హాజరు కావడం
- పెళ్లి రిజిస్టర్ చెయ్యక పోవడం .
(courtesy google)
బాల్య వివాహం నష్టాలు :
ఒకప్పుడు చిన్న పిల్లలకే పెళ్ళిచేయడం, ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ బాల వితంతువుల సంఖ్య విపరీతంగా ఉండేది. దానికి తోడు వితంతువు మళ్లీ పెళ్ళి చేస్కోకూడదు . సతీసహగమనం చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడే పెళ్లి కావడంతో ఆమెకు చదువు నేర్చుకునే అవకాశమే ఉండేది కాదు . విద్య లేకుండా , అజ్ఞానంలో మిగిలిపోయేవారు చిన్నతనంలో తల్లులైన బాలికలు అనేక శారీరక , మానసిక రుగ్మతలకు గురవుతుండేవారు. వారికి పుట్టిన బిడ్డలు పురిట్లోనే పోయేవారు.
ఆనాటికీ ఈనాటికీ బాల్య వివాహాలు జరుగుతూనే వున్నాయి. బాలికలు ఎంతో నష్టపోతూనే ఉన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- మానసిక శారీరక పరిణతి ఉండదు
- తెలిసీ తెలియని వయసులో జరిగే పెళ్ళిళ్ళ వల్ల వారు ఒకరికొకరు నచ్చకపోవచ్చు. కలసి జీవించలేక పోవచ్చు
- భార్యని వదిలి మరో పెళ్లి చేసుకోవడం జరగొచ్చు
- చిన్న వయసులో గర్భవతి కావడం
- చిన్న తనంలో తల్లి కావడం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఏర్పడవచ్చు
- లైంగిక సమస్యలు తలెత్తవచ్చు
- పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు రావొచ్చు
- పెళ్లి తర్వాత చదువుకునే పరిస్థితులు లేక పోవడం వల్ల ఆడపిల్లల విద్య శాతం తగ్గుతుంది
- ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి
- శారీరకంగా ఎదగక పోవడం వల్ల 15 శాతం బాలింత మరణాలు , శిశు మరణాలు పెరుగుతాయి
- HIV/AIDS సోకే అవకాశం ఎక్కువ
- మానసిక- శారీరక ఆరోగ్యం, వికాసం, అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది
- పెళ్ళిపేరుతో జోగినిగా మార్చడం
- తక్కువ బరువున్న , నాసిరకమైన శిశువుకు జన్మ నివ్వడం
- గృహ హింస, లైంగిక హింసకి గురి కావడం 61 శాతం
- పెళ్లి పేరుతో తరలించడం , అమ్మి వేయడం (రాజస్థాన్ , u.p.
- సమాజాభివ్రుద్ధిలో భాగమయిన ఆమె పెళ్లి పేరుతో చదువు ఆగిపోవడంతో అభివృద్ధిలో తన భాగస్వామ్యం తగ్గిపోవడం. అవకాశాలు తగ్గి పోవడం
- స్నేహితులు , సమాజంతో సంబంధాలు తగ్గి పోయి గిరి గీసుకొని భర్త పిల్లలు అని బతకడం
- కుటుంబంలోనూ పిల్లల్ని ఎప్పుడు కనాలి / కనొద్దు , వారి చదువు , ఆరోగ్యం, కుటుంబంలో నిర్ణయాలు , ఆస్తి విషయాలు ఏ నిర్ణయం తీసుకోలేక పోవడం
- నైపుణ్యాలు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం
శారదా చట్టం :
ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా బాల్య వివాహాల వల్ల ఏర్పడే సమస్యల్ని తీవ్రంగా పరిగణించారు. 1929లో బాల్యవివాహాల్ని నిషేధిస్తూ శారదా చట్టం చేశారు.
తర్వాత బాల్యనిరోధక చట్టం 2004, తప్పని సరిగా పెళ్లి నమోదు చట్టం 2006, బాల్యవివాహా నిర్మూలన చట్టం 2006 వచ్చాయి. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహం చేసుకునే వరుడికి, పెళ్ళికి ఒప్పుకున్న వారికి , అందుకు ప్రేరేపించిన వారికి కఠిన శిక్ష విదిస్తారు. అది మూడు నెలల నుండి రెండేళ్ళ వరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ కేసులో వారికి బెయిల్ లభించదు. బాల్య వివాహం నిలిపివేసే అధికారం కోర్టుకి ఉంది. బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్తులే. తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగు-పొరుగు, కుల పెద్దలు వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరూ నేరస్తులే. పెళ్ళికి హాజరైన వారు కుడా నేరస్థులే
బాల్య వివాహాలు అరికట్టడం కోసం తీసుకుంటున్న చర్యలు :
బాల్య వివాహాల్నినిషేధిస్తూ చట్టం చేసిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పువచ్చినా ఆశించినంత మేర రాలేదనే చెప్పుకోవాలి. చట్టం పట్ల అవగాహన లేకపోవడమే ఈ అనర్ధం ఇంకా ఇలా కొనసాగడానికి కారణం అవుతోంది. కాని ఇది అరికట్టలేనిది మాత్రం కాదు . కేంద్రం బాలిక సమృద్ధి యోజన, కిశోర శక్తి యోజన, Integrated Child Protection Scheme (ICPS), SABLA వంటి కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం బాలిక సంరక్షణ పథకం, బంగారుతల్లి వంటి పథకాల ద్వారా ఆడపిల్ల భారం కాకుండా విద్య, ఉపాధి కోసం వివిధ దశలలో కొంత సొమ్ము సమకూరుస్తోంది.
జాతీయ స్థాయిలో మహిళా సమాఖ్య, రాష్ట్రంలో మహిళా సమతా సొసైటీ, కస్తూరిబా పాటశాలలు బడి బయట ఉన్న ఆడపిల్లల్ని అక్కున చేర్చుకుని వారి భవిష్యత్ కి మార్గాలు వేస్తున్నాయి. తమ కాళ్ళ మీద తాము నిలబడడం కోసం తోవ చూపుతున్నాయి.
AP PROHIBITION OF CHILD MARRIAGES RULES-2009 ప్రభుత్వం విడుదల చేసింది . 2012లో బాల్య వివాహాలు అరికట్టడం కోసం ప్రభుత్వం ఒక G.O. జారీ చేసింది. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి సమన్వయ కమిటీలు వేశారు. జిల్లా కలెక్టరు నుండి గ్రామ పాలనాధికారి (VAO) ఆయా స్థాయిలలో కమిటీలో ఉంటారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారులతో పాటు స్వచ్చంద సంస్థలు, స్వయంసహాయక బృందాలు , గ్రామ అభివృద్ది కమిటీలు, మండల, జిల్లా సమాఖ్యల సభ్యులను, ఆరోగ్య కార్యకర్తలను భాగస్వాములను చేస్తూ కమిటీలు వేశారు కానీ ఆచరణలో అవి క్రియాశీలకంగా కనిపించడం లేదు.
బాల్య వివాహల గురించి ఎవరైనా ఫిర్యాదు చేయోచ్చు. నోటిమాట ద్వారా గాని, రాత పూర్వకంగానో, ఉత్తరం ద్వారానో, ఫోను తోనో ఫిర్యాదు చేయచ్చు.
చట్టంలో ఉన్న లోపాల్ని గుర్తించి సవరించుకోవడం కోసం మీడియాని ఉపయోగించుకోవాలి. మానవ సంబందాల్ని చిక్కబరుస్తూ బాల్య వివాహాల్ని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు జరిగేలా చూడాలి. బాల్యవివాహం వాళ్ళ జరిగే నష్టాల్ని వెలుగులోకి తేవాలి. అందుకు మాస్ మీడియాని ఉపయోగించుకోవాలి. మీడియా అధిపతులు, సినిమా రూపకర్తలు సామాజిక బాధ్యతగా భావించి బాల్యవివాహాల వంటి సామాజిక సమస్యలపై ప్రజలకి అవగాహన కలిగేలా కార్యక్రమాలు రూపొందించాలి. సామూహిక కార్యక్రమాలు, జాతరలు, పండుగలు, నవరాత్రి ఉత్సవాలు వంటి వాటిని చైతన్యం పెంచడం కోసం వేదికలుగా మలుచుకోవాలి. పెళ్లి రిజిస్టర్ చేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు . అనర్హులని చేయాలి . ఆడపిల్లల విద్యావకాశాలు పెంచాలి. ఆడపిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి. బాలికల రక్షణ అవకాశాలు మెరుగు పడాలి.
"భారత దేశం ఓ గొప్పదేశం . మంచి భవిష్యత్ కోసం బాలికలు, మహిళలను భాగస్వాములుగా చేయాలి . బాలికల్ని బాలికలుగానే ఉంచాలి. వధువులుగా కాదు ' అని దక్షిణాఫ్రికాకు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టాటూ ఆకాంక్ష. ఆయన ఆకాంక్షించినట్లు మంచి భవిష్యత్ కోసం బాలికలు, మహిళలను భాగస్వాములుగా చేయాలన్నా, బాలికల్ని వధువులుగా కాదు బాలికలుగానే ఉంచాలన్నా రాజకీయ సంకల్పం ఉండాలి. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పెద్ద ఎత్తున బాల్యవివాహాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. చర్చలు జరగాలి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, శాసనాలు చేసినా మనలో మార్పు రానంత వరకూ, మనలో చైతన్యం రానంత వరకూ ఏమి చేసినా ఫలితం ఉండదు. బాల్య వివాహాలకి బాల్యం బలి అవుతూనే ఉంటుంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ ..
- వి . శాంతి ప్రబోధ
--------------------------------------------------
*Republished
మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com
జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.