వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే పతితల ఉద్ధరణ జరుగుతుందా!?


వట్టికోట అళ్వార్ స్వామి వ్రాసిన "ప్రజల మనిషి" నవలలో రాంభూపాల్ రావు అనే ఒక గ్రామ పెద్ద ఉంటాడు. తన ఇంటిలో శుభకార్యం జరిగినప్పుడు అక్కడికి వచ్చే అతిథులలోని రసికుల కోసం భోగం మేళం ఏర్పాటు చెయ్యిస్తాడు. అలాగే భోగం మేళాన్ని చూడడం ఇష్టం లేనివాళ్ళ కోసం వైష్ణవుల చేత కచేరీ ఏర్పాటు చెయ్యిస్తాడు. అప్పట్లో బూతు, పవిత్రత రెండూ పక్కపక్కనే ఉండేవి. అప్పట్లో ఆడవాళ్ళు గడప దాటి ఉద్యోగాలు చెయ్యడం నిషిద్ధమే కానీ భోగం కులానికి చెందిన స్త్రీలు గడప దాటడం నిషిద్ధం కాదు. అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో జమీందార్‌లూ, హైదరాబాద్ రాష్ట్రంలో దేశ్‌ముఖ్‌లూ & దేశ్‌పాండేలూ భోగం వృత్తిని బాగానే పోషించారు. ఒక పతివ్రతకి ఒకే భర్త ఉంటాడు కానీ ఒక భోగం స్త్రీకి మాత్రం లెక్క లేనంత మంది మొగుళ్ళు ఉంటారు. ఒక భోగం స్త్రీ ఒక రోజు ఓ ఆంగ్లేయునితోనూ, ఇంకో రోజు ఓ నిజాం సైనికునితోనూ, ఇంకో రోజు ఓ బ్రాహ్మణునితోనూ, ఇంకో రోజు ఓ బలిజవానితోనూ, ఇలా అన్ని కులాలవాళ్ళతో పడుకుంటుంది. పెళ్ళికి కులం ఒక అడ్డంకే కానీ వ్యభిచారానికి అలాంటి అడ్డంకులు ఏమీ ఉండవు. అయినప్పటికీ భోగం కులంలో కూడా అనేక ఉపశాఖలు ఉండేవి. అవి మున్నూర్ భోగం, తెలగా భోగం, ముస్లిం భోగం, దొమ్మరి భోగం వగైరా. విచిత్రమేమిటంటే భోగం కులంలో కూడా ఒక శాఖవారు ఇంకో శాఖవారి ఇంటిలో భోజనం చేసేవారు కాదు. వ్యభిచారంలో కొత్తదనం ఏమీ లేదు. అది కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న సాంఘిక దురాచారం. కానీ కొంత మంది post-modernism (ఆధునికాంతరవాదం) పేరుతో వ్యభిచారాన్ని సమర్థిస్తున్నారు.

పురుషాధిక్య సమాజంలో అసూర్యంపశ్యలు(సూర్యుణ్ణి కూడా కన్నెత్తి చూడని స్త్రీలు) మాత్రమే కాదు, ఊరిలో ఉన్న మగవాళ్ళందరితోనూ పడుకునే భోగకాంతలు కూడా ఉంటారు. మగవాడు తన భార్య అసూర్యంపశ్య అయ్యి ఉండాలనుకుంటాడు కానీ తాను మాత్రం భోగకాంతల దగ్గరకి వెళ్ళడానికి సిగ్గుపడడు. అప్పట్లో డబ్బున్న కుటుంబాలకి చెందిన స్త్రీలకి మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. వాళ్ళు సుమతీ శతకం లాంటివి చదివేవాళ్ళు కానీ స్త్రీవాదం లాంటివి అప్పట్లో లేవు. భర్త ఎంత మంది పరకాంతలతో తిరిగినా భార్య తన భర్త కాళ్ళ దగ్గరే పడి ఉండేది. అప్పట్లో స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించడం అంటే చెలియలికట్టని దాటి సముద్రంలోకి దూకడం లాంటిదనుకునేవారు. పూర్వం సముద్రతీర గ్రామాలలోకి సముద్ర నీరు రాకుండా ఉండేందుకు తీరంలో గోడలు కట్టేవారు. ఆ గోడల్ని చెలియలికట్టలు అనేవారు. ఏ స్త్రీ అయినా స్వేచ్ఛ కోసం పరితపిస్తే ఆమె చెలియలికట్టని దాటింది అనేవాళ్ళు. కానీ భోగం కులానికి చెందిన స్త్రీల చుట్టూ ఎలాంటి చెలియలికట్టలూ ఉండవు. మగవాళ్ళకి పాద సేవ చెయ్యడానికి భార్య అవసరమైనట్టే అతనికి శారీరక సుఖాన్ని ఇవ్వడానికి భోగకాంత అవసరమనుకునేవాళ్ళు. ఎంత మంది స్త్రీలని గడప దాటకుండా చేసినా కొంత మంది స్త్రీలకు గడప దాటే అవకాశం ఇవ్వడం పురుషాధిక్య సమాజంలో ఒక అవసరం.

ఇప్పుడు జమీందారీ వ్యవస్థ రద్దై భోగం వృత్తికి పెద్ద ప్రోత్సాహం లేకుండా పోయింది కానీ పేదరికం వల్ల ఆ వృత్తిలో చేరేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అ వృత్తిలోకి చేరినవాళ్ళకి పోలీసుల నుంచి తరచూ వేధింపులు ఎదురవుతుంటాయి. అమెరికాలో libertarian feminism పేరుతో వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలని కొరేవాళ్ళు ఉన్నట్టే ఇందియాలో పతితల ఉద్దరణ పేరుతో దాన్ని చట్టబద్దం చెయ్యాలని కోరేవాళ్ళు ఉన్నారు. Libertarianism అనేదే ఒక జోక్. అది ప్రజల జీవితాలపై ప్రభుత్వ నియంత్రణ చాలా పరిమితంగా ఉండాలని కోరే ఒక భావజాలం. ఎంత పరిమితంగా అంటే ప్రభుత్వం ప్రైవేత్ ఆస్తి హక్కుల పరిరక్షణ తప్ప ఏదీ చేపట్టకూడా ఉండేంత! అలా అనుకునేవాళ్ళు వ్యభిచారం లాంటి విషయాలలో కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదనుకుంటారు. వ్యభిచారానికి ఫెమినిజం రంగు పులమక్కరలేదు. స్త్రీవాదం గురించి ఆలోచించేవాళ్ళని చెలియలికట్టని దాటినవాళ్ళని చూసినట్టు చూసిన రోజుల్లో కూడా వ్యభిచారం ఉండేది. పతితల ఉద్దరణ పేరుతో వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలనడం కూడా హాస్యాస్పదమే. సాని సంసారిగా మారొచ్చు కానీ సంసారి సానిగా మారకూడదు. వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే ఆ వృత్తి నుంచు బయటపడాలనుకునేవాళ్ళు కూడా బయటకి రాకుండా ఆ వృత్తిలోనే ఉండిపోతారు.

వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే పతితలని ఉద్దరించినట్టు ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. రఘుపతి వెంకటరత్నం గారు వేశ్యలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఆ వృత్తి నుంచి బయటకి తీసుకురావడానికి ప్రయత్నించారు. పతితలకి న్యాయం చెయ్యాలనుకుంటే అలా చెయ్యొచ్చు కానీ వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే ఏ వేశ్యకైనా పెళ్ళి చేసుకుని వ్యభిచారం మానెయ్యాలనే ఆలోచన వస్తుందా? వ్యభిచారంపై నిషేధం ఉన్న దేశాలలో కూడా libertarianism పేరుతో స్త్రీలకి ఒళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలని వాదించేవాళ్ళు ఉన్నారు. ఇక వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే ఆ వృత్తి నుంచి బయటకి రావాలనుకునేవాళ్ళు కూడా అందులోనే ఉండిపోతారు. అప్పుడు తాము చేస్తున్న పని చట్ట ప్రకారం నేరం కాదు కనుక ఆ విషయంలో తమని నిర్దేశించే హక్కు ఇతరులకి లేదని వాళ్ళు అనగలరు. తమకి చట్టపరమైన అడ్డు తొలిగిందని మరి కొంత మంది ఆ వృత్తిలోకి చేరుతారు. వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే సమాజం ఇంకా కుళ్ళిపోతుంది కానీ బాగుపడదు.

భోగం వృత్తిని హిందీలో "నాచ్" అనేవాళ్ళు. దాన్ని ఇంగ్లిష్‌లో nautch లేదా notch అనే స్పెల్లింగ్‌లతో వ్రాసేవాళ్ళు. అప్పట్లో భోగం స్త్రీల చేత దేవాలయాల దగ్గర నాట్యం చెయ్యించేవాళ్ళు. "నాచ్" అంటే నాట్యం అని అర్థం. ఆడవాళ్ళు గడప దాటడం నిషిద్ధమైన రోజుల్లో కూడా హిందూ పుణ్యక్షేత్రమైన వారాణసీ పట్టణంలో వందలాది మంది స్త్రీలు "నాచ్" వృత్తిలో ఉండేవాళ్ళు. ఇలాంటివి స్త్రీల అభ్యున్నతికి వ్యతిరేకం కనుక బ్రహ్మ సమాజంవాళ్ళి ఆంగ్లేయులపై ఒత్తిడి చేసి బెంగాల్, మద్రాస్ రాష్ట్రాలలో "నాచ్" వృత్తిని నిషేధింపచేశారు. 1955లో Immoral Trafficking Prevention Act రావడం వల్ల నాచ్ కులంవాళ్ళకి వ్యభిచారం చేసి సంపాదించే అవకాశం కూడా లేకుండా పోయింది. వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే నాచ్ వృత్తి రోజుల నాటి స్థాయికి స్త్రీల పరిస్థితి దిగుతుంది కానీ స్త్రీలకి ఎలాంటి మేలూ జరగదు.

- Praveen Kumar,
4-5-2014.
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

  1. ఉద్ధరణ జరగదు. మహా అయితే పోలీసుల వేధింపులు తగ్గుతాయేమో.

    ReplyDelete
  2. పోలీస్ వేధింపులు కూడా ఉండవనిపిస్తే మరి కొంత మంది స్త్రీలు ఆ వృత్తిలోకి వస్తారు, ఆ వృత్తిలో ఇది వరకే ఉన్న స్త్రీలు అందులోంచి బయటకి రారు.

    ReplyDelete
  3. > అసూర్యంపశ్యలు(సూర్యుణ్ణి కూడా కన్నెత్తి చూడని స్త్రీలు)

    సరైన అవగహన కాదు.

    పశ్య అంటే చూడబడినది. అసూర్యంపశ్య అంటే సూర్యుడి చేత కూడ చూడబడనిది అని అర్థం.
    అంటే ఎన్నడూ ఇంటి గడపదాటి బయటికి రాని స్త్రీ అన్నమాట. పుట్టింట్లో ఎన్నడూ గడపదాటలేదు. మేనాలో పరదాల చాటున మెట్టింటికి వెడుతుంది, అక్కడ కూడా ఎన్నడూ గడపదాటి బయటకు రాలేదు. ఇదీ భావం.

    ఐతే రామాయణంలో ఒక ఆసక్తి కరమైన సంఘటన ఉంది. యుద్ధానంతరం రాముడు సీతను సంగరరంగభూమికి రప్పిస్తాడు సర్వాలంకారభూషితగా. ఆవిడను చూడాలని వానరులు కుతూహలపడటమూ, వారి పెద్దలు అదిలించటమూ చూసి రాముకు ఒక ముక్క అంటాడు. యజనాదుల్లోనూ, ఆపదల్లోనూ, ఉత్సవాల్లోనూ కులస్త్రీలు అందరిముందుకూ రావటమూ దర్శనమివ్వటమూ అక్షేపణీయం కావు అని. అంటే అసూర్యంశపశ్యత్వానికీ కొన్ని మినహాయింపులున్నాయన్నమాట.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top