ఈ వీడియోలో డాన్స్ పెర్మార్మ్ చేస్తున్నది సుకుమారన్ మోహన్ కుమార్. మేమంతా ఆయనను పిలుచుకునే సింపుల్ నేమ్ మోహన్ సర్ కాగా, కేరళ మాష్టారనీ, ఇంగ్లీషు మీడియం సర్ అనీ ఆయనని పేరంట్స్ కూడా ఇష్టంగా పిలుచుకునేవారు. బోనకల్,వత్సవాయి ప్రాంతాలలో ఇంగ్లీషు మీడియంలో ఆయనకు మంచి టీచర్ గా గుర్తింపు ఉంది. నేను కృషి విద్యాలయంలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించాల్సి వచ్చినపుడు పేరంట్స్ ఎక్కువమంది నుండి వచ్చిన సూచన మోహన్ సర్ ని తీసుకురండని. ఆయన అపుడు కృష్ణా జిల్లా వత్సవాయిలో పనిచేస్తున్నారు. నేను వత్సవాయి వెళ్ళి సర్ తో మాట్లాడి ఒప్పించి బోనకల్ తీసుకువచ్చాను. అప్పటి నుండి కృషి మూతబడేవరకు ఆయన మా స్కూల్లో పనిచేశారు.
బోనకల్ లో కృషి విద్యాలయం టాప్ స్కూల్ గా నిలవడానికి కారణమైన వ్యక్తులలో మోహన్ సర్ ది గణనీయమైన పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఆయనను నమ్ముకుని మాత్రమే తమ పిల్లలను స్కూలుకి పంపిన పేరంట్స్ చాలా మంది ఉన్నారు. ఆయన వత్సవాయి నుండి వస్తే అక్కడ నుండి మా స్కూల్ కు వచ్చిన విద్యార్ధులు ఉన్నారు. ఇంతక్రితం వీడియోలో ప్రేయర్లో వార్తలు చదివిన స్టూడెంట్ పేరు చింతాల శ్రావణ్ కుమార్ అలా వచ్చినవాడే. శ్రావణ్ వత్సవాయి నుండి కేవలం మోహన్ సర్ వచ్చాడు కనుక ఆయన కోసం అక్కడ స్కూల్ మానేసి ఇక్కడకు వచ్చేవాడు. వాళ్ళ డాడీ రోజూ బండిపై తీసుకుని వచ్చేవాడు. ఇలా మరికొందరున్నారు. అంటే అపుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుచోట్ల పనిచేస్తే వత్సవాయి, బోనకల్ అవి రెండూ ఇపుడు రెండు రాష్ట్రాలలో ఉండడం గమనార్హం. బోనకల్, వత్సవాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బోర్డరు మండలాలు.
ఆయన ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. చాలా స్కూల్స్ వారు మోహన్ గారిని తమ స్కూల్లో టీచరుగా పనిచేయించడానికి ప్రయత్నాలు చేసేవారు. ఆయన కేవలం జీతం కోసం పనిచేసేవాడు కాదు. పిల్లలతో కలసి మెలసి పోయేవాడు. వారికి పాఠం వచ్చేలా శ్రద్ధగా విసుగు లేకుండా, విసుక్కోకుండా పాఠాలు చెప్పేవారు. బోధనలో ప్రతీ విద్యార్ధి పట్ల కేర్ తీసుకునేవారు. ఎపుడూ ఏక్టివ్ గా ఉండేవారు. పిల్లలను విసుగుకున్నట్లు నేను చూడలేదు. ఆయనను ఇష్టపడని విద్యార్ధి, పేరంట్, సహోపాధ్యాయులు లేరనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన ఇంగ్లీషు మీడియం టీచర్ అయినా తెలుగు మీడియం విద్యార్ధులందరూ కూడా మోహన్ సర్ తో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయనతో కలసి పనిచేసింది ఐదు సంవత్సరాలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే మనిషి.
ఆయనకు నాకూ వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉంది. మా ఇంట్లో అందరికీ మోహన్ సర్ అంటే ఇష్టం.అసలాయన్ని ఇష్టపడనివారుండరని ముందే చెప్పాను కదా. కేరళ పండుగలు, సంస్కృతీ సాంప్రదాయాల గురించి చెప్పేవారు. వ్యక్తిగతంగా, స్కూల్ ఇంప్రూవ్ మెంట్ కు కూడా పర్సనల్ గా సలహాలు ఇచ్చేవారు. స్కూల్లో పిల్లలకోసం ఏ ప్రోగ్రాం చేసినా మనస్పూర్తిగా సహకరించేవారు. నాకు ఆయన మలయాళం, ఇంగ్లీషు నేర్పడానికి ప్రయత్నం చేశారు. నేనాయనకు తెలుగు నేర్పడానికి ప్రయత్నం చేశారు. స్కూలు కంటిన్యూ అయి ఉంటే ఆ రెండు భాషలు నాకు వచ్చేయేమో. నన్ను కేరళ రమ్మని రెండు సార్లు పట్టుబట్టి అడిగారు. నేనెపుడూ వివిధ వ్యాపకాలతో బిజీగానే ఉండేవాడిని కనుక వెళ్ళలేకపోయాను. సారీ మోహన్ సర్. స్కూలు కంటిన్యూ అయి ఉంటే మోహన్ సర్ ఖచ్చితంగా బోనకల్ లోనే ఉండేవారని చెప్పగలను. ఉంచేవాడిని కూడా.
ఆయనింటికి వెళితే ఎవరినైనా చాలా మర్యాదగా చూస్తారు. సార్ కి వచ్చే ఆదాయంలో మర్యాదలకే ఎక్కువ ఖర్చు చేస్తారనుకుంటాను. ఎక్కడో కేరళలో పుట్టి ఇక్కడకు వచ్చిన మోహన్ సర్ ని పరిచయం ఉన్నవారెవరూ మరచిపోరు. మనిషి కమల్ హాసన్ లా ఉంటారు. మనసు సున్నితం. అందుకే ఆయనను సుకుమార సుందర మోహన్ కుమారుడు అనాలనిపించింది. సార్ కి ఇద్దరు కూతుర్లు. నీతూ మాత్రం మాకు తెలుసు మా స్కూల్ లో చదివింది. మేడం గారి పేరు గుర్తులేదు. ఇంకో అమ్మాయి పేరు తెలియదు. ప్రస్తుతం ఆయన ఫోటోలను వాట్సాప్లో పంపినవి ఈ టపాలో ఉంచాను.
మోహన్ సర్ తెలుగు చదవలేరు కానీ బాగానే మాట్లాడతారు. అపుడపుడు వాట్సాప్ లో నేను ఆయన టింగ్లీషులో (తెలుగుని ఇంగ్లీషులో వ్రాయడం) మాట్లాడుకుంటాం. మోహన్ సర్ ఇపుడు గుజరాత్ అహ్మదాబాద్ లో హయ్యర్ సెకండరీ స్కూల్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్వగ్రామం కేరళలోని తిరువల్లా. ఆయన పూర్తి పేరు సుకుమారన్ మోహన్ కుమార్.
మోహన్ సర్ ఎక్కడున్నా బాగుండాలని మరింత మంది విద్యార్ధులకు మంచిగా పాఠాలు చెపుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎప్పటిలాగే ముందుండాలని కోరుకుంటున్నాను. మోహన్ సర్ కృషి విద్యాలయంలో పనిచేయడానికి ఒప్పించేందుకు సహకరించిన టి.కే.ప్రసాద్ గారికి, రాధా మేడం గారికి కృతజ్ఞతలు.
మోహ సర్ జీ మీరు చేసిన డాన్స్ గుర్తుందా? సర్ ని నేనే బలవంతంగా షూటింగ్ తీయడం లేదని, తీసినా ఎడిటింగ్ లో కట్ చేస్తామని చెప్పి చేయించాము. ఎలా చేసినా 22 సంవత్పరాల తరువాత మీ జ్ఞాపకాలను ఇలా పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇలా వ్రాసుకుంటూ పోతే మోహన్ సర్ గురించి చాలా పేజీలు, చాలా జ్ఞాపకాలు వ్రాయాల్సి ఉంటుంది. వీలున్నపుడు మరోసారి ఆయనతో అనుబంధాలను పంచుకుందాం.
ప్రస్తుతం మోహన్ సర్ మరియు వారి కుటుంబం ఫోటోలు కృషి విద్యాలయం విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కోసం దిగువన ఉంచుతున్నాను.మీరూ సర్ తో మీకున్న అనుబంధాన్ని కామెంట్ ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను.
- పల్లా కొండలరావు,
28-04-2020,
చొప్పకట్లపాలెం.